నేటి గదర్ న్యూస్, కరకగూడెం:
గిరిజనులు అత్యంత భక్తిశ్రద్ధలతో చేసుకొని సమ్మక్క సారలమ్మ జాతరకు సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా జాతర అయిపోయే వరకు అన్ని రకాల వసతి సౌకర్యాలు కల్పించే విధంగా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
శుక్రవారం నాడు తన చాంబర్లో వచ్చే నెలలో కరకగూడెం మండలం చిరుమల్లలో ఆదివాసి గిరిజనులు సాంప్రదాయపద్ధంగా జరుపుకునే సమ్మక్క సారక్క జాతరకు వచ్చే ప్రత్యేక పూజారుల కుటుంబాలకు మరియు భక్తులకు సౌకర్యాలు కల్పించాలని ఆ గ్రామం గిరిజనులు కోరినందున అన్ని ఏర్పాట్లు ఘనంగా చేయాలని అధికారులకు సూచించారు. జాతర జరిగే సమ్మక్క సారలమ్మ గద్దెల నుండి పరిసరాల చుట్టూ విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సౌకర్యం కల్పించాలని, శానిటేషన్, మంచినీటి సౌకర్యం, భక్తులు సేద తీరడానికి టెంట్లు, స్త్రీలు బట్టలు మార్చుకొవడానికి తాత్కాలిక శిబిరం ఎంపీడీవో మరియు గ్రామపంచాయతీ ఈవో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చూసుకోవాలని, దేవస్థానం కమిటీ వారి సూచనలు ప్రకారము గద్దెల చుట్టూ ఫ్లోరింగు మరియు రిపేర్లు పెయింటింగులు ఐటీడీఏ డి ఈ ,ఏ ఈ లు తగు ఏర్పాట్లు చేసుకోవాలని, అలాగే పార్కింగ్ ప్లేస్ & బందోబస్తు పోలీస్ శాఖ వారు చూసుకోవాలని, వైద్యశాఖ తరఫున మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, టెంపరరీ టాయిలెట్లు మరియు స్నానాలకు షవర్ బాత్ లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పూర్తిస్థాయిలో సర్వే చేసి భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. శానిటేషన్ మరియు మంచినీటి సౌకర్యం చాలా కట్టుదిట్టంగా చేయాలని, వైద్యశాఖ తరఫున అన్ని రకాల మందులు సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. వారం రోజులు జరిగే ఈ జాతర అధికారులందరూ సమన్వయంతో ఉండి విజయవంతంగా జరిగేటట్లు కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నాగప్రసాద్, ఎంపీడీవో దేవర ప్రసాద్, విద్యుత్ శాఖ ఏడి వేణు, డి ఈ మధుకర్, ఏఈ యోగేష్ తదితరులు పాల్గొన్నారు.
