ఆ దళిత కాలనీలో విద్యుత్ లైన్ వేసేనా..?
అంధకారంలో దళిత కాలనీవాసులు…
ఎమ్మెల్యే దృష్టి సారించాలని దళిత ప్రజలు…
నేటి గదర్ న్యూస్, ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జులై 23:
పినపాక నియోజకవర్గ కేంద్రమైన మణుగూరు మండల పరిధిలోని కట్టు మల్లారం గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనికీ విద్యుత్తు లైను లేకపోవడంతో అంధకారంతో కునారిల్లుతున్నారు.ఈ గ్రామంలో దళితులు 31 కుటుంబాల వారు నివసిస్తున్నారు.వీరంతా మల్లెపెళ్లి ఓసి నిర్వాసితులు.మణుగూరు ఓసిలో భూములు,ఇండ్లు సర్వం కోల్పోయి నిరాశ్రయులైనారు.వారికి వచ్చిన అరాకొరా ప్యాకేజీలతో కట్టు మల్లారం గ్రామంలో గత 10 సంవత్సరాల క్రితం ఇంటి స్థలాలు కొనుక్కొని ఇళ్ల నిర్మాణం చేసుకొని జీవిస్తున్నారు.నాటి నుండి నేటి వరకు మా కాలనీకి కరెంటు లైన్ వేయమని ప్రజాప్రతినిధులకు,అధికారులకు మొరపెట్టుకున్నా నేటి వరకు కరెంటు లైన్ వేయకపోవడం వలన కాలనీవాసులు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారు.20 కుటుంబాల వారికి కరెంటు మీటర్లు ఉన్నప్పటికీ వారు సుమారుగా 150 మీటర్ల దూరం నుండి విద్యుత్తు కనెక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉందని వాపోయారు.మా ఓట్లను గంపగుత్తగా దండుకోవడమే తప్ప మా సమస్యలను పరిష్కరించే నాధుడే లేడని దళిత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మా కాలనీలో కరెంటు లైన్ వేయమని చెప్పులు అరిగేలా తిరిగి చెప్పిన మా గోడు ఆలకించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టుకున్న నేటికీ మా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మా దళిత వాడపై దృష్టి సారించి కరెంటు లైన్ వేపించి ఆదుకోవాలని కోరుతున్నారు.