◆పొట్ట కూటి విదేశాలకు వెళ్లిన భారతీయులు…
◆మృతుల్లో 40 మంది భారతీయులే…
నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి జూన్ 12:
నైనారపు నాగేశ్వరరావు✍️
భారత్ నుంచి విదేశాలకు పని కోసం ఎక్కువ మంది వెళ్లే దేశాలలో అరబ్ దేశం కువైట్ కూడా ఒకటి.ఎక్కవగా నిర్మాణ రంగ పనుల కోసం మన దేశం నుంచి చాలా మంది కువైట్ వెళ్తుంటారు.మంచి సంపాదన వస్తుందని,తమ కుటుంబాలు బాగుపడతాయ్ అనే ఆశతో సొంత ఊర్లను వదిలి జీవనోపాధి కోసం కువైట్ వెళ్లిన కొంత మంది భారతీయలు ఇప్పుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.కువైట్ లో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగి పలువురు భారతీయులు సజీవదహనమయ్యారు.దక్షిణ కువైట్‌లోని మంగాఫ్ పట్టణంలోని ఓ ఆరు అంతస్తుల బిల్డింగ్ లో బుధవారం ఉదయం 6 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.ప్రమాద సమయంలో బిల్డింగ్ లో కేరళ,తమిళనాడు,మహారాష్ట్ర, యూపీ,బిహార్ రాష్ట్రాలకు చెందిన కార్మికులు సహా మొత్తం 195 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం.వీరంతా ఒకే కంపెనీలో పనిచేస్తున్నట్లు సమాచారం. మొదట కిచెన్ లో ప్రారంభమైన మంటలు క్షణాల్లోనే భవనమంతా వ్యాపించినట్లు అధికారులు తెలిపారు.ఈ ఘటనలో 35 మంది మంటల్లో కాలి సజీవదహనమవ్వగా,మరో ఆరుగురు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.మృతుల్లో 40 మంది భారతీయులేనని జాతీయ మీడియా తెలిపింది.మృతులంతా భారతీయులేనని ప్రధానంగా కేరళ,తమిళనాడు రాష్ట్రాలకు చెందినవారని తెలుస్తోంది.ఇక ఈ ప్రమాదంలో మరో 50 మందికి పైగా గాయపడ్డారని,వీరిలో 30 మంది భారతీయులేనని సమాచారం.ప్రమాదం జరిగిన సమయంలో భవనంలోని చాలా మంది నిద్రలో ఉన్నారు.దీంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.