ఆ దళిత మైనర్ బాలుడు ఏమి పాపం చేశాడు..?
దొరల పాలన మళ్లీ వచ్చేనా..?
దళిత మైనర్ బాలుడిని కాళ్లు,చేతులు కట్టేసి కొట్టడమేంటి…
నేటి గధర్ న్యూస్ స్టేట్ బ్యూరో రంగారెడ్డి జూన్ 25:
నైనారపు నాగేశ్వరరావు ✍️
తెలంగాణ రాష్ట్రంలో గత 50 సంవత్సరాల క్రితం కుల వివక్షత రూపాలు ఇంకా వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో కొనసాగడం దారుణం.స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేటికీ దళితులపై దాడులు కొనసాగుతూనే ఉంటున్నాయని పలు సామాజిక సంఘాల నాయకులు,మేధావులు, అభ్యుదయవాదులు ముక్తకంఠంతో ఆరోపిస్తున్నారు. తెలంగాణలో ఇంకా పూర్వ కాలం సంఘటనలే కొనసాగుతున్నాయని,ముఖ్యంగా దొరల పాలనలో జరిగిన అరాచకాలు నేటికి అక్కడక్కడ ఇంకా కనిపిస్తూనే ఉన్నాయని,రోజు రోజుకు కులం, మతం అంటూ తారతమ్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో అయితే దళితులను దారుణంగా హింసిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. దళిత మహిళలు,పురుషులు అనే తేడా లేకుండా దాడులు చేస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. జామకాయలు తెంపుతున్నాడని దళిత మైనర్ బాలుడిని కాళ్లు,చేతులు కట్టేసి కొట్టారు.
వివరాల్లోకి వెళ్ళితే…
రంగారెడ్డి-షాబాద్ మండలం కేసారం గ్రామంలో మధుసూధన్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో ఉన్న జామ చెట్టుకు జామ పండ్లు తెంపుతున్నాడని దళిత బాలుడిని కాళ్లు,చేతులు కట్టేసి కొట్టాడు.బాధితుడి ఫిర్యాదు మేరకు మధుసూధన్ రెడ్డిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పలువురు దళిత సంఘాల నేతలు పేర్కొంటున్నారు.