రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 01:- పదకొండేళ్ల బాలికను తాకరానిచోట పట్టుకోవడం ఆమె పైజామా లాగడం, ఆమెను కల్వర్టు కిందకు లాగడం అత్యాచార ప్రయత్నం కాదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పుపై,భారత సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది.ఈ నిర్ణయం పిల్లల హక్కుల పరిరక్షణకు ఒక ముఖ్యమైన అడుగని,విజన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్ వంగరి కైలాస్ హర్షం వ్యక్తం చేశారు.మంగళవారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ ఆలయన్స్ దాఖలు చేసిన ప్రత్యేకమైన 5 పిటిషన్ లను సుప్రీంకోర్టు అంగీకరించిందని, బాధితురాలికి ప్రాతినిధ్యం వహించడానికి అనుమతి ఇవ్వడం స్వాగతించ దగ్గ విషయం అన్నారు.జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ పిల్లల రక్షణ,హక్కుల కోసం 416 జిల్లాల్లో 250 కి పైగా ఎన్జీవోల నెట్వర్క్ తో కలిసి పోరాడుతోందని,విజన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ మెదక్,నిర్మల్ జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తుందని తెలిపారు.దేశంలో ఒక్క ఆడబిడ్డ కూడా అన్యాయానికి గురి కాకూడదని ఆయన అన్నారు.అలాంటి వారికి ఈ అలయన్స్ అండగా నిలుస్తుందని తెలిపారు.పిల్లల హక్కుల పట్ల సర్వోన్నత న్యాయస్థానం ఎంత సున్నితంగా వ్యవహరిస్తుందో ఈ కేసు విషయంలో జోక్యం చేసుకోవడం ద్వారా మనకు అర్థమవుతుందన్నారు.ఈ కేసులో ముఖ్య విషయాలను ఆయన తెలియజేశారు.ఈ తీర్పులో చేసిన కొన్ని పరిశీలనలు ముఖ్యంగా, 21,24, 26 పేరాలలో తీర్పు పూర్తిగా సున్నితత్వం లేకపోవడాన్ని గుర్తించారని, దాదాపు నాలుగు నెలల చర్చల తర్వాత ఇచ్చిన ఈ తీర్పు చట్ట విరుద్ధంగా,అమానవీయంగా ఉందని ధర్మాసనం పేర్కొందని తెలిపారు.మూడున్నర సంవత్సరాలకు పైగా ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయబడలేదని,అధికారిక దర్యాప్తు ప్రారంభించకుండా,మూడు సంవత్సరాలకు పైగా కాలయాపన జరిగిందని పేర్కొన్నారు.పేద బాల బాధితురాలికి ఈ సుదీర్ఘ కాలం విచారణతో తీవ్రమైన అన్యాయం జరిగిందని న్యాయస్థానం గుర్తించిందని తెలిపారు.
