– మత్తుకు బానిసలు అవుతున్న యువత
– రోడ్డున పడుతున్న కుటుంబాలు
– గుడుంబాని అరికట్టడంలో విఫలమవుతున్న అధికారులు
నేటి గద్దర్, జూలై 05
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
అలవాల వంశీ 9052354516 :
గ్రామగ్రాన మద్యం కోరలు చాచి విస్తరిస్తుంది… రెక్కాడితేకాని డొక్కాడని కుటుంబాలపై పగబట్టిమరీ కాటేస్తోంది… దీంతో.. ముందుకు పోతే బాయి.. వెనక్కిపోతే చెరువు అన్నచందంగా మారాయి పేదల బతుకులు… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు పరిసర ప్రాంతాల్లో గుప్పుమంటున్న గుడుంబా మహమ్మారి కాటుకు సామాన్యులు విలవిలలాడుతున్నారు…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంతోపాటు మండల పరిధిలోని రెడ్డిపాలెం, గొమ్మూరు, లక్ష్మీపురం, సోంపల్లి, సారపాక, తాళ్ల గొమ్మూరు, మోతే, ఇరవైండి తదితర ప్రాంతాల్లో గుడుంబా ఏరులై పారుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధిత మద్యాన్ని, గుడుంబా అమ్మకాలను నిర్మూలిస్తామని పేర్కొంటున్నప్పటికీ అధికారులు మాత్రం ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చలేక పోతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. బూర్గంపాడు మండల కేంద్రం, రెడ్డిపాలెం లంబాడి కాలనీ ప్రాంతాలలో విచ్చలవిడిగా గుడుంబా తయారీలో జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక్కడ తయారవుతున్న గుడుంబాను చుట్టుపక్కల ప్రాంతాలకు అమ్ముకుంటూ కాసులు గడిస్తున్నారు గుడుంబా వ్యాపారులు. యువత, పేద ప్రజలను టార్గెట్ చేసుకొని విచ్చలవిడిగా గుడుంబా అమ్మకాలు కొనసాగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. యువత గుడుంబా మత్తుకు బానిసలు అవుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడుంబా మహమ్మారికి జీవితాలు బలి అవుతుంటే ఎక్సైజ్ శాఖ అధికారులు గుడుంబాను అరికట్ట లేకపోవడానికి కారణాలు ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. విస్తృతంగా తనిఖీలు నిర్వహించి గుడుంబా అమ్మకాల నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడానికి గల కారణాలు ఏమిటని పలువురు చర్చించుకుంటున్నారు. అధికారులు ఎప్పుడో ఒకసారి ఒక 50 లీటర్లు 100 లీటర్లు బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి మొత్తం గుడుంబా వ్యవస్థను నిర్మూలించినట్లుగా చెప్పుకోవడం తప్ప గుడుంబా వ్యవస్థ పై నిర్దిష్టమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బూర్గంపాడు మండల పరిసర ప్రాంతాల్లో అసలు గుడుంబా వ్యవస్థ లేదన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తుండడం, ఎటువంటి తనిఖీలు చేయకపోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ అధికారులు గుడుంబాలు నిర్మూలించడానికి కంకణం కట్టుకొని ఉంటే స్థానిక ప్రాంతాల్లో గుడుంబా వ్యాపారం ఏ విధంగా సాగుతుంది అనే ప్రశ్నల సైతం లేకపోలేదు. అధికారులు గుడుంబాను అరికట్టాలనుకున్న వారు అరికట్టలేని పరిస్థితుల్లో గుడుంబా వ్యాపారం సాగుతుందా..? అని స్థానికులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు గుడుంబా నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రజల జీవితాలు ఆగం కాకుండా కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాం : ఎక్సైజ్ సీఐ రెహమాన్షా బేగం
నిషేధిత గుడుంబా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి అన్న ఆరోపణలపై భద్రాచలం ఎక్సైజ్ సీఐ రెహమాన్షా బేగం ను నేటి గదర్ ప్రతినిధి వివరణ కోరగా ఆమె మాట్లాడుతూ…
” తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేని మద్యం, గుడుంబా నిషేధించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు ఎప్పటికప్పుడు బూర్గంపాడు భద్రాచలం పరిసర ప్రాంతాల్లోని గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహిస్తూనే ఉన్నాం. గుడుంబాస్తావారాలను ధ్వంసం చేస్తున్నాం. ఎవరైనా నిషేధిత గుడుంబా, తదితర మద్యం తయారీ, అమ్మకాలు చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తప్పవు. గ్రామంలో ఉండే ప్రజల సైతం ఈ విషయంపై అవగాహన కలిగి ఉంటూ గుడుంబా నిర్మూలనకు సహకరించాలి. నిషేధిత మద్యం, గుడుంబా గురించి సమాచారం వస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. ” అని తెలిపారు.