నేటి గదర్, ఆగస్టు 28,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో :
అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించాలని సిపిఐఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం బి నర్సారెడ్డి, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి కోరారు. బుధవారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగు బండి నర్సిరెడ్డి సౌజన్యంతో పట్టణంలోని రాజుపేట కాలనీకి చెందిన అందూరి నిర్మల కి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుని సిపిఎం నాయకులు అందించారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి, గడ్డం స్వామిలు మాట్లాడుతూ… కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ వంటి పథకాలకు నిధులు పెంచాలని కోరారు. సీఎం రిలీఫ్ ఫండ్ పథకం కింద రోగులకు వైద్య నిమిత్తమైన ఖర్చులలో కనీసం 90 శాతం రిలీఫ్ ఫండ్ గా అందించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలు అమలులో జాప్యం వీడి, సత్వరమే బాధితులకు అందేలాగా అధికారులు కూడా కృషి చేయాలని కోరారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అందూరి నిర్మలాకి ఆపరేషన్ కి అయ్యే ఖర్చుల కోసం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అయిన నర్సిరెడ్డి ప్రత్యేక చొరవతో సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయించారని ఈ సందర్భంగా నర్సిరెడ్డికి సిపిఐఎం బృందం అభినందనలు తెలియజేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పారెల్లి సంతోష్ కుమార్, నాదెండ్ల లీలావతి, మహిళా సంఘం పట్టణ కార్యదర్శి డి సీతాలక్ష్మి, సభ్యులు రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.