జిల్లా పరిషత్ పాఠశాలలో బియ్యం పురుగు పట్టి పాడవుతున్న… పట్టించుకోని సంభంధిత అధికారులు…
రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) సెప్టెంబర్ 25:- మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెట్టడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో డిసెంబర్ 2022 నుంచి అక్షయ పాత్ర ద్వారా భోజనాన్ని అందిస్తున్నారు.అప్పటి వరకు మధ్యాహ్న భోజనం వండడానికి ప్రభుత్వం సరఫరా చేసిన దాదాపు 40 క్వింటాళ్ల బియ్యం నేటి వరకు పాఠశాల గదిలోనే మగ్గుతూనే ఉన్నాయని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మురళీ మోహన్ అన్నారు.ఎన్నో సార్లు బియ్యం గురించి నివేదికను పంపి,బియ్యాన్ని వెనుకకు తీసుకోవాలని కోరినా,సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.నేటికీ బియ్యం పాఠశాలలో మగ్గుతూనే ఉండి పురుగులు పట్టి పాడవుతున్నాయన్నారు.పాఠశాల ఆవరణలోనే జూనియర్ కళాశాల కూడా నిర్వహించడంతో తరగతి గదులు సరిపోక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. బియ్యం తరలిస్తే పాఠశాల విద్యార్థులకు ఒక గది అదనంగా ఉండి పాఠాలు చెప్పడానికి సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. సంభందిత అధికారులు ఇప్పటికైనా స్పందించి బియ్యాన్ని తరలించాలని విద్యార్థుల తల్లి దండ్రులు,విద్యార్థులు కోరుతున్నట్లు ఆయన తెలియపరచారు.