పోడు రైతుల పైన అటవీ శాఖా అధికారులు చేస్తున్న అరాచకాలు అరికట్టాలి
పెసా చట్టం ప్రకారం ఇసుక క్వారీల్లో ఆదివాసీలకె పని కల్పించాలి
నేటి గద్దర్ వెంకటాపురం
శతాబ్దాలుగా పోడునే నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఆదివాసీలకు తరతరాలుగా పాలకుల కారణంగా అన్యాయం జరుగుతూనే ఉన్నదని ఆదివాసీ నవనిర్మాణ సేన వ్యవస్థపాక రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి పేర్కొన్నారు. ఆదివాసీ నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో మంగళవారం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, సాగులో ఉన్న వారి పైన అటవీ శాఖా అధికారుల అరాచకాలు అరికట్టాలని వెంకటాపురం మండల కేంద్రం లో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ముందుగా కొమరం భీమ్ విగ్రహానికి దండలు వేసి ప్రధాన రహదారి నుండి మూడు వందల మంది ర్యాలీగా వచ్చి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలనీ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్ వీరభద్ర ప్రసాద్ కు పోడు సమస్యల మీద వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. అనంతరం నర్సింహా మూర్తి మాట్లాడుతూ రామచంద్ర పురం గ్రామానికి ఆనుకొని ఉన్న యాభై ఎకరాల గ్రామ కంఠ భూమిని రెవిన్యూ అధికారులు ఎటువంటి నిబంధనలు పాటించ కుండా అటవీ శాఖకు బదిలీ చేశారని ఆయన ఆరోపించారు.షెడ్యూల్డ్ భూములను బదిలీ చేయాలి అంటే పెసా గ్రామసభ నిర్వహించి,1/3 మెజారిటీ తో గిరిజనుల ఆమోదం పొందిన తర్వాతే భూ బదలా యింపు జరగాలని అన్నారు. అడ్డగోలుగా వేలాది ఎకరాల షెడ్యూల్డ్ భూములను అటవీ శాఖకు బదిలీ చేసిన రెవిన్యూ శాఖా అధికారుల పైన కేసులు పెట్టాలని అన్నారు. రెవిన్యూ శాఖా షెడ్యూల్ ప్రాంతం లో షెడ్యూల్డ్ భూములకు కేవలం కాపలా దారు మాత్రమే అని వివరించారు. ఎన్నో ఏళ్లుగా రామచంద్ర పురం ఆదివాసీల స్వాధీనం లో ఉన్న ప్రభుత్వ భూమిని అటవీ శాఖకు ఎలా బదిలీ చేస్తారని తహసీల్దార్ ని ప్రశ్నించారు. అటవీ శాఖా అధికారులు పోడు రైతుల పైన చేస్తున్న వేధింపులు మానుకోవాలని అన్నారు. హక్కు పత్రాలు ఉండి ట్రాక్టర్ లతో దున్నుతే కేసులు పెడతామని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆధునిక వ్యవసాయ విధానాలను అనుసరించా కూడా చేతులతో దున్నాలా అని ఏద్దేవ చేశారు. ఆదివాసీలు ఆధునిక వ్యవసాయ విధానాలు అనుసరించొద్దా అని అటవీ శాఖా అధికారుల పైన మండిపడ్డారు.హక్కు పత్రాలు లేని వాళ్ళని సాగులోకి వెళ్లోద్దని అటవీ శాఖా అధికారులు అడ్డు చెప్పడం తగదని, హక్కు పత్రాలు రాని వారు ఇంకా లక్షల్లో ఉన్నారని గుర్తు చేశారు. హక్కు పత్రాలు ఉన్న ఆదివాసీ రైతులకు వెంకటాపురం లో ఉన్న స్టేట్ బ్యాంకు, గ్రామీణ వికాస్ బ్యాంకు, సహకార సొసైటి బ్యాంకు లు ఎందుకు రుణాలు ఇవ్వడం లేదని నిలదీశారు. వలస గిరిజనేతరులకు అక్రమ పట్టా దారులకు లక్షల్లో వ్యవసాయ రుణాలు ఎలా ఇస్తున్నారని బ్యాంకు అధికారులను నిలదీశారు. ఏజెన్సీ బ్యాంకు లు పని చేసేది గిరిజనులకు ఆర్ధిక సహాయ, సహకారాలు అందివ్వడానికె అని అన్నారు. ముకునూరు పాలెం ఆదివాసీల పట్టా భూములను గిరిజనేతరులు ఆక్రమించు కున్నారని ఎన్ని సార్లు అధికారుల చుట్టూ తిరిగిన ప్రయోజనం లేదన్నారు. అసైన్మెంట్ భూములను కాజేసిన ఎల్ టి ఆర్ తో పాటు, పి ఓ టి పెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏకన్న గూడెం ఆదివాసీలు ప్రతి యేటా ముంపుకు గురి అవుతూ తీవ్ర ఇబ్బందుల పడుతున్నారని అన్నారు.పెసా చట్టం ప్రకారం ఇసుక క్వారీల్లో ఆదివాసీలకు మాత్రమే ఉపాధి కల్పిస్తారని అన్నారు. గిరిజనేతరులకు పని కల్పించడం చట్ట వ్యతిరేకం అన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు గిరిజనుల మధ్య విభేదాలు సృష్టించడానికి గిరిజనుల పైకి ఉసుకోలప్తున్నారని మండిపడ్డారు. అమాయక గిరిజనుల పైన కేసులు పెట్టిస్తునట్లు తెలిపారు. గిరిజనుల పైన కేసులు పెడితే ఊరుకునేది లేదన్నారు. పెసా చట్టానికి విరుద్ధంగా ఏజెన్సీ లో అక్రమం గా అటవీ శాఖకు బదిలీ చేసిన వేలాది ఎకరాల భూములను వెనక్కి తీసుకొని ఆదివాసీలకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.వరద ముంపుకు గురి అవుతున్న ఏకన్న గూడెం ఆదివాసీలకు ఇంటి స్థలాలు కేటాయించాలని అన్నారు . కబ్జా కాబడిన ముకునూరు పాలెం ఆదివాసీల పట్టా భూములను ఆదివాసీలకు ఇవ్వాలని తహసీల్దార్ ని కోరడం జరిగింది. కొండాపురం గ్రామం లో ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు గిరిజనేతరులకు ఉచితంగా ఇస్తున్నారని, ప్రజల మధ్యకు వెళ్లి పెసా గ్రామసభ పెట్టి నకిలీ గిరిజనులను గుర్తించి ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలను రద్దు చేయాలనీ అన్నారు. అన్ని సమస్యల పైన సానుకూలంగా స్పందించిన తహసీల్దార్ వీర భద్ర ప్రసాద్ త్వరలోనే పరిష్కరిస్తా అని హామీ ఇచ్చారు. అటవీ శాఖా అధికారులతో చరవాణిలో మాట్లాడి గిరిజనులను ఇబ్బందులకు గురి చేయొద్దని చెప్పడం జరిగింది. జీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి, జిల్లా కార్యానిర్వాహక అధ్యక్షులు పూనెం ప్రతాప్ మద్దతు తెలిపినారు. కార్యక్రమం లో ఏ ఎన్ ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కుంజ మహేష్, జిల్లా కార్యదర్శి మడకం రవి, కేక్కం లక్ష్మణ్ రావు, కుంజ బాలకృష్ణ వివిధ గ్రామాల ఆదివాసీలు పాల్గొన్నారు.