లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం.. 25 కేవిఏ కొత్త ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు
నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 06: అశ్వరావుపేట మండలంలోని కేశప్పగూడెం గ్రామ పంచాయతీలో ఏళ్ల తరబడి వేధిస్తున్న విద్యుత్ లో-వోల్టేజీ సమస్యలకు ఎట్టకేలకు మోక్షం లభిస్తూ, గ్రామం చీకట్ల నుంచి విముక్తి దిశగా అడుగులు వేస్తోంది. గత కొంతకాలంగా ఉన్న 15 కేవిఏ ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యం సరిపోక విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలుగుతుండటంతో, గ్రామస్థులు మరియు రైతులు పడుతున్న ఇబ్బందులను తన సమస్యగా భావించిన సర్పంచ్ భారతి ప్రత్యేక పట్టుదలతో ఈ సమస్య పరిష్కారానికి నడుం బిగించారు. నేరుగా అశ్వరావుపేట విద్యుత్ ఉప కేంద్రానికి వెళ్లిన ఆమె, అక్కడి అధికారులకు క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించగా, ఆమె విన్నపానికి సానుకూలంగా స్పందించిన ఏడీ బి. వెంకటరత్నం, ఏఈ కె. వెంకటేశ్వర్లు, సబ్ ఇంజనీర్ ఎం. శివ శంకర్, మరియు లైన్మెన్ ఎస్. రాజేష్‌లు తక్షణమే 25 కేవిఏ సామర్థ్యం గల కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను మంజూరు చేశారు. ఈ త్వరితగతిన స్పందనపై సర్పంచ్ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయగా, ఈ నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను బిగించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి, తద్వారా గ్రామానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా అందనుండటంతో గ్రామస్తులు సర్పంచ్ చొరవను కొనియాడుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.








