నేటి గద్దర్ న్యూస్, దమ్మ పేట, సెప్టెంబర్ 01: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేటలో ఆదివారం రాత్రి కురిసిన కొద్దిపాటి వర్షానికే మెయిన్ రోడ్డుతో పాటు దుకాణాలు ముంపుకు గురయ్యాయి. గత, ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యపై బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో, ఈ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, కాలువలు కబ్జాలకు గురవడం, పాలకుల నిర్లక్ష్యం వల్లే ప్రతి సంవత్సరం వరద ముంపుకు గురవుతోందని వారు ఆరోపించారు. అధికారులు డబ్బులకు కక్కుర్తి పడి వంతెన నిర్మించకుండా కేవలం తూరలు వేసి చేతులు దులుపుకున్నారని బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఈ సమస్యపై వెంటనే స్పందించి ఒక హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వరరావు, ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన తంబళ్ల రవి, పసుపులేటి నాగరాజు, నాగుల చందు, సోయం వెంకట్, టి. సత్యనారాయణ, ఎం.ఆర్.పి.ఎస్. నాయకులు కొలిగిపోగు కాంతారావు తదితరులు పాల్గొన్నారు.









