★ప్రతి రైతు పంట సాగు వివరాలు నమోదు చేసుకోవాలి
★వ్యవసాయ శాఖ విస్తరణాధికారి కొమరం లక్ష్మణ్ రావు
నేటి గదర్ న్యూస్ ,పినపాక:
పినపాక మండలం ఈ బయ్యారం పంచాయతీ పరిధిలో రైతులు సాగు చేస్తున్న జీలుగు పంట పొలాలను శుక్రవారం వ్యవసాయ శాఖ విస్తరణాధికారి కొమరం లక్ష్మణ్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతుల తో మాట్లాడుతూ … సంప్రదాయ ఎరువులు ఐన జీలుగు ,పచ్చి రొట్ట,పిల్లి పెసర తదితర పంటలు సాగు చెయ్యడం ద్వారా భూమి కి బలం చేకూరుతుంది అని అన్నారు. జీలుగు 25 నుంచి 30రోజులకు మొక్క ఏపుగా పెరిగి పూతదశకు చేరుకుంటుంది. ఆ సమయంలో మొక్కలను మొదళ్ల వద్ద కత్తిరించాలి లేదా రోటోవేటర్ సహాయంతో కలియ దున్నాలి. దున్నిన తర్వాత 100కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేటు దుక్కిలో వేయాలి. సూపర్ ఫాస్పేట్ వల్ల మొక్కల అవశేషాలు బాగా కుళ్లి పచ్చిరొట్ట ఎరువులు తయారవుతాయని తెలిపారు.జీలుగ సాగు వల్ల మూడు టన్నుల పచ్చిరొట్ట లభిస్తుందన్నారు.
మొక్కలకు రెండు శాతం నత్రజని, సూపర్ ఫాస్పేట్‌ను అదనంగా అందిస్తాయి.జింక్, మాంగనీసు, ఇనుము, కాల్షియం వంటి సూక్ష్మధాతువులను పంటకు చేకూర్చుతాయి.నేలలో కరగని మూలకాలను పంటకు అనుకూలంగా మార్చుతాయి. నీటి నిల్వ సామర్థ్యం పెంచుతాయి.నేల సహజ మిత్రులైన వానపాముల ఉత్పత్తికి దోహదం చేస్తాయి. కుళ్లేదశలో నీటిని సక్రమంగా అందివ్వాలి అని రైతులకు సూచనలు చేశారు.సాగుతో భూమిలో నత్రజని శాతం పెరిగి రైతులు పండించే పంట నాణ్యంగా పెరుగుతుందన్నారు.
★ప్రతి రైతు వారి సర్వే నెంబరుపై వేసిన పంట వివరాలు నమోదు చేసుకోవాలి★
ప్రతి రైతు తమ పరిధిలో గల వ్యవసాయ శాఖ అధికారులను కలిసి వారి సర్వే నెంబరుపై పంట నమోదు చేయించుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ముక్కు బాలసుబ్బారెడ్డి, యాగంటి అంకిరెడ్డి, ముక్కు శివాజీ రెడ్డి , బట్ట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.