జనావాసాల మధ్య కారు దగ్ధం: ఇంట్లో పార్కింగ్ చేస్తుండగానే మంటలు, కాలనీవాసుల భయాందోళన
దమ్మపేట బాలాజీ నగర్‌లో ఘటన, క్షణాల్లోనే కాలిబూడిదైన టాటా పంచ్; షార్ట్ సర్క్యూటే కారణమై ఉండొచ్చని అనుమానం.
నేటి గద్దర్ న్యూస్, దమ్మ పేట, అక్టోబర్, 28: దమ్మపేట మండల కేంద్రంలోని బాలాజీ నగర్, రోడ్డు నెంబర్-4లో మంగళవారం మధ్యాహ్నం ఆకస్మికంగా మంటలు చెలరేగి ఓ కారు పూర్తిగా దగ్ధమైన సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో కాలనీవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్థానికులు, వివరాల ప్రకారం బాలాజీ నగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన టాటా పంచ్ నెంబరు: TS 28 8621 కారును మంగళవారం మధ్యాహ్నం ఇంటి ముందు పార్క్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. కారును నెమ్మదిగా పార్కింగ్ స్థానంలోకి మళ్లిస్తున్న క్రమంలోనే, ఇంజిన్ భాగం నుండి దట్టమైన పొగ వెలువడింది. డ్రైవర్ అప్రమత్తమై వెంటనే కారును నిలిపివేయగానే, క్షణాల్లోనే మంటలు వేగంగా వ్యాపించాయి. చూస్తుండగానే మంటలు కారు మొత్తాన్ని చుట్టుముట్టాయి. కారు పార్కింగ్ చేస్తున్న స్థలం ఇళ్లకు అత్యంత సమీపంలో కావడంతో, కాలనీవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. కొందరు స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకునేలోపే కారు పూర్తిగా కాలి బూడిదైంది. కారులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణ నష్టం జరగనప్పటికీ, స్థానికంగా భయాందోళన వాతావరణం నెలకొంది.









