రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూలై 18:- రాష్ట్రంలో రైతులకు ఈరోజు లక్ష లోపు రుణం కలిగినటువంటి రైతుల ఖాతాల్లో నిధులను విడుదల చేయడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి రాజ్ నారాయణ అన్నారు. ఈ సందర్బంగా రైతు నేస్తం కార్యక్రమం ద్వారా ఈ రోజు హైదరాబాదు నుండి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ప్రారంభించబడిందన్నారు.ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడుతూ 12-12-2018 నుండి 09-12-2023 తీసుకున్నటువంటి పంట రుణాల అసలు మరియు వడ్డీకలిపి రెండు లక్షల లోపు ప్రభుత్వమే చెల్లిస్తుందని మొదటి విడతగా లక్షలోపు కలిగిన రుణాలను రుణమాఫీ చేయడం జరుగుతుందని తెలిపారు.మిగతా రుణాలను కూడా ఆగస్టు 15 లోపు పూర్తి చేస్తామని రైతుల కష్టాలు తీర్చడానికి రుణమాఫీ చేపట్టడం జరిగిందని దీనికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు ఉన్న క్షేత్రస్థాయిలో వ్యవసాయ మరియు బ్యాంకు అధికారులను సంప్రదించి తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని తెలిపారు.ఈ విషయంలో బ్యాంకు మరియు వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు రుణమాఫీ పై పూర్తిస్థాయి అవగాహన కల్పించారని తెలిపారు.వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి నేరుగా పలు జిల్లాల రైతులతో మాట్లాడడం జరిగిందని పేర్కొన్నారు.మెదక్ జిల్లా రామాయంపేట మండల వ్యాప్తంగా 2614మంది రైతులకు లక్ష లోపు రుణమాఫీ జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీ సత్యనారాయణ మండల వ్యవసాయ అధికారులు రాజ్ నారాయణ సతీష్ వ్యవసాయ విస్తీర్ణ అధికారులు మండల రైతులు పాల్గొన్నారు.









