స్థానిక సంస్థలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి !!
పనైనా చూపండి – తిండైనా పెట్టండి !!!
సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు.
వైరా:-నేటి గదర్ న్యూస్, మార్చి13:-మున్సిపాలిటీకి ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించి వైరా నియోజకవర్గ కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని, స్థానిక సంస్థలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు అన్నారు.
స్థానిక బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో సిపిఐ (ఎం) వైరా డివిజన్ కమిటీ సమావేశం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా పనితీరు మారలేదని విమర్శించారు. వైరా నియోజకవర్గం కేంద్రం అభివృద్ధికి సరిపడా నిధులు లేక ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా సమస్యలు వెంటాడుతున్నాయని అన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోని ప్రభుత్వాలను ఎలా మార్చాలో ప్రజలకు తెలుసన్నారు. రాబోయే కాలం మొత్తం ప్రజా పోరాటాల కాలం అని, దీనికి ప్రతి కార్యకర్త సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పని లేక పేదల రోజువారి జీవనం కూడా భారమవుతోందని, వలస కూలీలుగా ప్రతిరోజు100 కిలోమీటర్లు ఆటోలపై వెళ్లి జీవనం గడుపుతున్నారని, స్థానిక ప్రజాప్రతినిధులు ఆలోచించి ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో పట్టణ ప్రజలకు ఉపాధి హామీని ఏర్పాటు చేయాలని కోరారు. లేనిపక్షంలో “పనైనా చూపండి తిండైనా పెట్టండి” అనే నినాదంతో ప్రజా పోరాటాలు తప్పవూ అన్నారు. ఈ సమావేశంలో పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి భుక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు దిగ్గి కృష్ణ, కొండెబొయిన నాగేశ్వరావు, సుంకర సుధాకర్, డివిజన్ కమిటీ సభ్యులు మచ్చా మణి, చింతనిప్పు చలపతిరావు, చెరుకుమల్లి కుటుంబరావు, దొంతెబొయిన నాగేశ్వరావు, కుందనపల్లి నరేంద్ర, బాణాల శ్రీనివాసరావు, తోట నాగేశ్వరావు, తూము సుధాకర్, మాగంటి తిరుమలరావు, దొడ్డపనేని కృష్ణార్జునరావు, వేల్పుల రాములు, వజ్జ రామారావు, బోయినపల్లి శ్రీనివాసరావు, బాదావత్ శ్రీనివాసరావు, బి.బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు.