ఆత్మలకు పెన్షన్లు ★నేటి గదర్ న్యూస్, వైరా
తెలంగాణ ప్రభుత్వంలో అర్హులకు అందాల్సిన పెన్షన్లు ఆత్మలకు ఇస్తున్నారు…ఏంటి నమ్మడం లేదా అవునండి ఇది నిజం.. ప్రతినెల నెల క్రమ తప్పకుండా మృతి చెందిన వారి అకౌంట్లో అధికారులు డబ్బులు జమ చేస్తున్నారు… ఇదేంటండి బతికున్న వాళ్లకు కదా పెన్షన్ ఇచ్చేది.. మృతులకు కూడ పెన్షన్ ఇస్తారా అది ఎక్కడ అని ఆశ్చర్యపోతున్నారా…? అది ఎక్కడో కాదండి మన రాష్ట్రాల్లోనే… మొద్దు నిద్ర వీడని అధికారులు మృతి చెందిన వారి ఖాతాల్లో ప్రతి నెల చేయూత పథకం ద్వారా అందించే పెన్షన్ డబ్బులు మృతి చెందిన వారి ఖాతాల్లో వేస్తున్నారు.నేటి గదర్ కథనం…
ఈ రోజులలో బ్రతికి వున్న వారికే పెన్షన్లు మంజూరు కావటం అనేది ఒక యజ్ఞంలా కష్ట సాధ్యమైన పనిగా ఉన్న పరిస్థితులలో మృతులకు కూడా పెన్షన్ ఇవ్వడం విశేషం. ఖమ్మం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గమైన వైరా పరిధిలోగల ముసలిమడుగు గ్రామంలో అధికారుల ఔదార్యముకు ఇది ఒక మచ్చుతునక. వైరా నియోజకవర్గంలోని ఈ ముసలిమడుగు గ్రామంలో గత రెండు సంవత్సరములు క్రితం రాములు.బాలమర్తి చనిపోయినాడు. అదేవిధంగా ఈ గ్రామంలోని సుమారు 8 నెలల క్రితం చింత నిప్పు.సావిత్రమ్మ అనే వృద్ధురాలు కూడా మరణించింది. కాగా ఇప్పటికీ కూడా ఇరువురికి పింఛన్లు మంజూరు అవుతూ ఉండటం మరో విశేషం. బ్రతికి ఉన్నవారు పింఛన్ల మంజూరు కి అనేక దపాలుగా దరఖాస్తు చేసుకున్నప్పటికీ వాటి అతి గతి లేదు కొత్తగా పెన్షన్లకు అనేకమంది అనేక ఇబ్బందులు పడుతున్న విషయం అందరికీ తెలిసిందే ఈ మృతులకు వెంటనే పెన్షన్లు జారీ చేయకుండా నిలుపుదల చేయాల్సిన సంబంధిత అధికారులు ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారని గ్రామంలోని ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో కూడ ఇదే ముసలిమడుగు గ్రామంలో చనిపోయిన కొంతమందికి పెన్షన్లు చాలాకాలం వరకు ఇచ్చుకుంటూ పోయినారు. ఈ ఉదంతంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ పింఛన్లను నిలుపుదల చేశారు. ఎవరైనా ఇలాంటి విషయాలలో ఫిర్యాదు చేస్తేనే అధికారులు స్పందిస్తున్నారు. లేనిపక్షంలో ఇలాగే మృతులకు పెన్షన్లు మంజూరు చేసుకుంటూ పోతున్నారు. ఇదిలా ఉండగా మృతులకు పెన్షన్లు ఎలా మంజూరు చేస్తున్నారు? ఆ పెన్షన్ డబ్బులను ఎవరు, ఎలా డ్రా చేస్తున్నారు? లేదా ఆ డబ్బులు వారి అకౌంట్లో అలా పడి ఉంటున్నాయా? అనేది తేల్చాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంలో చనిపోయిన వారి పేర్లను సంబంధిత అధికారులు తొలగించాల్సిన బాధ్యత ఉండగా దానిని విస్మరించి పెన్షన్లు మంజూరు చేసుకుంటూ పోవడం బాధ్యతారాహిత్యమని విమర్శలు వస్తున్నాయి. పెన్షన్లు పొందే వారిలో ఎవరు బ్రతికి ఉన్నారు ఎవరు చనిపోయినారు అనేది ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు పర్యవేక్షించాల్సినది పోయి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అనేదానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఇప్పటికైనా ఈ మృతుల పేర్లను పెన్షన్ జాబితా నుండి తొలగించి బ్రతికి ఉన్న అర్హులైన వృద్ధులకు పెన్షన్లు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు.








