నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతినిధి :
రిజర్వేషన్ల చరిత్ర , దాని నేపథ్యం , రిజర్వేషన్ల అమలు , జరుగుతున్న తీరు తీరు తెన్నులు , నేడు ఆ రిజర్వేషన్లు ఎదుర్కొంటున్న సమస్యలు , సవాళ్లు అంశంపై ఈనెల 15వ తేదీన ఎస్సీ , ఎస్టీ , బీసీ , మైనార్టీ ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న సదస్సును పురస్కరించుకొని రూపొందించిన కరపత్రాలను బుధవారం ఖమ్మం నగరంలోని జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు . ఈ సందర్భంగా వేదిక చైర్మన్ డాక్టర్ కే వి. కృష్ణారావు , కన్వీనర్ షేక్ .నజీమా లు మాట్లాడుతూ ఎస్సీ , ఎస్టీ , బీసీలు , మైనార్టీ లకు బదులుగా అగ్రవర్ణాలకు కూడా రిజర్వేషన్లను ప్రసాదిస్తూ అసలు రిజర్వేషన్ ఉద్దేశాన్ని నీరుగారుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు . సామాజిక సాధికారిత కోణంలో రిజర్వేషన్లు ఆవిర్భవిస్తే … పాలకులు ఆర్థిక ప్రతిపాదికనా రిజర్వేషన్ల అంశాన్ని చూడటం సమంజసం కాదన్నారు . కులగణన కార్యక్రమాన్ని చేపట్టిన అనంతరం బీసీ లకు వారి జనాభా దామాషా అనుసరించి , అందరికీ ఆమోద యోగ్యమైన రీతిలో స్తానిక సంస్థ ల ఎన్నికలలో రిజర్వేషన్లను ప్రకటించి అమలు చేయాలని సూచించారు . ఈనెల 15వ తేదీన శనివారం ఉదయం 10 గంటలకు స్థానిక ఐఎంఏ హాలులో ఈ రిజర్వేషన్లు అంశంపై నిర్వహించనున్న సదస్సులో పలువురు ప్రముఖులు పాల్గొని రిజర్వేషన్ల గురించి వివరిస్తారని తెలిపారు . మేధావులు , ప్రగతి శీల కామకులు , ప్రజాస్వామ్యవాదులు , ప్రజాతంత్ర వాదులు , ఆలోచన పరులు , విద్యావేత్తలు , పలు ప్రజా , కుల సంఘాల నాయకులు , కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో సదస్సుకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు . ఈ కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో కన్వీనర్లు జంగిపల్లి రవి , రవీందర్ నాయక్ , వీరనారి మణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్యా ఉపేంద్ర బాయి , జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ఝాన్సీ , వేదిక నాయకులు పాషా , శ్రీనివాస్ చారి , జగదీష్ , వీరన్న , శ్రీనివాస్ నాయక్ , రమేష్ , రాంబాబు , సమితి ఉపాధ్యక్షులు నాగమణి , కార్యదర్శి జయ, నాయకులు లలిత , జ్యోతి , చందు , కల్పన తదితరులు పాల్గొన్నారు .