◆ఏజెన్సీలోని గిరిజనేతర పేదల భూములకు రక్షణ కల్పించాలి.
◆ వలస ఆదివాసీల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి, వారికి కుల సర్టిఫికెట్లు ఇవ్వాలి.
◆ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్( ప్రజాపంద) మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి.
ఏజెన్సీలోని గిరిజనేతర పేదల భూములకు రక్షణ కల్పించాలని, పట్టాలు రాని గిరిజనుల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, వలస ఆదివాసుల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, వారికి కులం సర్టిఫికెట్లు ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్( ప్రజాపంథా) మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో గిరిజనులతో పాటు గిరిజనేతర పేదలు కూడా దశాబ్దాలుగా కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నారని, 20 కుంటల నుండి మూడు ఎకరాల వరకు భూములను సాగు చేసుకుంటూ, వాటిపై ఆధారపడి వారి కుటుంబాలను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నారని, గతంలో అట్టి భూములకు ప్రభుత్వం భూమిశిస్తులు కట్టించుకునేదని, రెవెన్యూ రికార్డులలో కూడా వారి భూమి ఉండేదని, వారికి పహాని నకలు కూడా ఇచ్చేవారని, దానితో సహకార సంఘాలలో పంట రుణాలు కూడా తీసుకునే వారని, దాంతో వారి భూములకు కొంత భద్రతగా ఉండి ప్రశాంతంగా జీవించేవారని అన్నారు. ప్రభుత్వం వారికి భూమిశిస్థులు రద్దు చేయడం వలన వారి భూములకు ఎలాంటి ఆధారం లేక ఆందోళన చెందుతున్నారని అన్నారు. ప్రభుత్వం వారి భూములకు భూమిశిస్తులు కట్టించుకొని వారి భూములకు భరోసా కల్పించాలన్నారు. పట్టాలు రాని గిరిజనుల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు. వలస ఆదివాసీల పోడు భూములకు కూడా పట్టాలు ఇవ్వాలని, కుల సర్టిఫికెట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు