నేటి గద్దర్ న్యూస్, ములకలపల్లి, ఆగస్టు, 31: ములకలపల్లి మండల కేంద్రంలో మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని కోరారు. ఆదివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె మాట్లాడుతూ, ములకలపల్లి మండల యువతకు క్రీడల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉందని, వారికి సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మినీ స్టేడియం ఏర్పాటు చేయడం వల్ల గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడానికి, స్థానిక క్రీడలను ప్రోత్సహించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు కేటాయించి త్వరలో పనులు ప్రారంభించాలని మంత్రిని కోరారు. మంత్రి శ్రీహరి ఎమ్మెల్యే జారె వినతిపై సానుకూలంగా స్పందించారని, ఈ విషయంపై త్వరలోనే పరిశీలన చేసి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే కార్యాలయం వెల్లడించింది.









