గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి.
ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి.
నేటి గద్ధర్ న్యూస్, పినపాక:
గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం పినపాక మండలం లోని వివిధ గ్రామపంచాయతీలను సందర్శించి గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులు గ్రామపంచాయతీలలో 2 నుండి 5 నెలల వరకు జీతాలు పెండింగ్ ఉన్నాయని దీనివలన ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులు చెత్తా,చెదారం మధ్య దుర్గంధ వాసనల మధ్య తమ ఆరోగ్యాలను, ప్రాణాలను పణంగా పెట్టి చాలీ,చాలని వేతనాలతో పనిచేస్తూ, పల్లెలను పరిశుభ్రంగా ఉంచుతూ, ప్రజల ఆరోగ్యాలను, ప్రాణాలను కాపాడుతున్నప్పటికీ గ్రామపంచాయతీ కార్మికుల పట్ల సంబంధిత అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. అసలే చాలీ,చాలని వేతనాలతో పని చేస్తున్న వారికి నెలల తరబడి జీతాలు చెల్లించకపోతే వారి కుటుంబాలను ఎలా పోషించుకుంటారని ప్రశ్నించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి వారి జీతాలు మొత్తం చెల్లించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీల ఆదాయాలలో గ్రామపంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించటానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మేము అధికారంలోకి వస్తే గ్రామపంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిందని అన్నారు. ఇచ్చిన హామీ అమలు కోసం ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతనాల చెల్లింపు పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తే తమ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామన్నారు.