నేటి గదర్ న్యూస్,హైదరాబాద్ ప్రతినిధి:
టీ20 వరల్డ్ కప్ విజేతగా టీమిండియా అవతరించింది. బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో రోహిత్ సేన 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియాకు ఇది రెండో టీ20 ప్రపంచకప్ టైటిల్. గతంలో 2007లో ధోని సారథ్యంలో విశ్వ విజేతగా నిలిచారు.
ఈ మ్యాచ్ లో రోహిత్ సేన సమిష్టిగా రాణించింది. చివరి 4 ఓవర్లలో సౌతాఫ్రికా విజయానికి 26 పరుగులు అవసరం కాగా.. భారత బౌలర్లు అద్భుతం చేశారు. 17వ ఓవర్ తొలి బంతికి హార్దిక్ పాండ్యా, క్లాసెన్ ను అవుట్ చేసి భారత్ జట్టులో ఆశలు రేపాడు. ఆ మరుసటి ఓవర్ లో బుమ్రా.. మార్కో జెన్ సెన్ ను ఔట్ చేసి కేవలం 2 పరుగులు ఇచ్చాడు. ఇక 19వ ఓవర్ వేసిన అర్షదీప్ తన మార్క్ చూపించాడు. తీవ్ర ఒత్తిడిలోనూ శభాష్ అనిపించేలా బౌలింగ్ చేసి కేవలం 4 పరుగులిచ్చాడు. ఇక ఆఖరి ఓవర్లో సఫారీ జట్టు విజయానికి 16 పరుగులు అవసరం కాగా పాండ్యా మొదటి బంతికి మిల్లర్ ని ఔట్ చేసి దక్షిణాఫ్రికాను దెబ్బతీశాడు. చివరకు ప్రొటీస్ జట్టు నిర్ణీత ఓవర్లలో 169 పరుగులు చేసి విజయానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
అంతకుముందు టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (76) కీలక మ్యాచ్‌లో అదరగొట్టాడు. అక్షర్ పటేల్ (47) దూకుడుగా ఆడాడు. 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును కోహ్లీ, అక్షర్ పటేల్ ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. చివర్లో శివమ్ దూబె (27) మెరుపులు మెరిపించాడు.