ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ అనుచరుడు, ఎయిమ్ ప్రకాశం జిల్లా కమిటీ అధ్యక్షుడు కసుకుర్తి ఆగమన రాజును పోలీస్ స్టేషన్ నుంచి అవమానకరంగా బయటకి పంపిన టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావుపై నేషనల్ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. శుక్రవారం టంగుటూరు పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం సమీపంలోని సర్వీస్ రోడ్డు పక్కన, కొందరు విద్యార్థుల రాత్రి ఇంటర్మీడియట్ పరీక్షల అనంతరం కేకు కట్ చేశారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న, ఎస్సై నాగమల్లేశ్వరరావు రోడ్డు పక్కన కేక్ కోసిన విద్యార్థులను మందలించి వారి ఫోన్లను స్వాధీనం చేసుకొని, విద్యార్థులను వారి మోటార్ సైకిళ్ళను స్టేషన్కు తీసుకువచ్చారు. తన బంధువులు కూడా ఆ విద్యార్థుల్లో ఉండటంతో ఆగమన రాజు పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. అప్పటికే అక్కడ టిడిపి నాయకులు తన్నీరు చిరంజీవి తదితరులు ఎస్ఐ తో మాట్లాడుతున్నారు. ఆగమన రాజు కూడా ఎస్సై ముందు కుర్చీలో కూర్చున్నారు. దీంతో ఎస్ఐ నాగమల్లేశ్వరరావు తెలుగుదేశం నాయకుడు చిరంజీవి ముందు చిటిక వేసి మరీ, మీ టైం అయిపోయింది, బయటికి పో అని అవమానకరంగా ఆగమన రాజును బయటకు పో అని వేలు చూపించారు. విద్యార్థుల్లో తన పరిచయస్తుల పిల్లలు ఉన్నారని ఆగమన రాజు చెబుతున్నా ఎస్ఐ వినిపించుకోలేదు. ఎస్ఐ నాగమల్లేశ్వరరావు దళిత యువకుడి పట్ల కుల వివక్ష, అనుచిత ప్రవర్తనపై దళిత సంఘాల మండిపడ్డాయి. ఘటన జరిగిన వెంటనే ఆగమన రాజు ఎస్సై తనను అవమానించిన ఘటన గురించి ఎయిమ్ వ్యవస్థాపకులు ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. ఎయిమ్ రాష్ట్ర నాయకుల సూచన మేరకు ఆగమన రాజు టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావుపై జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశారు.
