లైన్ క్లియర్ :సింగరేణికి తాడిచర్ల బొగ్గు బ్లాక్
ఫలించిన డిప్యూటీ సీఎం కృషి
సింగరేణికి తాడిచర్ల బొగ్గు బ్లాక్ కేటాయింపు
కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద జోషి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మధ్య కుదిరిన ఒప్పందం
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:
సింగరేణిని బలోపేతం చేసేందుకు తాడిచెర్ల బ్లాక్ 2 బొగ్గు గని కేటాయించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు గురువారం ఢిల్లీలో కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద జోషికి విజ్ఞప్తి చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడిచెర్ల రెండవ బ్లాక్ 2 బొగ్గు గని కేటాయింపుకు పూర్తి అనుకూలత ఉందని డిప్యూటీ సీఎం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. డిప్యూటీ సీఎం విజ్ఞప్తి మేరకు కేంద్రమంత్రి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. త్వరలో సింగరేణి కాలరీస్ కు కేంద్రం నుంచి బొగ్గు గని కేటాయింపుకు సంబంధించిన ముందస్తు అనుమతి లేఖను ఇస్తామన్నారు. తాజా గని కేటాయింపుతో సింగరేణిలో ప్రతి ఏడాది ఐదు మిలియన్ టన్నుల ఉత్పత్తి పెరగనుంది. 30 ఏళ్ల పాటు కొత్త గనిలో తవ్వకాలు జరుపుకునేందుకు అవకాశం ఏర్పడింది. తాడిచర్ల బ్లాక్ 2 కొత్తగని ద్వారా 30 ఏళ్ల జీవితకాలంలో 182 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలను వెలికి తీసేందుకు అవకాశం ఏర్పడింది. సింగరేణికి కేటాయించిన ఒరిస్సా రాష్ట్రంలోని నైనీ బ్లాక్ లోను సింగరేణి బొగ్గు ఉత్పత్తికి అడ్డంకులు తొలగించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడాలని కేంద్ర మంత్రుని డిప్యూటీ సీఎం కోరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ చర్చల్లో డిప్యూటీ సీఎం వెంట సింగరేణి కాలరీస్ చైర్మన్ బలరాం నాయక్, సిఎండి సయ్యద్ అలీ రిజ్వీ, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్. సింగరేణి డైరెక్టర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు