★ ఏవో ఎస్ రఘు దీపిక
జూలూరుపాడు, జూలై 22, నేటి గద్దర్ : రైతు బీమా పథకానికి అర్హులైన రైతులు ఈనెల 30వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జూలూరుపాడు మండల వ్యవసాయ శాఖ అధికారి ఎస్ రఘు దీపిక ఒక ప్రకటనలో తెలిపారు. 18 సంవత్సరాలు పైబడి 59 సంవత్సరాల వయస్సు గల కొత్త వారు, లేదా నామిని చనిపోయిన వారు, నామిని చేర్పులు, మార్పులు లాంటివి జులై 30 వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అన్నారు. అదే విధంగా ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు పొందిన రైతులు కూడా రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు. రైతు బీమా పథకం చాలా విలువైనదని, ఏ కారణం చేతనైనా రైతు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల బీమా ప్రభుత్వం అందిస్తుందని, తద్వారా ఈ పథకం రైతులకు ఆసరాగా నిలుస్తుందని తెలిపారు. రైతు ఆధార్ కార్డ్, పట్టా పాస్ పుస్తకం, నామినీ ఆధార్ కార్డ్ ల జిరాక్సులు సంబంధిత క్లస్టర్ ఏ ఈ ఓ కి ఇచ్చి ఆన్లైన్ చేయించుకోవాలని కోరారు. కావున ఈ అవకాశాన్ని మండల రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.