మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు
జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు.
జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి మాదకద్రవ్య నియంత్రణ కమిటీ సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు.
చెక్‌పోస్టుల వద్ద నిశిత తనిఖీలు చేపట్టి ఆధునిక యంత్రాల ఏర్పాటుపై నివేదికలు సమర్పించాలని, గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. గంజాయి సాగు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు.
పాఠశాలల్లో ప్రతి బుధవారం మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పాఠశాలల సమీపంలో అక్రమ విక్రయాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గారు మాట్లాడుతూ రవాణా తనిఖీలను మరింత ముమ్మరం చేస్తున్నామని, గత నెలలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్న విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తూ అవసరమైతే డి-అడిక్షన్ కేంద్రాలకు తరలిస్తున్నట్లు వెల్లడించారు.








