★చంద్రశేఖర్ అన్న ఆశయ సాధనకై పోరాడుదాం!
★సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపంథా) మణుగూరు డివిజన్ కార్యదర్శి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.మధుసూదన్ రెడ్డి
నేటి గదర్ న్యూస్, మణుగూరు టౌన్:
కామ్రేడ్ రాయల. చంద్రశేఖర్ అన్న మరణం విప్లవోద్యమానికి తీరని లోటు అని, చంద్రశేఖర్ అన్న ఆశయ సాధన కోసం పోరాడుదాం అని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపంథా) మణుగూరు డివిజన్ కార్యదర్శి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక ఐ ఎఫ్ టి యు కార్యాలయంలో, బాంబే కాలనీ సివిల్ కార్యాలయం వద్ద చంద్రశేఖర్ అన్న చిత్రపటానికి పూలు చల్లి నివాళులర్పించి, జోహార్లు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ చంద్రశేఖర్ అన్న ఖమ్మం జిల్లా, తిరుమలాయపాలెం మండలం, పిండిప్రోలు గ్రామంలో జన్మించారని, ఖమ్మంలో డిగ్రీ విద్యను అభ్యసిస్తూ, ఉన్నత విద్యను వదిలి సమాజంలోని పేద, ధనిక అంతరాలను చూసి, దోపిడీ, పీడనలను చూసి ధనిక, పేద అంతరాలు లేని, దోపిడీ, పీడనలు లేని సమ సమాజ స్థాపన కోసం కలలుగని, అందుకోసం జీవితాంతం విప్లవోద్యమానికి అంకితమై పని చేశారన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మణుగూరు, అశ్వాపురం ఏరియాలో, సత్తుపల్లి ఏరియాలో, ఇల్లెందు ఏజెన్సీలో ఎన్నో ఉద్యమాలు నిర్వహించి, ఎన్నో నిర్బంధాలను, కష్టాలను అనుభవించాడన్నారు. ఉద్యమ ప్రస్థానంలో ఎదురైన ఎన్నో నిర్బంధాలను, కష్టాలను అధిగమించి అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చాడన్నారు. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా, కేంద్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ గా, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా, సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కమిటీ సభ్యులుగా, సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తూ, ప్రజాపంథా రాజకీయాల అభివృద్ధి కోసం, రైతాంగ ఉద్యమ అభివృద్ధి కోసం తన తుది శ్వాస వరకు పనిచేశారన్నారు. కామ్రేడ్ చంద్రశేఖర్ అన్న అకాల మరణం చెందడం బాధాకరం అన్నారు. కామ్రేడ్ చంద్రశేఖర్ అన్న మరణం విప్లవోద్యమానికి తీరనిలోటని, కాంగ్రెస్ చంద్రశేఖర్ అన్న ఆశయ సాధన కోసం పోరాడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పి. సంజీవరెడ్డి, ఆర్. ప్రసాద్, కె.రామకృష్ణ, కే. బుచ్చిరాములు, వంశీ, జంపయ్య, వేణు, చారి, సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు.