★ప్రజా ప్రభుత్వంలో పైరవీలకు తావులేదు
★అక్రమ పద్ధతిలో పొందిన వాటిని రద్దు చేస్తాం
★తిరుమలాయపాలెం మండల పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నేటి గదర్,జూన్ 9 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి)
తెలంగాణలో ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వంలో ఎలాంటి పైరవీలకు తావులేదని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అక్రమ పద్ధతిలో పెన్షన్ పొందిన వాటిని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన వారికే పెన్షన్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. తిరుమలాయపాలెం మండలంలో ఆదివారం పర్యటనలో భాగంగా తిరుమలయపాలెం, రమణ తండా, బీసరాజుపల్లి, వెదుళ్ళచెర్వు, పిండిప్రోలు, తెట్టలపాడు, కేశవాపురం, తిప్పారెడ్డి గూడెం, అజ్మీరా తండా, జల్లెపల్లి, జోగులపాడు, హైదర్ సాయిపేట, పడమటి తండా, పాతర్లపాడు, గోల్ తండా, చంద్రు తండా, ఇస్లావత్ తండా, మహ్మదాపురం, కుక్కల తండా, మేకల తండా, దమ్మాయిగూడెం తదితర గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ…. తెలంగాణ ప్రజల కష్టఫలితంగానే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు. రాబోయే మూడు సంవత్సరాల్లో పాలేరు నియోజకవర్గంలో అర్హులైన వారందరికీ ఇళ్ళ స్థలం,ఇళ్ళు ఇచ్చే బాధ్యత తనదన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అనర్హులు పైరవీలు చేసి పెన్షన్ తీసుకుంటే విచారణ చేపట్టి వాటన్నింటినీ ఆపేస్తామని తెలిపారు. అర్హులైన పేదలకు పెన్షన్ ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
రెవెన్యూ అధికారులు గ్రామాల్లో సభలు పెట్టి భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. పరిష్కారం కానీ భూమి సమస్యలు తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు.
ఇళ్ళ పై నుంచి వెళ్లిన హై టెన్షన్ విద్యుత్ లైన్లను కూడా రెండు నెలల్లో మార్పిస్తామని చెప్పారు. వర్షాకాలం సాగుకు చివరి భూముల వరకు నీళ్లు వచ్చే విధంగా అధికారులు చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో మంత్రితో పాటు ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జడ్పిటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.