నేటి గదర్, మే 26, బూర్గంపాడు / భద్రాద్రి కొత్తగూడెం :
నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ ఏడిఏ తాతారావు, మండల వ్యవసాయ శాఖ అధికారి ఆర్ శంకర్ లు అన్నారు. సోంపల్లి రెవిన్యూ పరిధిలోని రైతులకు వివిధ అంశాలపై ఆదివారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏడిఏ తాతారావు పాల్గొని మాట్లాడుతూ… రైతులందరూ నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాలలో ఇంటింటికి తిరిగి ఎవరైనా గుడ్డ సంచులలో, నకిలీ లేబుల్ ఉన్న ప్యాకెట్లలో విత్తనాలు అమ్మినట్లయితే ఎట్టి పరిస్థితులోనూ అటువంటి వారి వద్ద విత్తనాలు తీసుకోవద్దని, లైసెన్స్ కలిగిన అధికృత డీలర్ నుంచి మాత్రమే విత్తనాలను తీసుకోవాలని సూచించారు. పంట కాలం పూర్తయ్యే వరకు బిల్లును జాగ్రత్తపరచుకోవాలని తెలిపారు. అనంతరం మండల వ్యవసాయ శాఖ అధికారి ఆర్ శంకర్ మాట్లాడుతూ… గ్రామాలలో ఎవరైనా అనుమతి లేకుండా విత్తనాలు అమ్ముతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలని కోరారు. వేసవిలో లోతు దుక్కులు చేయడం వలన భూమి లోపల పొరల్లో ఉన్న పురుగుల యొక్క గుడ్లు లార్వాలను నశింపచేయొచ్చని తెలిపారు. అదే విధంగా జనుము, జీలుగా, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట పైర్ల వల్ల కలిగే ఉపయోగాలను రైతులకు వివరించారు. మట్టి పరీక్ష నమూనాలను ఏ విధంగా సేకరించాలని, మట్టి పరీక్ష ఫలితాల విశ్లేషణ గురించి తెలియజేశారు. అదే విధంగా వరి పంట అవశేషాలను తగలబెట్టడం ద్వారా జరిగే అనర్ధాలను గురించి రైతులకు వివరించారు. అనంతరం మండలంలోని లక్ష్మీ పురం, సారపాక, బూర్గంపాడులో గల విత్తనాల షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ… రైతులకు విత్తనాలు, ఎరువులు అమ్మినట్లయితే వారికి బిల్లులను ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ప్రసాద్, రైతులు గాదె నర్సిరెడ్డి, దనుగూరి నాగేశ్వరరావు, బోరెం శ్రీనివాసరావు, చలకంటి సత్యం, పండగ చిట్టెయ్య తదితరులు పాల్గొన్నారు.