*విద్య మాత్రమే కాదు నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవాలి- మోటివేషనల్ ట్రైనర్ సుమలత*
*మార్చి 7*
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా బేటీ బచావో – బేటీ పడావో దశాబ్ది ఉత్సవాలు ఉత్సాహభరితంగా నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా బాలికల భవిష్యత్తు అభివృద్ధికి దోహదపడేలా విద్య, బాల్య వివాహాల నివారణ, ఆత్మవిశ్వాసం, లక్ష్యసాధన వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే,అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల మేరకు జిల్లా మహిళా సాధికారత కేంద్రం, జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ A. భాస్కర్ సూచనలతో పలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆశ్రమ గిరిజన బాలికల పాఠశాలలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు
*చైల్డ్ మ్యారేజ్ పై విద్యార్థులకు అవగాహన – మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ రాణి*
ఈ అవగాహనా సదస్సులో మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ రాణి మాట్లాడుతూ చైల్డ్ మ్యారేజ్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు.బాల్య వివాహాలు బాలికల భవిష్యత్తును నాశనం చేస్తాయి. చిన్న వయస్సులో వివాహం చేసుకోవడం వల్ల బాలికలు మానసికంగా, శారీరకంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. పైగా, చిన్నతనంలో వివాహం చేసుకోవడం వల్ల వారి చదువు అర్ధాంతరంగా నిలిచిపోతుంది. ఇది వారి జీవితాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.చైల్డ్ మ్యారేజ్‌కి ప్రోత్సహించిన వారికి చట్టపరంగా కఠినమైన శిక్షలు ఉంటాయి. అలాంటి పెళ్లిళ్లు చట్టబద్ధంగా అక్రమమని పరిగణించబడతాయి. బాలికలు తమ స్వంత భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలంటే, ముందుగా వారు ఆర్థికంగా స్వయం సమృద్ధిగా ఉండాలి. స్వయం సమృద్ధి సాధించిన తర్వాతే వివాహం చేసుకోవాలి. జీవితాన్ని సమర్థవంతంగా నిర్మించుకోవాలంటే విద్య అత్యంత కీలకం” అని ఆమె వివరించారు.
*విజయానికి క్రమశిక్షణ అత్యవసరం – మోటివేషనల్ స్పీకర్ సుమలత*
ఈ కార్యక్రమంలో మోటివేషనల్ ట్రైనర్ సుమలత మాట్లాడుతూ విద్యార్థులకు విలువైన మార్గదర్శకతను అందించారు.
“మన జీవితంలో విజయాన్ని సాధించాలంటే క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడే తత్వం ఎంతో అవసరం. తల్లిదండ్రులు, గురువులు ఇచ్చే మార్గదర్శకతను పాటిస్తూ, ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాన్ని సుస్పష్టంగా నిర్దేశించుకోవాలి. ముఖ్యంగా పరీక్షలకు ముందు మాత్రమే చదవడం కాకుండా, రోజూ క్రమంగా చదవడం వల్ల ఒత్తిడిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. ప్రతి రోజు ఏకాగ్రతతో చదవడం వల్ల విజయం సులభమవుతుంది.ఇటీవల విద్యార్థుల్లో ఒత్తిడి, భయం పెరుగుతున్నాయి. దీనిని అధిగమించేందుకు మన లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించాలి. విజయం అనేది ఒక్కరోజులో సాధించదగినది కాదు. దీని కోసం నిరంతరం కృషి చేయాలి. చెడు అలవాట్లను, చెడు ప్రభావాలను దూరం ఉంచాలి. సమాజంలో గౌరవాన్ని పొందాలంటే నిజాయితీ, క్రమశిక్షణ, మంచి ప్రవర్తనతో కూడిన జీవనశైలి అలవర్చుకోవాలి” అని విద్యార్థులకు సుమలత సూచించారు.ఈ కార్యక్రమంలో కాగజ్‌నగర్ ఎటీడిఓ కమర్ హుస్సేన్, గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రకాంత్,కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ నాగసుధ, ఉపాధ్యాయులు,అధ్యాపకులు విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.