నేటి గదర్, జూన్ 06, భద్రాద్రి కొత్తగూడెం :
భద్రాచలం లోని ప్రైవేట్ మారుతి నర్సింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థినీల మరణాల పై ప్రభుత్వం స్పందించి సెట్టింగ్ జడ్జితో విచారణ ఏ విద్యార్థినికి అన్యాయం జరగకుండా భద్రత కల్పించాలని మహాజన మహిళా సమైక్య ఎంఎంఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు మేకల లత మహాజన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం భద్రాచలం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ… మారుతి కళాశాలలో చనిపోతున్న విద్యార్థుల మరణాల పట్ల అనేక అనుమానాలు కలుగుతున్నాయని, కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం, వేధింపుల వల్లనే విద్యార్థినీలు చనిపోతున్నరనే బలమైన వాదనలు వినిపిస్తున్నప్పటికీ, ప్రభుత్వ అధికారులు యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదు అన్నది అనుమానాలకు దారితీస్తుందని అన్నారు. విద్యార్థినీలు చనిపోతే కుటుంబ సభ్యులను మభ్యపెట్టి ఆశ చూపించి డబ్బుతో మారుతి కళాశాల యాజమాన్యం మధ్యవర్తుల సహాయంతో అనారోగ్యం, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్లాన్ ప్రకారం తోటి విద్యార్థులతోనే అబద్ధాలు ఆడిస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రతిరోజు కళాశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల వివక్షత కూడిన వేధింపులు, మానసిక ఒత్తిడికి గురి చేయడం జరుగుతుందని ఆమె అన్నారు. సంబంధించిన ప్రభుత్వ అధికారులకు ఆర్థికంగా, స్నేహ సంబంధాల వల్ల మారుతి కళాశాల పై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా యాజమాన్యాన్ని కాపాడడం స్పష్టంగా కనిపిస్తుందని విమర్శించారు. పగిడిపల్లి కారుణ్య మృతి, విద్యార్థుల బలవన్మరణాలకు కారణమైన కళాశాల యాజమాన్యం పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నమోదు చేయాలని, అనుమానాస్పద మరణాల పై సిట్టింగ్ జడ్జితో పూర్తి ఎంక్వయిరీ జరిపించాలని, విద్యార్థుల మరణాలకు కళాశాల కారణమైతే మారుతి నర్సింగ్ కళాశాల గుర్తింపు తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహాజన మహిళ సమైఖ్య ఎంఎంఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు, నిరసన ధర్నాలు, దిష్టి బొమ్మల దహనాలు వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహాజన మహిళ సమైఖ్య ఎంఎంఎస్ జిల్లా అధికార ప్రతినిధి తెల్లని సమ్మక్క, ఉపాధ్యక్షురాలు కుంచెర్ల కుమారి, కొప్పుల నాగమణి మాదిగ, ఎస్కే సల్మా తదితరులు పాల్గొన్నారు.