బాధితుల వద్దకే న్యాయవ్యవస్థ
– కోర్టు మెట్టు దిగివచ్చి వాంగ్మలం తీసుకున్న న్యాయమూర్తి శివ నాయక్
నేటి గదర్, ఫిబ్రవరి 1, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి :
బాధితుల వద్దకే న్యాయవ్యవస్థ దిగివచ్చి భారత న్యాయవ్యవస్థ పై సామాన్యులకు నమ్మకాన్ని గౌరవాన్ని పెంచారు భద్రాచలం ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ వి.శివ నాయక్. శుక్రవారం భద్రాచలం కోర్టుకు రావలసిన ఒక మహిళ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మెట్లు ఎక్కలేని పరిస్థితులు ఉంది. విషయం తెలుసుకున్న న్యాయమూర్తి శివ నాయక్ కోర్టు మెట్లు దిగి ఆమె వద్దకు వెళ్లి వాంగ్మూలం తీసుకున్నారు. వ్యవస్థలో అత్యంత ఉన్నత స్థానంలో ఉన్న న్యాయమూర్తి శివ నాయక్ సామాన్యులకు న్యాయం దూరం కాకూడదనే ఆలోచనతో కోర్టు మెట్లు దిగి బాధితురాలు వద్దకే వచ్చి న్యాయాన్ని అందించేందుకు కృషి చేయడంతో న్యాయవ్యవస్థలపై సామాన్యులకు మరింత నమ్మకం పెరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. న్యాయమూర్తి శివ నాయక్ నిర్వహిస్తున్న పలు సామాజిక సేవా కార్యక్రమాలు సైతం న్యాయవ్యవస్థను ప్రజలకు చేరువ చేసే విధంగా, న్యాయవ్యవస్థలపై గౌరవాన్ని, నమ్మకాన్ని పెంచే విధంగా ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆశ్రమ పాఠశాల తనిఖీ చేయడం, సబ్ జైల్లో విచారణలో ఉన్న ముద్దాయిలకు న్యాయవ్యవస్థ ద్వారా భరోసా కలిగే విధంగా కౌన్సిల్ నిర్వహించడం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూనే అందరికీ న్యాయం చేరువ చేయాలనే లక్ష్యంతో పనిచేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.