తాడ్వాయి మండలం.
ములుగు జిల్లా.
దేశానికి రోల్ మోడల్ గా కొండపర్తి గ్రామం నిలవాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు.
మంగళవారం ఎస్ ఎస్ తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామంలో రాష్ట్ర గవర్నర్ పర్యటించారు. తొలుత కొమరం భీం, బిర్సాముండ విగ్రహాలను, పాఠశాలలో డిజిటల్ తరగతులను, అంగన్వాడీ కేంద్రాన్ని, 7,84,700 రూపాయల వ్యయంతో నిర్మించిన మసాలా యూనిట్, 7,76,594 వ్యయంతో కుట్టు మిషన్ యూనిట్ ను ప్రారంభించారు. అనంతరం రిమోట్ తో వ్యవసాయ మోటార్లు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గవర్నర్ మాట్లాడుతూ ఈ గ్రామంలో 70 గృహాలు 285 మంది ప్రజలు ఉన్నారని, చిన్న గ్రామమని అభివృద్ధిలో ఆదర్శంగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. సమాజాభివృద్ధికి మన సేవలు ఎంతో అవసరం పేర్కొన్నారు. అటవీ ప్రాంతంలో ఉన్న
ఈ గ్రామంలో డిజిటల్ తరగతులు ప్రారంభించుకోవడం ఎంతో సంతోషమని ఆయన అభినందించారు. విద్యార్థులు ఇంగ్లీషు బాగా మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు. కొండపర్తి గ్రామంలో మహిళల ఆర్థికాభివృద్ధికి చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు ఆవశ్యకత ఉందని తెలిపారు. స్వయం ఉపాధి యూనిట్ల ద్వారా ఆర్థికాభివృద్ధి సాధన జరుగుతుందని తెలిపారు. గుజరాత్ రాష్ట్రంలో అమూల్ ఏవిధంగా ప్రసిద్ధిగాంచిందో అదే తరహాలో కొండపర్తి గ్రామం కారం, పసుపు, మసాలా, యూనిట్లకు అంతటి పేరు ప్రఖ్యాతలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ ప్రాంతంలో మిర్చి సాగు బాగుందని మిర్చి పౌడర్ కు మంచి ఇమేజ్ రావాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా మిర్చి పౌడర్ బాగా ఫేమస్ కావాలని ఆయన సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వికసిత్ భారత్ సంకల్పానికి ఈ గ్రామం ఆదర్శంగా నిలవాలని పిలుపు పిలుపునిచ్చారు. మారుమూల ప్రాంతమైన కొండపర్తి గ్రామాన్ని తాను దత్తత తీసుకున్నానని, ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తయారు చేయుటకు ఆదివాసి మారుమూల గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. తాను రాష్ట్రం లో ఏడు ఆదివాసి గ్రామాలను దత్తత తీసుకున్నానని అన్ని గ్రామాలను అభివృద్ధిలో ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుటకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో కోటి 50 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఆదివాసీల అభివృద్ధికి తాను, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నట్లు తెలిపారు. చిన్న పరిశ్రమలు ఏర్పాటు ద్వారా ఆదాయం సమకూరుతుందని తద్వారా అదివాసులు ఆర్థికాభివృద్ధి సాధిస్తారని పేర్కొన్నారు. తాను, రాష్ట్రపతి, రాష్ట్ర మంత్రి సీతక్క అందరు ఆదివాసి బిడ్డలమని ఆయన పేర్కొన్నారు. దేశానికి కొండపర్తి గ్రామం మోడల్ గా కావాలని పేర్కొన్నారు.
మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర
టి.ఎస్. ఎస్పీ శబరీష్, గ్రామస్తులు తదితరులు గవర్నర్ ను ఘనంగా సన్మానించి మెమోంటో అంద చేశారు.
*రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ* ఈ ప్రాంత అభివృద్ధికి జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగపు సేవలను అభినందించారు. దట్టమైన అడవిలో ఉన్న ప్రాంతమని రవాణా సౌకర్యం కూడా లేని గ్రామాన్ని గవర్నర్ దత్తత తీసుకున్నట్లు తెలిపారు.
ఈ గ్రామాన్ని బయట ప్రపంచంతో అనుసంధానం చేస్తూ ఉత్పత్తులను అందించాలని, తద్వారా మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలని తెలిపారు. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధనలో కొండపర్తి గ్రామం రోల్ మోడల్ కావాలని ఆమె సూచించారు. ఈ గ్రామానికి అనతి కాలంలోనే రహదారి సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయుటకు గవర్నర్ ఏడు బోర్లు మంజూరు చేశారు అని తెలిపారు. రెండు పంటలు పండించడానికి అవకాశం కలిగిందని ఆమె గవర్నర్ కు కృతజ్ఞతలు తెలిపారు. 40 పరిశ్రమలు, దిశా స్వచ్చంద సంస్థ సహకారంతో 100 పాఠశాలలను దత్తత తీసుకున్నామని, ఆయా పాఠశాలల్లో విద్యార్థులు ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడుతున్నారని ఆమె తెలిపారు. అద్భుతమైన విద్యా బోధన జరుగుతుందని అన్నారు. ఆదివాసి గ్రామాల ప్రజలు ఐకమత్యంతో ఉండాలని అప్పుడు సమైక్యతతో అభివృద్ధి సాధిస్తామని ఆమె తెలిపారు.
*గవర్నర్ కార్యాలయ ప్రధాన కార్యదర్శి దాన కిషోర్ మాట్లాడుతూ* ఈ గ్రామంలో పర్యటించాలని గవర్నర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈ గ్రామంలో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కోటి 50 లక్షల అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. చిన్న గ్రామమైనప్పటికి అభివృద్ధి చేయాలని పర్యావరణ పరిరక్షణ గ్రామంగా తీర్చిదిద్దాలని గవర్నర్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు తెలిపారు. గిరిజన గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ప్రతి కుటుంబానికి ఆదాయం రావాలని సంకల్పంతో ఈ గ్రామం అభివృద్ధిలో ముందుండాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ తయారవుతున్న చిల్లీ, పసుపు, మసాలా యూనిట్ మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని అన్నారు. హైదరాబాదులో మహిళా స్వయం సహాయక సంఘాలకు వ్యాపారాలు నిర్వహణకు ప్రముఖ ప్రాంతంలో దుకాణాన్ని కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో 150 ఎకరాల్లో లాభదాయకమైన మార్కెటింగ్ కలిగిన ఆధునిక వ్యవసాయ సాగు చేపట్టేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. గవర్నర్ తీసుకున్న ఏడు గిరిజన గ్రామాల్లో అభివృద్ధి చర్యలు చేపడుతున్న ఆయన తెలిపారు. గిరిజనుల అభివృద్ధికి పాటుపడే సంస్థలకు రాష్ట్రవ్యాప్తంగా అవార్డు ప్రధానం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
*జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ* ఈ గ్రామంలో 70 గృహాలు 285 మంది జనాభా కలిగిన ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయుటకు గవర్నర్ దత్తత తీసుకోవడం అభినందనీయమని తెలిపారు. గవర్నర్ దత్తత తీసుకున్న తదుపరి ఈ గ్రామం అభివృద్ధిలో ముందుందని పేర్కొన్నారు. అంగన్వాడి కేంద్రం, పాఠశాల శిథిలావస్థలో ఉన్నాయని 70 లక్షలతో మరమ్మతులు నిర్వహించి అధునాతన హంగులతో వినియోగంలోకి తెచ్చినట్లు తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధికి గవర్నర్ కోటి 50 లక్షలు మంజూరు చేయడం చాలా సంతోషమని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ ప్రధానమైన ఈ ప్రాంతంలో వ్యవసాయంగాన్ని మరింత అభివృద్ధి చేయుటకు 7 కమ్యూనిటి బోర్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
50 ఎకరాల్లో మిర్చి సాగవుతుందని అదనంగా సాగు చేపట్టేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ శబరిస్, ఐటిడిఏ పీఓ చిత్ర మిశ్రా, జిల్లా అటవీశాఖ అధికారి రాహూల్ కిషన్ జాదవ్, గవర్నర్ కార్యాలయ సంయుక్త కార్యదర్శి భవాని శంకర్, గవర్నర్ ఏ డి సి మేజర్ అమన్ కుండు, గవర్నర్ సిఎస్ఓ శ్రీనివాసరావు, గ్రంథాలయ కమిటీ చైర్మన్ రవి చందర్, గ్రామ పెద్దలు లచ్చు పటేల్, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.