ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికే లక్ష్యం: పారిశుధ్యం, మౌలిక సదుపాయాలపై అధికారులకు దిశానిర్దేశం
నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 07: అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నియోజకవర్గం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ శనివారం అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. మున్సిపాలిటీలో 99 రోజుల పాటు సాగే ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, గ్రామాలు, పట్టణాల పరిశుభ్రతతో పాటు మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం వహించకూడదని స్పష్టం చేశారు. అనంతరం ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో ఐదు మండలాల అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ, ప్రజా సేవలో వేగం పెంచాలని, అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. వేసవి నేపథ్యంలో ఫైర్ స్టేషన్‌ను సందర్శించి ముందస్తు జాగ్రత్తలపై సిబ్బందిని అప్రమత్తం చేసిన ఎమ్మెల్యే, మద్దికొండ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల ఫేర్‌వెల్ వేడుకల్లో పాల్గొని విద్యార్థినులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. చివరగా మొద్దులగూడెం ఏకుల పోతమ్మ అమ్మవారిని దర్శించుకుని, దమ్మపేట ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీస్తూ పర్యటనను ముగించారు.








