*హైదరాబాద్*
*మునుగోడులో నిలిచిపోయిన గొర్రెల పథకం వెంటనే అమలు చేయాలి*
*ప్రీజ్‌లో ఉన్న బ్యాంక్ ఖాతాలను అన్‌ఫ్రీజ్ చేయాలి*
*మంత్రి వాకిటి శ్రీహరిని కలిసిన ఎమ్మెల్యే కూనంనేని, ఎమ్మెల్సీ నెల్లికంటి*
*హైదరాబాద్* , :తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకాన్ని తక్షణమే అమలు చేసి, ప్రీజ్‌లో ఉన్న లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలను వెంటనే అన్‌ఫ్రీజ్ చేయాలని *సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం* ప్రభుత్వాన్ని కోరారు.
ఈ మేరకు వారు *తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని* హైదరాబాద్‌లో కలసి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణలో యాదవ, కురుమ (గొల్ల) వర్గాల ఆర్థికాభివృద్ధి కోసం, వారి సాంప్రదాయ వృత్తులకు మద్దతు అందించేందుకు ప్రభుత్వం 75 శాతం సబ్సిడీతో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడిన వర్గాల జీవితాల్లో సామాజిక, ఆర్థిక పరిపుష్టి సాధించడమే ఈ పథక లక్ష్యమని పేర్కొన్నారు.
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, 20 గొర్రెలు + 1 పొట్టేలు (మొత్తం 21) కలిగిన యూనిట్‌ను 75 శాతం సబ్సిడీతో అందించేందుకు నిర్ణయించారని తెలిపారు. ప్రతి యూనిట్‌కు లబ్ధిదారులు బ్యాంకుల్లో రూ.45,000 డిపాజిట్ చేసినట్లు చెప్పారు.
అయితే మునుగోడు ఉప ఎన్నికల సమయంలో లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలను ప్రీజ్ చేయగా, ఇప్పటికీ వాటిని అన్‌ఫ్రీజ్ చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఖాతాలు ప్రీజ్‌లో ఉండటంతో బ్యాంకు లావాదేవీలు నిలిచిపోయి, వ్యవసాయ కార్యకలాపాలు, పత్తి విక్రయాల ద్వారా వచ్చిన డబ్బులు కూడా వినియోగించుకోలేక కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి, అర్హులైన లబ్ధిదారుల ఖాతాలను అన్‌ఫ్రీజ్ చేసి, గొర్రెల పంపిణీ పథకాన్ని వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పథకం అమలులో ఆలస్యం జరగకుండా స్పష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు.. ఈ కార్యక్రమంలో ఐలయ్య యాదవ్, జగన్ యాదవ్, సురేష్ యాదవ్, అయోధ్య యాదవ్, వెంకటేశ్వర్లు యాదవ్, మంగ వెంకటేశ్వర్లు, శంకర్ తదితరులు పాల్గొన్నారు..








