– నిర్లక్ష్యపు నీడలో తహసిల్దార్ కార్యాలయం
– తహసిల్దార్ కార్యాలయంలో దొంగలు
– బూర్గంపాడు రెవెన్యూ వ్యవస్థ పై మొదటి నుంచి ఆరోపణలే
నేటి గదర్, జూన్ 28,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
అలవాల వంశీ 9052354516 :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల ఎమ్మార్వో కార్యాలయంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి స్థానికంగా నెలకొని ఉంది. ఆ కార్యాలయంలోని అధికారులు నిజంగా విధులు నిర్వర్తిస్తున్నారా..? అనే ప్రశ్న స్థానికంగా ఎప్పటికప్పుడు ఉత్పన్నం అవుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా అక్రమ ఇసుక, మట్టి తోలకాలు, అక్రమ ఇసుక స్టాక్ పాయింట్లపై బూర్గంపాడు రెవెన్యూ అధికారులు … ప్రభుత్వ యంత్రాంగం నిద్రపోతుందా అన్నట్లుగా నటిస్తూ, ఎటువంటి చర్యలు తీసుకోకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువవుతున్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా ఎమ్మార్వో కార్యాలయంలో సామాన్యులు దొంగతనానికి పాల్పడ్డారంటే అక్కడ అధికారులు ఉద్యోగాలు చేస్తున్నారా..? నిద్రమత్తులో ఉన్నారా..? అంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు. పినపాక నియోజకవర్గం లోని అత్యధిక జనాభా గల బూర్గంపాడు మండల రెవెన్యూ కార్యాలయంలో నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో ఈ సంఘటనను బట్టి ప్రజలు అర్థం చేసుకోవాల్సి ఉంది.
స్థానికులు తెలిపిన వివరాలు అసలేం జరిగిందంటే….
” బూర్గంపాడు మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో కొందరు దొంగతనానికి ప్రయత్నించారు. ఎమ్మార్వో కార్యాలయంలోని సెక్షన్ రూమ్ కి వెనుక భాగంలో ఉన్న స్టోర్ రూమ్ లోకి కొందరు సులభంగా తలుపును నెట్టుకొని ప్రవేశించినట్లు తెలుస్తుంది. ఆ రూమ్ లో ఉన్న ఇన్వర్టర్ బ్యాటరీలను, అక్కడ స్టోర్ చేసి ఉంచిన కొన్ని పేపర్లను దొంగలు దొంగిలించినట్లు సమాచారం. ఈ విషయంపై రెవెన్యూ అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించగా వారు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దొంగతనానికి పాల్పడిన వారు చెత్త కాగితాలు, ప్లాస్టిక్ వస్తువులను సేకరించి జీవనం గడిపే వారని సమాచారం.”
అయితే సామాన్యులు సైతం తలుపులు నెట్టుకొని ఎమ్మార్వో ఆఫీస్ లోకి ప్రవేశించే అంతటి భద్రంగా బూర్గంపాడు రెవెన్యూ కార్యాలయం ఉన్నదా..? అనే ప్రశ్న ప్రస్తుతం తలెత్తుతుంది. అదే కరుడుగట్టిన దొంగలైతే సెక్షన్ రూమ్ కి పక్కనే ఉన్న స్టోర్ రూమ్ నుండి సెక్షన్ రూమ్ లోకి అత్యంత సునాయాసంగా ప్రవేశించవచ్చు అని పలువురు పేర్కొంటున్నారు. అదే జరిగితే సెక్షన్ రూమ్ లో ఉన్న కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ సామాగ్రి దొంగతనానికి గురై అవకాశాలు లేకపోలేదు. అంతేకాక సెక్షన్ రూమ్ లోనే రెవెన్యూ కి సంబంధించిన ముఖ్యమైన పత్రాలు సైతం చోరీకి గురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంతటి దారుణమైన దుస్థితిలో రెవెన్యూ కార్యాలయం ఉన్నదా అంటే అది కేవలం అధికారుల నిర్లక్ష్యమే అని పలువురు ఆరోపిస్తున్నారు. తట్టితే ఊడిపోయే తలుపులు.. నెట్టితే పడిపోయే కిటికీలతో పాపం ఆ రెవెన్యూ అధికారి తన కార్యాలయాన్ని నెట్టుకొస్తున్నారా..? అని పలువురు మేధావులు ఎద్దేవా చేస్తున్నారు. ఇకనైనా రెవెన్యూ అధికారులు నిద్రావస్థ నుంచి, నిర్లక్ష్యం నుంచి బయటకు వచ్చి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని స్థానికులు ముక్తకంఠంత కోరుతున్నారు.
ఈ విషయంపై బూర్గంపాడు DT రామ నరేశ్ ని నేటి గదర్ ప్రతినిధి వివరణ కోరగా…
” కార్యాలయంలో కొందరు చోరీకి యత్నించిన మాట వాస్తవమే, అయితే విలువైన వస్తువులు ఏమీ చోరీ జరగలేదని తెలిపారు. ఈ విషయంపై పోలీసు అధికారులకు సమాచారం అందజేయడం జరిగిందన్నారు. దొంగతనం జరిగిన ప్రాంతంలో కొత్త తలుపులను ఏర్పాటు చేస్తూ భద్రత పెంచుతామని తెలిపారు.”