– స్ట్రాంగ్ రూములను పరిశీలించిన పీవో ప్రతిక్ జైన్
నేటి గదర్ న్యూస్, మే 05, భద్రాద్రి కొత్తగూడెం :
రోజురోజుకి ఎండలు ముదురుతున్నందున ఎంపీ ఎన్నికలలో పాల్గొననున్న సిబ్బందికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని రకాల వసతి, సౌకర్యాలు కల్పించాలని 110-(ST) అసెంబ్లీ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ అన్నారు. ఆదివారం మణుగూరు పట్టణం లోని జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో స్ట్రాంగ్ రూములు ఏర్పాటు చేసిన ప్రదేశాలను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ… పోలింగ్ స్టేషన్లకు సామాగ్రి తీసుకొని వెళ్లే పోలింగ్ సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పాఠశాల ఆవరణలో శ్యామ్యానాలు, మంచినీటి సౌకర్యం, భోజన వసతి, మజ్జిగ ప్యాకెట్లు, సమయానుకూలంగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. సామాగ్రి తీసుకొని వెళ్లేటప్పుడు వారిని సంబంధిత పోలింగ్ స్టేషన్లకు చేరవేయడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని, పోలింగ్ సిబ్బంది వారి యొక్క సామాగ్రిని సరిచూసుకోవడానికి ఇబ్బందులు కలగకుండా 11వ తేదీ సాయంత్రం వరకు పాఠశాల ఆవరణలో 1500 కుర్చీలతో పాటు అన్ని ఏర్పాట్లు చేయాలని తహసిల్దార్ కు సూచించారు. పోలింగ్ సిబ్బంది సామాగ్రి తీసుకొని వెళ్లేటప్పుడు వారు వెళ్లే బస్సులలో మంచినీటి బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయాలని అన్నారు. ఎవరు ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. పోలింగ్ సిబ్బంది వెళ్లేటప్పుడు తప్పనిసరిగా భోజనాలు చేసి వెళ్లేలా భోజనాలు కూడా సిద్ధం చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ డీటీ నాగరాజు, మణుగూరు తాసిల్దార్ రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.