— *సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం*
నేటి గదర్ న్యూస్, వైరా :
కురిసిన అకాల వర్షం, వైరా నియోజకవర్గం వ్యాప్తంగా కురిసిన అకాల వర్షం మరియు ఈదురు గాలుల కారణంగా రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారని సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం తెలిపారు. ముఖ్యంగా మొక్కజొన్న పంట నేలకూలి పూర్తిగా దెబ్బతిన్నదని, కల్లాలలో ఎండబెట్టిన మిర్చి తడిసిపోవడంతో రైతులకు భారీ నష్టం సంభవించిందని ఆయన పేర్కొన్నారు. అదనంగా పత్తి, వరి తదితర పంటలు కూడా ప్రభావితమయ్యాయని తెలిపారు.
రైతులు అప్పులపాలై ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ అకాల వర్షం మరింత కష్టాల్లోకి నెట్టిందన్నారు. ప్రభుత్వం వెంటనే వ్యవసాయ అధికారులతో పంట నష్టం అంచనా వేయించి, ప్రతి ఎకరాకు సరిపడ నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
అలాగే, పంట బీమా కింద నమోదు చేసిన ప్రతి రైతుకు తక్షణమే బీమా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ రుణాలపై వడ్డీ మాఫీ చేయాలని, కొత్త రుణాలు వడ్డీ రహితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
రైతులను అన్ని విధాలుగా ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని, ఆలస్యం చేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని భూక్యా వీరభద్రం ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.








