గిరిజన గ్రామాల్లోని రోడ్లను పట్టించుకోరా?
– కనీసం మనసులు నడవలేని విధంగా రోడ్లు ఉన్నాయి
– గిరిజనుల ప్రాణాలపై పాలకులకు పట్టింపు లేదా
– సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అన్నవరపు కనకయ్య
పినపాక
పినపాక ఏజెన్సీలో ఆదివాసీలు నివసించే పలు రహదారులు అధ్వానంగా ఉండి కనీసం మనుషులు నడవలేని విధంగా తయారయ్యాయని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య మండిపడ్డారు. శనివారం పినపాక సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో పినపాక మండలం జానంపేట గ్రామపంచాయతీ సుందరయ్య నగర్ లో ఆయన పర్యటించారు. బురద మయంగా ఉన్న రహదారిపైనే ఆయన సుమారు మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రహదారిపై వెళ్లేందుకు గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో సుందరయ్య నగర్ కు రహదారి మంజూరు అయిన పాలకుల నిర్లక్ష్యంతో ఇంతవరకు పనులు మొదలుపెట్టలేదన్నారు.
ప్రతి ఏటా ఆదివాసీ గ్రామాల్లో రోడ్లు నిర్మాణానికి రూ.కోట్లలో ఖర్చుపెడుతున్నామని ప్రభుత్వాలు లెక్కలు చూపుతున్నాయి కానీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. ఒక్కసారి అధికారులు వారి గ్రామాలకు వచ్చి చూడాలన్నారు. ఏటా ఈ సీజన్‌లో రోడ్ల నిర్మాణ ప్రతిపాదనలు పేరిట హడావుడి చేసి తర్వాత పట్టించుకోవడం లేదన్నారు.
ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున గ్రామాల్లో గిరిజనులు విషజ్వరాలతో బాధపడుతున్నారని, సరైన రోడ్డు లేకపోవడంతో వైద్య సేవలు పొందేందుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా తగు చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు.
విద్య, వైద్యం ఏ చిన్న అవసరమైనా రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరం నడవాల్సిన బురదలో నడపాల్సిన దుస్థితి ఉందన్నారు. అనంతరం పినపాక ఎంపీఓ వెంకటేశ్వరరావు తో మాట్లాడారు. ఇక్కడ సమస్యలను ఆయనకు వివరించారు. గతంలో అనేకసార్లు ఈ ప్రాంతంలో తాను పర్యటించారని ఎంపీఓ వెంకటేశ్వరరావు వివరణ ఇచ్చారు. సోమవారం తాత్కాలికంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా పనులు చేపడతామని తెలియజేశారు.
ఎంపీఓ తో మాట్లాడిన అనంతరం సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న మాట్లాడుతూ గిరిజనుల రహదారి సమస్యలు రెండు రోజుల్లో తీర్చకపోతే సుందరయ్య నగర్ నుండి పినపాక ఎంపీడీవో కార్యాలయం వరకు గిరిజనులతో పాదయాత్ర చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దుబ్బ గోవర్ధన్, సిపిఎం మండల కమిటీ సభ్యులు మడివి రమేష్,దారం లక్ష్మయ్య, నట్టి శంకరయ్య,కురసం లక్ష్మయ్య, కోవాసి రామయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు









