సింగరేణి విద్యా సంస్థల్లో 100 శాతం ఫలితాలు సాధించాలి…
సింగరేణి విద్యా సంస్థల పనితీరుపై సమీక్ష… సీఎండీ ఎన్ బలరామ్.
నేటి గదర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి హైదరాబాద్ జూన్ 23:
నైనారపు నాగేశ్వరరావు ✍️
సింగరేణి విద్యా సంస్థలను అత్యుత్తమ విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్ బలరామ్ పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.ఇందులో భాగంగా సింగరేణి చరిత్రలో తొలిసారిగా రామగుండం-2 ఏరియాలోని సెక్టర్-3 పాఠశాలలో సీబీఎస్ఈ బోధనను త్వరలోనే ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు.ఈ మేరకు ఇప్పటికే చర్యలు తీసుకోవడం జరిగిందని, అలాగే సింగరేణి ఆధ్వర్యంలో నడుస్తున్న 9 పాఠశాలలు,1జూనియర్ కళాశాల,1డిగ్రీ కాలేజీ,1పీజీ కాలేజ్,పాలిటెక్నిక్ కళాశాలల పనితీరుపై తొలిసారిగా శనివారం సాయంత్రం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అన్ని పాఠశాలల్లో గత ఏడాది సాధించిన 10వ తరగతి ఫలితాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.గత ఏడాది పదో తరగతిలో 100 శాతం ఫలితాలు సాధించిన సెక్టర్-3 పాఠశాల భూపాలపల్లి పాఠశాలల యాజమాన్యాలను అభినందించారు. మిగిలిన పాఠశాలలు కూడా విద్యార్థుల చదువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ,చొరవ తీసుకోవాలని సంబంధిత పాఠశాలల ప్రిన్సిపాల్ లను ఆదేశించారు.సింగరేణి విద్యా సంస్థల్లో దాదాపు 7500 మంది విద్యను అభ్యసిస్తున్నారని,గత ఏడాది 94 శాతం ఫలితాలు సాధించినట్లు జీఎం(ఎడ్యుకేషన్) నికోలస్ వివరించారు.
సింగరేణి విద్యా సంస్థలను దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్,కరస్పాండెట్లపై ఎక్కువగా ఉందని,అందరూ సమన్వయంతో పని చేయాలని సీఎండీ పిలుపునిచ్చారు. పాఠశాలల్లో అహ్లాదకర వాతావరణం ఉండేలా చూడాలని,ఖర్చుకు వెనకాడకుండా పాఠశాలల ఆధునికీకరణకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.పవిత్రమైన విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వాళ్లు మరింత అంకిత భావంతో పని చేయాలని, విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసాన్ని,క్రీడాశక్తిని కూడా పెంపొందించేలా బోధన సాగాలన్నారు.సింగరేణి విద్యా సంస్థల్లో ఇతరుల జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని,సమస్యలు ఉంటే యాజమాన్యం దృష్టికి తీసుకొస్తే సత్వరమే పరిష్కరిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్(పర్సనల్, ఆపరేషన్స్) ఎన్వి కె శ్రీనివాస్,జీఎం(కో ఆర్డినేషన్) జి దేవేందర్,జీఎం(ఎడ్యుకేషన్) నికోలస్,అన్ని పాఠశాలల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్,ఇతర అధికారులు పాల్గొన్నారు.