★ ఖమ్మం.. సీతారామం
★ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్
★ నెరవేరిన కేసీఆర్ జల సంకల్పం
★ బీజీ కొత్తూరు పంప్‌హౌస్ నుంచి
గోదావరి పరవళ్లు
★ 3 జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు
అందనున్న సాగునీరు
★ కరువును పారదోలే కల్పతరువని
రైతుల సంబురాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు గ్రామ సమీపంలో ఉన్నటువంటి సీతారామ ప్రాజెక్టు ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు & పినపాక మాజీ ఎమ్మెల్యే శ్రీ రేగా కాంతారావు గారు సందర్శించి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి అనంతరం కేసీఆర్ చిత్రపటానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పాలాభిషేకం జరిగింది….
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
నిన్న కుంభకోణమని నిందించినోళ్లు.. నేడు నీటి పరవళ్లకు దండం పెట్టి ఫొటోలు దిగుతున్నరు. రీడిజైన్ తప్పంటూ నిన్న బురదజల్లినోళ్లు.. ఇప్పుడు ఘనతంతా తమదేనని ప్రచారం చేసుకుంటున్నరు. ప్రాజెక్టుల నీళ్లు తాగుతూ విషంకక్కేవాళ్లు ఉండొచ్చు! నిజం కండ్లముందున్నా చూడలేని కబోదులు మాట్లాడొచ్చు! నిండిన వాగు, పండిన చేను అబద్ధమెట్లయితది? నీళ్లు పారంగా నిండుగా నవ్విన రైతు అబద్ధమెట్లయితడు?.. కాళేశ్వరం కల్ల అయితే.. సీతారామ సత్యమెట్లయ్యింది? కేసీఆర్ జల ఆశయమే కదా.. సీతారామ జలాశయం! చెప్పండి ఇప్పుడు.. చెరపగలరా కేసీఆర్ ఆనవాళ్లు!
అపర భగీరథుడిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంకురార్పణ చేసిన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ‘సీతారామ’ పేరిట గోదావరిపై ఎత్తిపోతల పథకానికి 2016 ఫిబ్రవరి 16న శ్రీకారం చుట్టారు. భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలంలో రూ.17 వేల కోట్ల అంచనాలతో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తర సాగునీటి పథకాన్ని చేపట్టారు. 2016 ఫిబ్రవరి 18న జీవో నెంబర్ 72 ద్వారా రూ.7,926 కోట్ల నిధులను మంజూరు చేసింది. తర్వాత దశల వారీగా నిధులు మంజూరు చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు మహబూబాబాద్ జిల్లాకు కూడా నీరందించేందుకు పనులు చేపట్టింది. మూడు జిల్లాల్లో కలిపి మొత్తంగా 6,74,387 ఎకరాలను సాగులోకి తెచ్చేందుకు శ్రమించింది. ట్రయల్ రన్ తరువాయి అనే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పనులు నిలిచిపోయాయి.
ట్రయల్ రన్ సక్సెస్
—————————————
ఆరు నెలల క్రితం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని తన గొప్పగా చెప్పుకుంటున్నది. గురువారం జిల్లాకు వచ్చిన నలుగురు మంత్రులు.. కనీసం వ్యూ పాయింట్ నుంచి కూడా ప్రాజెక్టును పరిశీలించలేదు. కేవలం సీతమ్మబరాజ్‌ను, కాలువను పరిశీలించి వెళ్లా రు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద నిర్మించిన పంప్‌హౌస్ ట్రయల్ రన్‌ను గురువారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. సంబంధిత శాఖల అధికారులతో కలిసి నిర్వహించారు. కుమ్మరిగూడెం వద్ద నుంచి తొమ్మిది కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా బీజీ కొత్తూరు పంప్‌హౌస్ వరకు చేరనున్న గోదావరి జలాలు ఎత్తిపోతల ద్వారా ఒక్కసారిగా పరవళ్లు తొక్కాయి. మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రస్తుత సీజన్‌లోనే వైరా రిజర్వాయర్ వరకు గోదావరి జలాలను పారిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
నాడు విమర్శలు.. నేడు గొప్పలు..
——————————————
‘ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సీతారామ ప్రాజెక్టు ఒక భారీ కుంభకోణం. స్వతంత్ర భారతదేశంలో ఇంతటి అక్రమాన్ని చూడలేదు. రూ. వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు’ అని సచివాలయంలో జరిగిన సమీక్షలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉండగానే.. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. కానీ ప్రస్తుతం సదరు కాంగ్రెస్ నేతలే ఇప్పుడు సీతారామ ప్రాజెక్టు ప్రారంభించిన ఘనత తమదని గప్పాలు కొడుతుండడం గమనార్హం. ఎగిసిపడుతున్న గోదావరి నీళ్ల పరవళ్లకు ప్రణామాలు చేస్తూ ఫొటోలకు ఫోజులిస్తున్న కాంగ్రెస్ నేతలపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘6 నెలల్లో ప్రాజెక్టు కంప్లీట్ చేయడం ఎప్పుడైనా చూశారా? దటీజ్ కాంగ్రెస్. 2014లో పడావుపడ్డ ప్రాజెక్టును 6నెలల్లో కంప్లీట్ చేయాలంటే చిత్తశుద్ధి ఉండాలె. కడుపు నోరు కట్టుకుని పనిచేయాలె’అంటూ బీఆర్‌ఎస్ పార్టీ వ్యంగ్యంగా సెటై ర్లు వేయగా, కాంగ్రెస్ నేతలు ఆ పోస్టును పొగడ్తగా భావిస్తూ సోషల్‌మీడియాలో వాడుకోవడం కొసమెరుపు. కరువును పారదోలే కల్పతరువైన ఈ సీతారామ ప్రాజెక్టు ఫలితమంతా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనంటూ చర్చించుకున్నారు.
చేసింది కేసీఆర్.. చెప్పుకునేది కాంగ్రెస్
————————————————
సీతారామ ప్రాజెక్టుకు పునాది వేసింది.. పూర్తి చేసింది కేసీఆర్. కానీ దాని ఫలితం గురించి కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోంది. వారు ఎన్ని గప్పాలు చెప్పుకున్నా. మాజీ సీఎం కేసీఆర్ కల నెరవేరింది. గోదావరి జలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయబోతున్నాయి. అప్పటి కాంగ్రెస్ నాయకులే ఎన్నో కేసులు వేసి సీతారామను ఆపాలని చూశారు. కేసీఆర్ ఉక్కు సంకల్పం ముం దు వారి పాచికలు పారలేదు. కేంద్రంతో పోరాడి కేసీఆర్ అన్ని అనుమతులూ తెచ్చారు. ఈ ప్రాజెక్టు కోసం ఏనాడూ తట్టెడు మట్టిపోయని కాంగ్రెస్ మంత్రులు ఇప్పుడొచ్చి ట్రయల్ పేరుతో హడావిడి చేశారు. సీతారామ ప్రాజెక్టు ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే అని అన్నారు..