★ ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ మణుగూరు బ్రాంచ్ కార్యదర్శి P. సంజీవరెడ్డి.
ఈ నెల 31న ఇల్లందులో జరుగు టి యు సి ఐ అనుబంధ ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రెండవ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ మణుగూరు బ్రాంచ్ కార్యదర్శి పి. సంజీవరెడ్డి సింగరేణి కాంట్రాక్టు కార్మికులను కోరారు. శనివారం మణుగూరు లోని వివిధ డిపార్ట్మెంట్ల సింగరేణి కాంట్రాక్టు కార్మికులను కలిసి కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్మినెంట్ కార్మికులతో సమానంగా కాంట్రాక్టు కార్మికులు కూడా పనిచేస్తున్నప్పటికీ కాంట్రాక్టు కార్మికులకు తక్కువ వేతనాలు చెల్లిస్తూ, వారి శ్రమను కారు చౌకగా దోచుకుంటున్నారని విమర్శించారు. పర్మినెంట్ కార్మికులు కాంట్రాక్టు కార్మికులు ఒకే రకమైన పని చేస్తే ఆ పని శాశ్వత స్వభావం కలది అయితే వారి వేతనాలలో కూడా వ్యత్యాసం ఉండకూడదని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ, సింగరేణి సంస్థ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ అయినప్పటికీ సింగరేణిలో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయించడం లేదని ప్రభుత్వాలను విమర్శించారు. కోలిండియాలో హై పవర్ కమిటీ వేతనాలు అమలు జరుగుతున్నప్పటికీ, సింగరేణిలో అమలుపరచకపోవడం సరైనది కాదన్నారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని సింగరేణి jiయాజమాన్యాన్ని కోరారు. కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపు, ఇతర చట్టబద్ధ హక్కుల, సౌకర్యాల అమలు కోసం రాష్ట్ర మహాసభలో చర్చించి భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకోవడం జరుగుతుందని ఈ మహాసభలో కాంట్రాక్టు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వి. జానయ్య, సతీష్, తదితరులు పాల్గొన్నారు.