తగరం నాగయ్య కుటుంబ సభ్యుల ఆరోపణ!
కోర్టు ఆర్డర్లు సైతం ఉన్నా వేధింపులు తప్పడం లేదు!
మా పట్టా భూమికి ప్రభుత్వం రక్షణ కల్పించాలి.
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఫిబ్రవరి 10: పట్టణంలో సెంట్రల్ లైటింగ్ పనుల్లో భాగంగా డ్రైనేజీ నిర్మాణంలో ఫారెస్ట్ చెక్ పోస్ట్ ను ఆర్ అండ్ బి శాఖ వారు కూల్చేసరికి, ఫారెస్ట్ వారు మా పట్టా భూములోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తూ మాపై దౌర్జన్యం చేస్తున్నారని ప్రభుత్వం తగు చర్య తీసుకుని మాకు రక్షణ కల్పించాలని పేరాయిగూడెంకు చెందిన తగరం నాగయ్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అశ్వారావుపేట పట్టణంలో రింగు రోడ్డుకు అనుకున్న పాత గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంతంలో సుమారు 60 సంవత్సరాల క్రితం నుండి 1167 సర్వే నెంబర్లో 11 కుంటల భూమికి పట్టా హక్కులు కలిగి ఉండి అనుభవిస్తున్నామని, ఇట్టి భూమికి మార్చి 17 2004 న సత్తుపల్లి కోర్టులో ఐ ఎ నెంబర్ 310 /2003 ఓఎస్ నెంబర్ 53 /2003 తో జడ్జిమెంట్ పొంది ఉన్నామని, 2022 మార్చి 30న, 2024 అక్టోబర్ 29న కోర్టులు ఇచ్చిన ఆర్డర్లు సైతం ఉన్నాయని, ఈ భూమిలో తగరం నాగయ్య కుమారులు, కుమార్తెలైన తగరం వెంకటేశ్వరరావు, తగరం తిరుపతయ్య, తగరం ఏసురత్నం, బండి తిరుపతమ్మ, కాటూరి దుర్గమ్మ లు ఇట్టి భూమిని అనుభవిస్తున్నామని, ఫారెస్ట్ వారికి ఎటువంటి ఆధారాలు లేకపోయినా రేంజర్లు మారినప్పుడల్లా మమ్ములను వేధింపులకు గురి చేస్తూ మీ హక్కు పత్రాలు చూపించండి అంటూ దౌర్జన్యం చేస్తూ మమ్ములను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తగరం నాగయ్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు రోడ్డు విస్తరణ పనుల్లో గతంలో మా భూమిని ఆక్రమించుకొని నిర్మాణం చేసిన ఫారెస్ట్ చెక్ పోస్ట్ కూల్చేసరికి, మరలా మరొకసారి మా పట్టా భూమిని ఆక్రమించేందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ప్రయత్నాలు చేస్తున్నారని, మా పూర్వీకులు నిర్మాణం చేసిన పెంకుటిల్లును కూల్చేసి ఫారెస్ట్ వారు ఆక్రమించాలని చూస్తున్నారని అటువంటి చర్యలు మానుకోవాలని తగరం నాగయ్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మేము దళిత కుటుంబానికి చెందిన వారమని, ఏమి చేసినా చెల్లుతుందిలే అనే భావనతో మా పైకి ఫారెస్ట్ వారు దౌర్జన్యానికి వస్తున్నారని, మాకు ఉన్నదే కొంచెం భూమి అని, ఈ భూమిని కూడా మాకు దక్కకుండా చేయడానికి ఫారెస్ట్ వారు ప్రయత్నం చేస్తున్నారని, కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు కోర్టులో తేల్చుకోవాలి కానీ, మాపై దౌర్జన్యం చేయటం ఏమిటని, ఫారెస్ట్ వారికి ఆధారాలు ఉంటే, రెవెన్యూ వారికి పోలీసు వారికి చూపించాలని, లేనిచో మాపై వేధింపులు, మా భూమిని ఆక్రమించే ప్రయత్నాలు మానుకోవాలని, వెంటనే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని మాకు రక్షణ కల్పించాలని తగరం నాగయ్య కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.