ఇదెక్కడి అన్యాయం…. బంకులో పెట్రోలుకు బదులు నీరు
పినపాక
పెట్రోల్ బంకులో పెట్రోల్ కి బదులు నీళ్లు రావడం కలకలం రేపింది. వాహనదారులు పెట్రోల్ కొట్టించుకుని బయలుదేరగా కాసేపటికే వాహనాలు ఆగిపోవడంతో కంగుతిన్నారు. మెకానిక్ షాపులకు పరుగులు తీయగా అక్కడ అసలు విషయం తెలిసి షాక్ తిన్నారు. బండిలో పెట్రోల్ కి బదులు నీళ్లు ఉండటాన్ని చూసి కంగుతిన్నారు. తాము కొట్టించుకున్నది పెట్రోల్ కాదు నీళ్లు అని తెలిసి లబో దిబో అన్నారు. పినపాక మండలం మండలం జానంపేట గ్రామంలో గల పెట్రోల్ బంకులో ఈ ఘటన జరిగింది. ఆ బంకులో పెట్రోల్ కి బదులుగా నీళ్లు వస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన తెలిసి వాహనదారులు మండిపడుతున్నారు. అప్పుడే పెట్రోల్ నింపుకుని వెళ్లినా కాసేపటికే బైకులు ఆగిపోతున్నాయని, మెకానిక్ షాపులకు పరుగులు పెట్టవలసి వస్తుందని మండిపడుతున్నారు. ఖాళీ బాటిల్ లో వాహనదారులు పెట్రోల్ బయటకు తీయడంతో విషయం వెలుగుచూసింది. పెట్రోల్ లో సగానికి పైగా నీళ్లే వచ్చాయి. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేస్తామని బాధితులు తెలిపారు.
బైక్ మధ్యలో ఆగిపోయింది
– సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మడివి రమేష్
పెట్రోల్ బంకులో పెట్రోల్‌కు బదులు నీళ్లు రావడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాం. విలువైన వాహనాలు చెడి పోతున్నాయి. ఆదివాసి గిరిజనుల అమాయకత్వమే కొంతమందికి ఆసరాగా మారింది. ఇటువంటి బంకులను పై ప్రభుత్వం చర్యలు తీసుకొని వెంటనే సీజ్ చేయాలి. చర్యలు తీసుకోకపోతే గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతాం.









