★5ఎకరాల కు రెండవ విడతలో 2 టన్నుల దిగుమతి
★ప్రస్తుత మార్కెట్ లో టన్ను పామాయిల్ ధర రూ.20,500 లు
★ పామాయిల్ రైతు సూరినేని సత్యనారాయణ మోఖంలో చిరునవ్వు
★ నెరవేరుతున్న మండల వ్యవసాయ శాఖ అధికారుల ప్రయత్నాలు
నేటి గదర్ న్యూస్, పినపాక:
మనం ఏదైనా కొత్త పంట వేసేటప్పుడు ఇది లాభదాయకమేనా అనే డౌట్ వేధిస్తూ ఉంటుంది. ఎందుకొచ్చిన రిస్క్.. అని మళ్లీ పాత పంటల వైపే చూస్తాం. ఇప్పుడు తెలంగాణలో రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. ప్రభుత్వమేమో.. సంప్రదాయ పంటల బదులు ఆయిల్ పామ్ పంటలు వెయ్యమంటోంది. కానీ రైతులకు కాన్ఫిడెన్స్ రావట్లేదు. ఆ పంట వేస్తే, ప్రయోజనం ఉంటుందా అని డౌట్ పడుతున్నారు. ఆయిల్ పామ్ ఎలా బెటర్ క్రాప్ అవుతుందో ఈ పామ్ ఆయిల్ రైతు విజయ గాధ తెలుసుకుంటే మీకు ఇట్టే అర్థమవుతుంది.వివరాలు… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట పంచాయితీ జానంపేట గ్రామానికి చెందిన సూరినేని సత్యనారాయణ అనే రైతు కు 5 ఎకరాల భూమి కలదు. ఈ భూమిలో సంవత్సరాల నాటినుండి వరి మిర్చి పత్తి పంటలు సాగు చేసేవాడు. కానీ ఏ రోజు కూడా ఆ భూమిలో పండించిన పంటకి గిట్టుబాటు ధర వచ్చిన దాఖలాలు లేవు. పెట్టుబడులు ఫోను లాభం శూన్యం. ఈ పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని సద్వినియోగం చేసికొనిరైతులు ఆర్థికంగా ఎదగాలనే దృఢ లక్ష్యంతో గత ప్రభుత్వం పామాయిల్ పంటలు ప్రోత్సహించారు. దానికి అనుగుణంగా పినపాక మండల వ్యవసాయ అధికారులు పామాయిల్ సాగు తో కలిగే ప్రయోజనాలను విస్తృతంగా రైతులకు వివరించినప్పటికిని రైతులు ఆసక్తి చూపలేదు. అయినప్పటికీ మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, జానంపేట ఏఈఓ కేశవరావు, పినపాక ఏఈఓ రమేష్ లు కొంతమంది రైతులను ఎంపిక చేసుకొని వారికి ధైర్యం నూరి పోశారు. వారిలో జానంపేట గ్రామానికి చెందిన సూరినేని సత్యనారాయణ అనే రైతు వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చిన భరోసాతో పామ్ ఆయిల్ సాగుకు ముందుకు వచ్చారు.ఈ క్రమంలో తన 5 ఎకరాలలో పామాయిల్ మొక్కలు వేయడం జరిగింది.ఈ సంవత్సరం 2025 జనవరి 2తారీకు వరకు ఆ మొక్కలను నాటి 3 సంవత్సరాల ఒక నెల అవుతుంది. వ్యవసాయ అధికారులు ఆనాడు ఆ పామ్ ఆయిల్ రైతుకు ఏదైతే భరోసా కల్పించారు నేడు ఆ ఫలితం రానే వచ్చింది. పామాయిల్ రైతు సూరినేని సత్యనారాయణ తన 5 ఎకరాల పామాయిల్ తోటలో పామాయిల్ గెలలను కటింగ్ చేయించాడు. గురువారం మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, అదే గ్రామానికి చెందిన పిఎసిఎస్ డైరెక్టర్ కామేశ్వర రావు,పలువురు రైతులు, ఏవోలు ఎస్ నాగేశ్వరరావు , రమేష్ తదితరులు పరిశీలించారు. ఒక నెల క్రితం మొదటి కటింగ్ చేయగా, గురువారం పామాయిల్ గెల ల రెండవ కట్టింగ్ జరిగింది.తన 5 ఎకరాలలో రెండు టన్నుల దిగుబడి వచ్చినట్లు రైతు సత్యనారాయణ నేటి గద్దర్ న్యూస్ కి తెలిపారు. ఒక్కటన్నకి ప్రస్తుతం ధర రూ.20వేల500 కాగా మార్కెట్లోతన పంట విక్రయిస్తే రూ. 41వేలు వస్తాయని చిరునవ్వుతో తెలిపారు. గతంలో ఇతర పంటలు వేసి ఆర్థికంగా చితికిపోయానని… తను పామాయిల్ సాగు వేయడానికి ప్రోత్సహించిన మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు కు, గత ఏ ఈ ఓ కేశవరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పామాయిల్ సాగు చేయాలనే రైతులకు ఎలాంటి సూచనలు కావాలన్నా తనని సంప్రదిస్తే తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ వ్యవసాయ శాఖ అధికారుల భగీరథ ప్రయత్నానికి ఫలితం వస్తుండడంతో అటు ఆ శాఖ అధికారులు, పామాయిల్ రైతు సత్యనారాయణలు హర్ష వ్యక్తం చేశారు.