పంట కాలువలు ఏర్పాటు చేసి తమ భూములకు సాగునీరు అందించాలని డిమాండ్
జూలూరుపాడు, జూన్ 30, నేటి గద్దర్ : మండల పరిధిలోని గుండెపుడి గ్రామానికి చెందిన రైతులు ఆదివారం జల దీక్ష చేపట్టారు. సీతారామ ప్రాజెక్టు నుంచి వచ్చే కాలువ నుండి గుండెపుడి పంచాయతీ రైతులకు లిఫ్ట్ ఏర్పాటు చేయాలని, పంట కాలువలు ఏర్పాటు చేసి తమ భూములకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఎంతో విలువైన పంట భూములను ప్రభుత్వం అడిగిన వెంటనే సీతారామ ప్రాజెక్టు కాలువకు ఇచ్చామన్నారు. గుండెపుడి పంచాయతీ రైతులకు చుక్కనీరు ఇవ్వకుండా, వేరే జిల్లాలకు నీళ్ళను పంపించాలని ప్రభుత్వ అధికారులు ప్రతిపాదనలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతు బాధలను ప్రభుత్వం గమనించి గుండెపుడి పంచాయతీ రైతులకు లిఫ్ట్ ఏర్పాటు చేసి, పంట భూములకు నీళ్ళు అందించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొమ్మినేని కృష్ణమూర్తి, తూముకోటయ్య, గాదె నాగేశ్వరరావు, పొన్నెకంటి వెంకటేశ్వర్లు, గాదె సత్యనారాయణ, వేల్పుల గోపాలకృష్ణ, కంచర్ల శేఖర్, దుద్దుకూరి నరేష్, గాదె కృష్ణయ్య, వలమల సామేలు, దుద్దుకూరు శ్రీను, దొప్పా సత్యనారాయణ, మద్దెబోయిన నరసింహారావు, బాదావత్ రమేష్, నల్లమోతు కృష్ణయ్య, గాదె సురేష్, కళ్యాణపు నరేష్, గోగుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.