★ప్రారంభోత్సవ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.
– సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం చరిత్రాత్మకం అని కితాబు.
పేదల ఆకలి తీర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందని, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రాత్మకమని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు కితాబిచ్చారు. పినపాక మండలం జగ్గారం గ్రామపంచాయతీ వెంకటేశ్వరపురం గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా సన్నబియ్యాన్ని సరఫరా చేస్తామని, ఈ పథకం పేదల గుండెల్లో నిలుస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో అర్హులైన పేద ప్రజలందరికి రేషన్ కార్డులలతోపాటు, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందని తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేయకపోగా, ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై అనవసరంగా సోషల్ మీడియా రాద్ధాంతాలు చేస్తుందన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాల ఉద్దేశ్యం, సామాన్య ప్రజలకు ఆర్థిక భారం తగ్గించి, కనీస జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా చేయడమే అన్నారు. ఈ పథకం ద్వారా అర్హత గల కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని ఉచితంగా పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ప్రతి పేద కుటుంబం ఆకలికి గురికాకుండా, పోషకాహారాన్ని సమృద్ధిగా అందుకునేలా ఈ పథకం రూపొందించబడిందని తెలిపారు. అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని సజావుగా అమలు చేస్తామని తెలిపారు. బియ్యం పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతు రుణమాఫీ, రైతుబంధు, కౌలు రైతులకు సైతం ఆర్థిక సహాయం, ఉచిత కరెంటు, ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ బండ పై సబ్సిడీ, ఇప్పుడు తాజాగా నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం పేరుతో లోన్లు, ఇందిరమ్మ ఇల్లులు వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. గతంలోనే తన హయాంలో అనేక రహదారులు ఏర్పాటు చేశామని, కొత్తగా మరికొన్ని రహదారులు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. అనంతరం 30 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రామనాథం, ఎంపీడీవో సునీల్ కుమార్, తహశిల్దార్ అద్దంకి నరేష్, మండల వ్యవసాయ శాఖాధికారి ఈ వెంకటేశ్వర్లు, మాజీ వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, మాజీ సర్పంచులు తోలెం కళ్యాణి, కొర్శా కృష్ణం రాజు, ఈసం భవతి, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
