నేటి గదర్, జూలై 23,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో,
అలవాల వంశీ, 9052354516 :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో ప్రధాన రహదారిపై పెద్ద గొయ్యి ఏర్పడి ప్రమాదకరంగా కనిపిస్తుంది. అయినప్పటికీ స్థానిక పంచాయతీ అధికారులు ఆ సమస్యను తీర్చేందుకు ఆసక్తి చూపడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు ఇప్పటికే స్థానిక అధికారులకు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశాలు ఇస్తున్నప్పటికీ కొందరు కింది స్థాయి అధికారులు ఆయన మాటలు పెడచెవిన పెడుతున్నారా అని పలువురు స్థానికులు మండిపడుతున్నారు. భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నిత్యం రద్దీగా ఉంటుంది. వేలాది వాహనాలు ఆ సెంటర్ గుండా రాకపోకలు సాగిస్తుంటాయి. ఉదయం, సాయంత్రం సమయాల్లో స్కూలుకు, కాలేజీలకు వెళ్లే పిల్లల వాహనాల సైతం ఈ మార్గం గుండా ప్రయాణిస్తూ ఉంటాయి. అసలే వర్షాకాలం కావడంతో ఆ సెంటర్లో ఏర్పడిన భారీ అగాధాలలో నీళ్లతో నిండిపోయి ఉంటున్నాయని, తెలియని వారు అటువైపుగా వస్తే రోడ్డు ప్రమాదం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు వాపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఈ విషయంపై దృష్టి సారించాలని స్థానికులు ముక్తకంఠంలో కోరుతున్నారు. ఇప్పటికే ప్రజల సమస్యలు ఆయన చెవికి వస్తే ఇట్టే పరిష్కారం అయిపోయే విధంగా విస్తృతంగా పర్యటనలు చేస్తూ, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఈ సమస్యపై ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.