నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:
🔹అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాలలో నిరుపేదలైన జర్నలిస్టులకు అలాగే వృత్తి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని తెలిపారు.
🔹వృత్తి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు నెలసరి పెన్షన్, తీవ్ర అనారోగ్యం, ప్రమాదాలకు గురై వృత్తి నిర్వహించలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులకు మంత్రి ఈరోజు నాంపల్లి లోని ప్రెస్ అకాడమీ కార్యాలయంలో చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మండల, నియోజకవర్గ స్థాయిలో పని చేస్తున్న జర్నలిస్టులను ఆదుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.
🔹మంచిని మంచిగా, నిజాన్ని నిర్భయంగా సమాజానికి తెలియజేసే దాంట్లో ఎంతో మంది జర్నలిస్టులు ఆణిముత్యాలుగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. జర్నలిస్టు వృత్తిని నమ్ముకుని తమ జీవితం మొత్తం ఆ వృత్తికే అంకితం అయినవాళ్ళు ఎంతోమంది ఉన్నారని అన్నారు. ఆనాటి ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ప్రెస్ అకాడమీ భవనాన్ని చిన్న చిన్న మరమత్తులు పూర్తి చేసుకుని ఈ నెల చివరిలోగా ప్రారంభిస్తామని తెలిపారు.
🔹విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ₹42 కోట్లను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీని జర్నలిస్టుల సంక్షేమం కోసం అకాడమి ఖర్చు పెడుతుందని, జర్నలిస్టుల సంక్షేమానికి ఫిక్స్డ్ డిపాజిట్ పై వచ్చిన వడ్డీ ఆధారంగా ఇప్పటివరకు ₹22 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు.









