Menu
Avani News
ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర
anadmin 9 hours ago 0 118
(పడ్కల్ స్వామిగా పేరుగాంచిన ప్రభాకర్ సాహసోపేత అనుభవం మీద అమరురాలు కా. రేణుక రాసిన కథ ఇది. ఆయన అమరత్వం సందర్భంగా పునర్ముద్రణ- వసంతమేఘం టీం)
కుడి చేతిల ప్లాస్టిక్ లోటతోటి నీళ్లు పట్టుకొని నడుస్తాంది రాజవ్వ. చూస్తే దొడ్డికి పోతున్న దానిలెక్క వుంది. యాభై యేండ్ల వయసుండొచ్చామెకు. శాయనలుపుతోటి ఎత్తుగా, ఎత్తుకు తగ్గ దొడ్డుతోటి వుంది. ఇంచుమించు సగం నెత్తి నెరిసింది.
కొంచెం దూరం నుంచి ఆమెనే అనుసరించి నడుస్తున్నడు స్వామి. సుమారు వ•ప్పయ్యేండ్ల వయసుతోటి, బక్కపలుచగ పొట్టిగ ఉన్నడాయన. అంగీ తొడుక్కొని, దోతీ కట్టుకున్నడు. కాళ్లకు చెప్పుల్లేవు. నెత్తిమీద గొంగడి కప్పుకొని దానిమీద ఒక బస్త పెట్టుకున్నడు. చూస్తే రైతులెక్క వున్నడు. బీడీ పొగ గుప్పు గుప్పుమని వదుల్తుండు.
ఇంతల ఎదురుంగ వొస్తున్న ఇద్దరు ఆడోళ్లు ఏదో మాట్లాడుతుంటే రాజవ్వ నిలబడిపోయింది. ఆమె నిలబడుడు తోటి స్వామి నిలబడనా వద్దా అన్నట్టు ఒక్క క్షణం తటపటాయిచిండు. పదడుగులల్ల రాజవ్వను దాటేసిండు. ఇంకో పదడుగులు ఏసిండు ఇంతల రెండు తొవ్వలు ఎదురుపడ్డయి.. ఏ తొవ్వలకు పోవాల్నో అర్థం కాలే. ఆగుదునా? ఆగుడుకంటే ఏదో ఒక తొవ్వల నడుస్తే నయమనుకుని తనకు తోసిన తొవ్వ బట్టిండు. కానీ ఆ తొవ్వ ఒక ఇంటి పెరట్లకు పొయ్యే తొవ్వ అని అర్థం కాని అతను దాదాపుగా ఆ ఇంటి పెరడుకు దగ్గరయిడు.
తమ పెరట్లకు ఎవరో అపరిచితుడు వస్తున్నట్టు అన్పించి ‘ఎవరయ్యా గిటొస్తున్రు’ అన్నడు ఆ ఇటాయన. ఆ మాట విన్న రాజవ్వ ‘ఓయయ్య గటెటు బోతున్నవ్ తొవ్వగిటు’ అని బిగ్గరగ అన్నది. అనుడే గాకుంట వ•చ్చట్ల నుంచి కదిలి నడక కొనసాగిచ్చింది. స్వామి మళ్లా ఆమె వెనుక పోబట్టిండు.
వాళ్లు నడుస్తున్న సందుల నుంచి తల తిప్పి ఏ బజార్లకు జూసిన గూడ గుంపులు గుంపులుగ పోలీసోల్లు కనబడబట్టిండ్రు. అట్ల నడుసుకుంట యిడ్లన్నీ దాటేసిండ్రు. ఇడ్లన్నీ దాటినంక వె•క్క జొన్న చేన్లు వొచ్చినయ్. రాజవ్వ ఒక చేన్లకు తొవ్వ తీసింది. స్వామి ఆమెను ఎంబడించిండు.
ఆ సేన్లబడి నాలుగు నిమిషాలు నడిచినంక ఆమె ఆగిపోయిది. గుండెల నిండా ఊపిరి పీల్చుకుంట స్వామి దిక్కు చూసింది. ఆ చూపులు, సంతోషం, సంతృప్తి తోటి వెలుగుతున్నయ్. ఆమె చూపుల ప్రతిఫలం స్వామి మొకం మీద కూడా పడ్డది.
‘ఇగ ఇట్టనే బడి పయిలంగ పో బిడ్డా’
ఆమె మాటల్లోని ఆర్తి అతని హృదయాన్ని తాకుతుంటే నెత్తిమీద వ•టతీసి ఆమె కందించిండు. ఆ తర్వాత గొంగడిని తీసి ‘ఇగ యిది గూడ అవుసరం లేదమ్మా’ అనుకుంట ఆమె చేతిలబెట్టిండు.
‘ఇగ నేను బోతనమ్మ మల్ల కలుద్దం’ మాటలల్ల వ్యక్తం చేయలేని కృతజ్ఞతా భావం అతని గొంతునిండ, కండ్ల నిండ, వ్యక్తమయితున్నది.
‘పైలం బిడ్డ! నేను జెప్పిన సంగతైతే మర్సిపోవద్దు మల్ల’
‘ఏం మర్సిపోనమ్మ. మల్ల కల్సినప్పుడు మీ అల్లుడ్ని పిలిపించి మాట్లాడుదం’ అనుకుంట అడుగులు ముందుకేసిండు.
పోతున్న అతని దిక్కు ఒక క్షణం కాలంపాటు చూసి లోటల నీళ్లు పారబోసి తిరుగు వె•కం పట్టింది రాజవ్వ. దబ దబా నడుసుకుంట చేన్ల నుంచెల్లి బయట పడ్డడు స్వామి. ఒక్క క్షణం ఆగి చూపులు ఆనినంత మేర చుట్టూత జూసిండు. కనుసూపు మేరల ఏ ప్రమాదం కానరాలే. గుండెల నిండ ఊపిరి పీల్చుకుంట మల్లా నడక సాగిచ్చిండు.
కండ్లకు బూజులు పట్టినట్లు పరిసరాలన్నీ మసక మసకగా కనబడుతున్నయి. అతనికి. చెవులు గడలు బడ్డ••. వళ్లంతా చిన్న చిన్న గాయాలతో నొప్పులూ మంట బాధిస్తున్నాయి.. నోరంతా చేదు, వెగటు. అయినా ఇవేవీ పట్టనట్టుగ అతను దబ దబా నడుస్తుండు. తను బతికిండా? బయట పడ్డడా? ఇంకా నమ్మకం కుదుర్తలేదతనికి.
మరోసారి సుట్టూ జూసిండు. వూరు దూరమైంది. అడవి దగ్గర బడ్డది. సెట్టూ, సేమా తనకు చిరపరిచితమైన పరిసరాలూ, పునర్జన్మనెత్తి వస్తున్న తనను ఆలింగనం చేసుకుంటందుకు చేతులు చాస్తున్నట్లనిపించింది.
‘తను బతికిండు, బయటపడ్డడు’ ఈ సారి నమ్మకంగా అనుకున్నడు. ఒక్క క్షణం సంతోషంగా వూపిరి పీల్చుకుండు. అడుగడున చాచి వున్న మృత్యువు కోరల నుంచి తను వొడుపుగా తప్పించుకుండు. శత్రువు ఓటమిని తల్చుకుంటె కించిత్తు గర్వం తొంగి చూసిందతని మదిన. మరుక్షణం అతన్ని భ్రమవంటిదేదో కమ్మేసింది. ఒక్క క్షణం ఆగి తన సహచరుల కోసం చుట్టూ జూసుకుండు.
లేరు! ఎవ్వరు లేరు!! భ్రమల్నుంచి బయటపడ్డాడు. తనొక్కడే మిగిలిండు. తనొక్కడే బతికిండు. చెప్పలేనంత విషాదం అలుముకుందతన్ని. ఆ విషాదంల గూడ అతను వేగంగ నడుస్తనే వుండు.
అవును అతనొక్కడే మిగిలిండు. అతనొక్కడే బతికిండు. శత్రువు పన్నిన పద్మవ్యూహం నుంచి అతనొక్కడే బయట పడగలిగిండు.
‘ఇగ అందరు సదురుకోన్రి పోదం’ అన్నడు స్వామి తన దళ సభ్యులను ఉద్దేశించి.
‘సీకటి బడ్డది గని జనం బాగనే తిరుగుతున్రే’ కిటికీల నుంచి జాగ్రత్తగ తొంగి చూస్కుంట అన్నడు గోపి.
‘సదురుకొని రడీగనైతె ఉందం. కొంచెం జనం తిరుగుడు తక్కువ కాంగనే బయటపడొచ్చు’ అని స్వామి తన కిట్టును సదురుకునే దాంట్ల పడ్డాడు.
కమాండర్ మాటను సమ్మతిస్తూ అందరు కిట్లు సదురుకున్నరు.
తొందరగ పోవాలనే ఉద్దేశంతోటి ఏడు గంటల కల్లా అందరూ అన్నం తినేసిండ్రు.
సదురుకొనుడు ముగించి కిటీకీ దగ్గరకు వచ్చి బయటకు తొంగి చూసిండు. స్వామి.
‘ఇంకా జనం బాగనే తిరుగుతున్నట్టున్రు గదా’ తనకు తాను చెప్పుకుంటున్నట్టు పైకే అన్నడతను.
ఇంట్ల నుంచి బయట పడేందుకు తొందర పడుతుంది అతని మనసు. తమతో ఉన్న ఇద్దరు మిలీషియా కామ్రేడ్స్ను సాయంత్రమే బయటకు పంపిండు, మైన్స్ కోసం. ‘వాళ్లు మైన్స్ తెచ్చుంటారు. ఈ రాత్రికే వాటిని ఫిట్ జెయ్యాలె. ఈ షెల్టర్ నుంచి బయట పడుడు లేటయితే మళ్ల మైన్లు ఫిట్ చేసేటందుకు టైం సరిపోదు. రేపే ఆంబుష్కు ఎంగేజ్ కావాలె’ అనుకున్నడతను.
బాన్సువాడ ఏరియా బైరాపూర్ వద్ద మూడు రోజుల కింద పోలీసులు ఒక ‘ఎన్ కౌంటర్’ చేసిండ్రు. దానికి ప్రతిగా పడ్కల్ గ్రామానికి రెండున్నర కిలోమీటర్ల దూరంల రోడ్డు మీద ఒక ఆంబుష్ చేయాలని స్వామి దళం నిర్ణయించుకుంది. ఆ పని మీదే దళం పడ్కల్కు వచ్చింది.
‘స్వామన్నా మేమిద్దరం కిందికి పొయ్యి మొకాలు కడుక్కొనొస్తం’ అన్నది విజయ.
‘సరే! బయటెవరన్న వున్నరేమో జూసుకొని పోండ్రి. జల్ది రాండ్రి’ అనడంతో విజయ, లలిత బయటికి పోయిండ్రు.
‘అబ్బ నేం గూడ జర మొకం కొడుక్కొనొస్తనే’ అన్నడు ప్రభాకర్ అతను ఆ దళానికి డిప్యూటీ కమాండర్.
స్వామి సరేనన్నట్టు తలవూపుడు తోటి అతను కూడా బయటికి పోయిడు. ముగ్గురూ తుపాకులు తీస్కపోలేదు.
ఆ యిటి బజారు దర్వాజలోంచి లోపలికి అడుగేస్తే ఎదురుగా విశాలమైన ఖాళీ స్థలవ•ంటది. ఆ ఖాళీ స్థలానికి ఎడమవైపున రెండంతస్తుల డాబా ఇల్లు ఉంటది. కుడివైపున రెండు రూంల పెంకుటిల్లు ఉంటది. రెండు రూములూ పక్క పక్కన ఉంటాయి.. రెండింటి దర్వాజలు ఖాళీ స్థలంలోకి తెరుచుకొని ఉంటాయి.. వాటిల్లో బజారు గోడకు ఆనుకొని ఉండే రూంల బియ్యం, పప్పులు, ఉప్పులు వంటివి పెట్టుకుంటారు. దాని పక్క రూం వంటిల్లు. డాబా ఇల్లు కింది భాగం రెండు విశాలమైన రూంలుగా ఉంటది. ఆ రూంలు ఒకదాని వెనుక మరొకటి ఉంటాయి.
.ముందు రూంకు నడుమ కాకుండా కొంచెం పక్కకు అంటే వంటింటి పక్కనున్న రూంకు ఎదురుగ దర్వాజ వుంటది. అంతే వైశాల్యంతోటి పైన కూడా రెండు గదులు ఒకదాని వెనుక మరొకటి ఉంటాయి. వంటిల్లుకు ఎదురుంగ చేద బావి ఉంటది. బాయి పక్క నుంచి పైకి పోయేటందుకు మెట్లుంటయి.. మెట్లు ఎక్కి పైకి పోతే వె•దట కొంత ఖాళీ జాగా ఉంటది. ఆ జాగలోకి తెరుచుకొని పై యింటి ముందు రూం దర్వాజ ఉంటది. ఆ దర్వాజ కూడా రూంకు నడుమ కాకుండా కిందింటి దర్వాజకు సరిగ్గా పైనే ఉంటది. ఆ దర్వాజ పక్కనే ఖాళీ స్థలంలోకి తెరుచుకొనే ఒక కిటికీ కూడా వుంది. ఆ రూంలకు అడుగు పెడ్తే బజారువైపుకు మరొక కిటికీ వుంటది.ఆ రూంల నుంచి వెనుక రూంలకు పోయేటందుకు మాత్రం రెండు దర్వాజలుంటయి.
ప్రస్తుతం సిర్నాపల్లి దళం పైన వుంది. అదే రోజు తెల్లవారు జామున దళం ఆ యిటికి వచ్చింది. విశాలంగా ఉండడం వల్ల ఆరుగురు దళ సభ్యులు ఇద్దరు మిలీషియా సభ్యులు అందరూ ముందటి రూంలనే మకాం వేసిండ్రు. దాంట్ల నుంచి ఇద్దరు మిలీషియా సభ్యులు ఇందాకనే ఇంటి నుంచి బయటకు పోయిడ్రు.
కిందికి దిగిన ముగ్గురు దళ సభ్యులు చేదబాయి దగ్గర మొకాలు కడుక్కుంటున్రు. ఇంతల దగ్గరికేసున్న బజారు దర్వాజ తలుపుల్ని భళ్లున తెరుచుకొని, అలర్ట్ పొజిషన్ల వున్న పోలీసులు ఒక్క ఉదుటున ఉరికి వచ్చిండ్రు.
పోలీసులను చూసి విజయ, లలితలు అప్రయత్నంగనే వంటింట్లకు ఉరికిండ్రు. వాళ్ల ఎంబడే ఉరికిన పోలీసులు వెంటనే వాళ్లను పట్టుకున్నరు. ప్రభాకర్ మాత్రం పైకి ఉరికి రూంలకు పోయి తలుపులు వేసి గొళ్లెం పెట్టే ప్రయత్నం చేయసాగిండు. కానీ ఆ తలుపుకు గొళ్లెం లేదు.
అతని ఎంబడే కాల్పులు జరుపుకుంటనే పోలీసోళ్లు పైకి ఉరికొచ్చి గది ముంగటున్న ఖాళీ స్థలం నుంచి తలుపుల మీదికి ఫైర్ చెయ్యసాగిన్రు.
కాల్పుల చప్పుడు వినబడంగనే లోపటున్న ముగ్గురు కామ్రేడ్స్- స్వామి, క్రాంతి, గోపిలు అలెర్టయి తుపాకులు అందుకొని ప్రోన్ పొజిషన్లకు వెళ్లిపోయిడ్రు.
తలుపులు వేసి గొళ్లెం పెట్టే ప్రయత్నాలల్ల ఉన్న ప్రభాకర్ను చూసి ‘తలుపుల్నుంచి తూటాలొస్తయ్ పక్కకు జరుగు అని అరిచి చెప్పిండు స్వామి.
వెంటనే ప్రభాకర్ పక్కకు తప్పుకున్నడు. పోలీసులు బయటి నుంచి తన్నిండో, తోసిండో గని, ప్రభాకర్ దగ్గరకు వేసిన తలుపులు తెరుచుకున్నయి. దర్వాజాల్నుంచి, కిటికీల్నుంచి తూటాలు దూసుకురాసాగినయి.. లోపలి నుంచి గెరిల్లాలు కూడా కాల్పులు మొదలుబెట్టిన్రు.
‘కిటికీల నుంచి గ్రెనేడ్లు వెయ్యి.. ప్రభాకర్తో అన్నడు స్వామి.
వెంటనే దర్వాజా పక్కనున్న కిటికీ నుంచి డాబా మీది ఖాళీ స్థలంలకు, మరో కిటికీ నుంచి కిందికి బజార్లకు రెండు మాత్రమే గ్రెనేడ్లు విసిరిండు ప్రభాకర్. కానీ ఒక్కటీ పేలలేదు. ఆ తర్వాత నల్గురూ పావుగంట సేపు ఫైరింగ్ చేసిండ్రు. కానీ ముంగటి రూంల కవర్సేమీ లేవు. పైగా కిటికీల నుంచి, దర్వాజల నుంచి తూటాలు దూసుకవస్తున్నయ్. కనుక రూంల ఉండి ప్రతిఘటించే అవకాశాలు తక్కువగనే ఉన్నయ్. రక్షణ గూడ తక్కువగనే వుంటది అనిపించింది స్వామికి. వెనుక రూంకు ఉన్న రెండు దర్వాజాలు కవర్స్ గా పని చేస్తాయనిపించింది. రక్షణ కూడా ఈ రూంతో పోలిస్తే నయమేననిపించింది.
అట్ల అన్పించంగనే ఆలస్యం చేయకుంట లోపలి రూంలకు రిట్రీట్ కమ్మని సహచరులకు ఆదేశమిచ్చిండు. లోపలి రూంలకు పోయి, ఎడంవైపు ఉన్న దర్వాజను కవర్ చేసుకుని స్వామి, ప్రభాకర్లు, కుడివైపున ఉంటే, వ•ంగటి రూం దర్వాజకు ఎదురుగ ఉన్న దర్వాజను కవర్ చేసుకొని గోపి, క్రాంతిలు ప్రతిఘటించసాగిన్రు.
అట్ల దాదాపు రాత్రి ఏడున్నరకు వె•దలైన ఫైరింగ్ తొమ్మిది గంటలదనుక సాగుతనే వుంది. గెరిల్లాల నుంచి ప్రతిఘటన ఏ మాత్రం తగ్గకపోవడంతో రకరకాల కుయుక్తులను పన్నసాగిండ్రు. మొదటి అంతస్తు దర్వాజా పక్కనున్న మెట్లు ఎక్కి రెండో అంతస్తు పైకి పోయిడ్రు.
డాబా ఇండ్లున్న కొన్ని రైతు కుటుంబాల వాళ్లు డాబాకు దాదాపు ఒకటి రెండడగుల వైశాల్యంతోటి ఒక కన్నం ఉండేటట్లు ఏర్పాటు చేసుకుంటరు. డాబా మీద ఎండబోసిన ధాన్యం గంపల్తోటి కిందికి మోసుకొచ్చేటి శ్రమ లేకుంట ఆ కన్నంలోంచి తోస్తే అవి సక్కగా ధాన్యం రూంల పడుతయి.
అట్ల ఈ డాబా మీద రెండు రూముల పైన రెండేసి చొప్పున నాలుగు కన్నాలు ఉన్న డాబాను నాలుగు సమభాగాలుగ చేస్తే ఒక్కో భాగం నట్టనడుమ ఒక్కో కన్నం ఉంటది. పోలీసుల దృష్టి ఆ కన్నాల మీద పడ్డది.
నాలుగు కన్నాల నుంచి ఒక్కసారే నాలుగు గ్రెనేడ్లు వేసిన్రు. ఒక్కసారే పేలిన గ్రెనేడ్ల శబ్దానికి నల్గురి గెరిల్లాల చెవులు గడలు బడ్డయి. ప్రోన్ పొజిషన్ల వున్నరు గాబట్టి ఎవరికి ప్రాణాపాయం కల్గలేదు గని, అందరికి గాయాలయిన మోకాలు, చేతులు చీరుకొని పోయినయ్. వంటి మీద తోలు చాలా చోట్ల రేగినట్టయ్యింది.
‘అబ్బ గ్రెనెడ్లేస్తున్రే’ శబ్దానికి అప్రయత్నంగ ఒక చెవును నేలకు ఆనించి అదిమిపెట్టి, ఇంకొక చెవును చేత్తొటి మూస్కోని అన్నడు క్రాంతి.
వాళ్లు తేరుకోక ముందే మరొకసారి భీకర శబ్దంతోని గ్రెనేడ్లు వారి పక్కన పేలినయ్.
ఆ రూంల రెండు మూలలకు వడ్ల బస్తాలు, కుండల దొంతులు వున్నయి.
‘అందరు బస్తాల చాటుకు కవర్ తీసుకోన్రి. లేకుంటే, ఈ గ్రెనేడ్లు మనల్ని బత్కనీయడు’ అన్నడు స్వామి.
వెంటనే అందరూ పాక్కుంట బస్తాల చాటుకు వెళ్లిపోయిన్రు.
పోలీసులు గ్రెనేడ్లే కాకుండ, ఆ కన్నాల నుంచి పొగ బాంబులు వేయబట్టిన్రు. టియర్ గ్యాస్ కూడా వదలబట్టిన్రు. ఆ కన్నాలల్ల తుపాకులు పెట్టి సుట్టు తిప్పుకుంట ఆటో ఫైర్ చేయబట్టిన్రు. ముందు నుంచి కిటికీల నుంచి కూడా ఆగకుండ తూటాలు వస్తనే వున్నయి.
ఆ గ్రెనేడ్ల మోతకు అందరి చెవులు చిల్లులు పడ్డట్టయితున్నయి.. పొగకు కండ్లు మండుతున్నయి. కండ్లల్ల నీల్లు గారుతున్నయ్. వళ్లంత మంట మండుతాంది. పొగకు దగ్గులు తువ్మలతోటి ఉక్కిరి బిక్కిర్య ఊపిరాడుతలేదు.
వాళ్లెవరికీ తామెటువంటి సంకట స్థితిలో ఉన్నరోననే, ఆలోచన చేసేంత అవకాశం కూడా ఇవ్వడం లేదా పరిస్థితి. ప్రస్తుతం గెరిల్లాలు ఉన్న రూంల దిక్కుకు ఒకటే కిటికీ వుంది. స్వామి, ప్రభాకర్లు కవర్ తీసుకున్న దర్వాజకు ఎదురుంగ వుంటదా కిటికీ.
ఊపిరాడక ఉక్కిరి బిక్కిరయితున్న కామ్రేడ్స్ గాలి పీల్చుకుంటుందుకు ఆ కిటికీ దగ్గరికీ వచ్చుడు వె•దలుబెట్టిన్రు.
‘కామ్రేడ్స్ కిటికీ దగ్గరికి రాకున్రి. ఫైరింగ్ వచ్చే అవకాశముంటది. ఊపిరి తక్కువ పీల్చుకుంటె ఏంగాదు. కిటికీ దగ్గరికి పోతే సచ్చిపోతం’ హెచ్చరించిండు స్వామి.
రూంల లైటు వెలుగుతున్నదిగని పొగకు పరిసరాలన్నీ మసకబారినయి. ఊపిరాడక ఉక్కిరి బిక్కిరయితున్నా, శరీరం నరక యాతన పడుతున్నా శాయశక్తులా ప్రతిఘటించాలనే సంకల్పం మాత్రం ఎవ్వరికి దెబ్బతిన్లేదు. అందుకే ప్రతిఘటన కొనసాగుతుంది.
పై అంతస్తు మీద ఉన్న కప్పు సిమెంటుది గని కింది అంతస్తు మీద ఉన్న కప్పు, అంటే పై అంతస్తు అడుగుభాగం సిమెంటుది కాదు. దూలాలు, వాసాల మీద చెక్కలు పర్చి మట్టి ఏసి దాని మీద సిమెంట్ గచ్చు ఏసిన్రు. పై కన్నాల నుంచి వర్సగ పడుతున్న గ్రెనేడ్ల దాటికి గచ్చు దెబ్బతిని చెక్కలు లేసిపోయి పై కన్నాలకు సరిగ్గ కింద రెండు వ•డు అడుగుల వైశాల్యంతోటి కన్నాలు పడ్డయి. దాని వల్ల తర్వాత పోలీసోల్లు ఏసిన బాంబులన్నీ సక్కగ కింది అంతస్తులకు పోయి అక్కడ్నే పేలుతున్నయి.. ఫలితంగా చెవులల్ల మోత, కండ్లను మండించే పొగ, వంటి నిండా కుచ్చుకపోయే గ్రెనేడ్ పీసుల బాద నుండి గెరిల్లాలకు కొంచెం విముక్తి కల్గింది.
ఇంతల పై కప్పు మధ్య భాగం నుంచి శబ్దాలు వచ్చుడు మొదలైంది.
అటువైపుకు పైకి జూస్కుంట ‘అరె ఎల్.ఎమ్.జి ఆటోల బెట్టి కొడుతుండా? డ్రిల్లింగ్ చేస్తాండా? అక్కడ బొక్క చేద్దామనుకుంటున్నట్టున్నడు. అటు దిక్కుకు ఫైర్ చేద్దాం పట్ట్రుని’ అనుకుంట పైకప్పుకు ఫైర్ చేసుడు వె•దలు పెట్టిండు స్వామి.
మిగతా ముగ్గురు కూడా అటు దిక్కు ఫైర్ చేసుడుతోటి పోలీసులు తమ ప్రయత్నాన్ని విరమించుకున్రు.
‘చూసిన్రా మనం ఫైర్ చేస్తే వాడాగిపోయిడు’ అంటున్న ప్రభాకర్ కండ్లల్ల పొగనిండిన ఆ మసక వాతావరణంల కూడా చిరుగర్వం కన్పించింది స్వామికి.
ఆ తర్వాత ఆ రూం ఎడం పక్క అంటే ప్రభాకర్ పక్కనే వున్న గోడను తవ్వుడు మొదులు పెట్టిన్రు.
‘అరె ఇటు తవ్వుతున్నట్టున్రే’ అన్నడు ప్రభాకర్.
‘అరె అటు తవ్వుతే మనకు ఏ కవర్సు ఉండయి. అటు ఫైర్ చేద్దం పట్టు’ అనుకుంట అటు దిక్కు ఫైర్ చేయడానికి అవసరమైన పొజిషన్లకు వేగంగ మారిపోయిండు స్వామి. ప్రభాకర్ కూడా తన ఫైరింగ్ ఆర్క్ను మార్చడంతోటే, ఇద్దరూ గోడమీదికి ఫైర్ చేసిండ్రు. దాంతోటి పోలీసులు తవ్వుడు బందు బెట్టిన్రు.
అట్ల అర్దరాత్రి దాదాపు పన్నెండున్నరయింది. ఊరంత వూపిరి బిగబట్టి కూసుంది. ఎవ్వరికి కంటిమీద కునుకులేదు.
ఫైరింగ్ మొదలయిన కాన్నుంచి ఎవరిండ్లల్ల వాళ్లు బందీలయిన్రు. ఎవ్వరు బయటికి రావొద్దని పోలీసోళ్లు బెదిరిచ్చిన్రు.
ఫైరింగ్ మొదలయిన గంట నుంచి బ్యాచులు, బ్యాచులుగ అదనపు బలగాలు వస్తనే ఉన్నయి. యుద్దరంగంలెక్క మారిన ఆ ఇంటి చుట్టూ వున్న సందులు గొందులు ఇంటికప్పులు, మిద్దెలు అన్నీ పోలీసులు ఆక్రమించిన్రు. అక్కడక్కడా పెద్ద పెద్ద మెర్క్యురీ లైట్లు అమర్చిన్రు.
ఇద్దరు మహిళా గెరిల్లాలు, గెరిల్లాలకు షెల్టర్ ఇచ్చిన ఇంటోళ్లు అందరూ పోలీసుల చేతులల్ల బందీలుగ ఉన్నరు. పోలీసోళ్లు పెడుతున్న చిత్రహింసలను భరించలేక వాళ్లు మొత్తుకుంటున్న సప్పుడు లోపలున్న గెరిల్లాలకు వినబడ్తనే వుంది.
లోపల పరిస్థితి ఉత్కంఠగా వుంది. ‘ఏం జరుగుతుందీ? ఈ దాడి ఎట్ల అంతం కాబోతుంది? తాము బయటపడగలమా? ఎట్ల సాధ్యం? ఇక తామందరం చచ్చిపోవడం ఖాయమేనా?…’ తెరిపిలేని ఆ కాల్పుల మధ్య సైతం స్వామికి అటువంటి ఆలోచనలు వస్తున్నాయి.. బహుశా మిగతా ముగ్గురి కామ్రేడ్స్కు కూడా ఇంచుమించు ఇటువంటి ఆలోచనలే వస్తుండవచ్చు.
గుండెను దిటవు చేసుకుండు స్వామి. ఎట్లయ్యేదుంటె అట్లనే అయితది. కానీ చివరి క్షణం వరకు దృఢంగా పోరాడాలె. గట్టిగా నిశ్చయిచుకుండు. తన సహచరులకేసి చూసిండు. వాళ్లు కూడా అటువంటి దృఢ నిశ్చయంతోనే వున్నట్లనిపించింది అతనికి.
కాల్పులు, పేలుళ్లు విచ్చల విడిగా సాగుతనే ఉన్నాయి. పోలీసోల్లు మామూలు ఫైరింగ్ ఎవ్వరు చేస్తలేరు. ఆటోల పెట్టిన్రంటే మాగ్జిన్ ఖాళీ అయ్యి ఫైరింగ్ ఆగవల్సిందే తప్ప మధ్యల ఆపుతలేరు. మాగ్జిన్లు మార్చుకుంటున్నప్పుడే ఫైరింగ్కు కొంచెం విరామం వస్తాంది.
ఇంత మంది చేరి, ఇన్ని ప్రయత్నాలు చేసి వందల బాంబులు వేసి, వేల తూటాలు కొట్టి గూడ నల్గురి ప్రతిఘటనను అడ్డుకోలేక పోవుడు అధికార్లకు అవమానంగ అన్పించసాగింది. ఇంక రకరకాల మార్గాలను దోవులాడసాగిన్రు.
రూం వెనుక, అంటే ఆ ఇంటికి కుడిపక్క ఒక డాబా ఇల్లుంది. ఇంటి ఎదురుగ కూడా ఇంకో డాబా ఇల్లుంటది. ఆ రెండు డాబాల మీద ఎల్.ఎం.జిలు అమర్చిన్రు. ఇంటి ఎదురుగ ఉన్న డాబా మీది నుంచి ముంగటి రూంల బజారు వైపున్న కిటికీ గుండా, రూం వెనుక ఉన్న డాబా మీద నుంచి వెనుక రూంలున్న కిటికీ గుండా ఫైరింగ్ మొదలు పెట్టిన్రు.
అప్పటికి నల్గురూ ప్రోన్ పొజిషన్ల వుండి ముంగటి రూం దర్వాజా, కిటికీలను టార్గెట్ చేస్తుండ్రు. వెనుక కిటికీల నుండి అకస్మాత్తుగా దూసుకొచ్చిన తూటాలు ప్రభాకర్ తల వెనుక భాగంల పడ్డయి.
‘స్వామన్నా నేను సచ్చిపోతున్ననే’ తల వాల్చేస్తున్న ప్రభాకర్ గొంతులోంచి వచ్చిందా మాట.
‘ప్రభాకర్, ప్రభాకర్’ అని పిల్చుకుంట చేయి చాపి అతన్ని తన దగ్గరికి గుంజుకున్నడు స్వామి. ప్రభాకర్ నెత్తిల నుంచి దునుకుతున్న నెత్తుటి ధారలను చూసి ఏం చేయాలో అర్థం కాలేదు స్వామికి.
క్రాంతి, గోపి కూడా తలతిప్పి ఆందోళనగ చూస్తుండ్రు ప్రభాకర్ దిక్కు,
‘అందరికీ లాల్సలాం. విప్లవం వర్దిల్లాలి’ నేలను ముద్దాడుతున్న అతని నోటి నుంచి వస్తున్న మాటలు, ఎల్.ఎం.జి తూటాల వర్షం నడుమ కూడా స్పష్టంగ వినబడుతున్నయి. ముగ్గురికి ముగ్గురూ నిస్సహాయంగ చూడసాగిన్రు.
‘విప్లవం వర్థిల్లాలి’ ‘విప్లవం వర్థిల్లాలి’ నినాదాలు ఆపుతలేడు ప్రభాకర్.
ఇక మీదట అట్ల నినదించే అవకాశం దొరకదన్న ఆదుర్దతోటి నినదిస్తున్నట్టనిపించింది స్వామికి. మృత్యువు ఉక్కుకౌగిలి నుండి కూడా విప్లవాన్నే కలగంటున్న అతని వీరత్వానికి ఆ ముగ్గురూ నిలువెత్తు సాక్షులైండ్రు.
ఇరవై మూడేండ్ల ప్రభాకర్ తల్లిదండ్రులకు ఒక్కడే మగపిల్లగాడు. ఆట పాటల వయసుల్నే పోరుబాటను తెలుసుకుండు. ఇంటర్ సదువుకుంట గెరిల్లాగ మారిండు. కష్టపడుట్ల ఎప్పుడూ ఒక అడుగు ముందట్నే వుండేటోడు.
అయ్యో అర్దాంతరంగ చచ్చిపోతున్న అన్న ఆందోళన, దిగులు, బాధ ఏదీ కించిత్తు ధ్వనిస్తలేదు అతని గొంతుల. నిజానికి జీవితానికి సంపూర్ణత్వం అనేది ఎప్పుడొస్తది? వందేళ్లు బతికితేనేనా? సంపూర్ణత్వం అనే దాన్ని జీవిత కాలం నిర్ణయిస్తదా? జీవిత సారం నిర్ణయిస్తదా? జీవిత సారమేనన్నట్టుగ విప్లవాన్ని నినదిస్తున్న అతని గొంతుల ఒక సంతృప్తి ధ్వనిస్తాంది.
మూడు నాలుగు నిమిషాల తర్వాత అతని నోటి నుంచి నినాదాలు ఆగిపోయినయ్. సన్నటి మూలుగు మాత్రమే రాసాగింది. ఇంకతను మృత్యువుకు మరింత చేరువయితుండని ముగ్గురికీ అర్థమైంది.
కానీ అతని పక్కనే ప్రోన్ పొజిషన్ల ఉన్న స్వామికి కనీసం లేచి కూర్చొని, ఆఖరి క్షణాలల్ల ఉన్న తన సహచరున్ని ఒళ్లోకి తీసుకునే అవకాశం లేకుంట, కిటికీల నుంచి తూటాలు దూసుకొస్తనే వున్నయి.
గోపి, క్రాంతిలకు తమ పొజిషన్ల నుంచి లేచొచ్చి తమ సహచరుడికి ఆఖరి కరచాలనం చేసే అవకాశం లేదు. ఆఖరికి, చివరి క్షణాలల్ల వున్న తమ సహచరుడి దిక్కు తలెత్తి చూసేటి, కనీసం కండ్లు తిప్పి చూసేటి అవకాశం ఇయ్యకుంట తూటాలు ఉరుకొస్తున్నాయి.. తమ దృష్టిని టార్గెట్ నుంచి మరలించే అవకాశాన్ని ఆ కర్కశ యుద్దం వాళ్లకిస్తలేదు.
ఇంకో నిమిషంల ప్రభాకర్ నుంచి మూలుగు కూడ ఆగిపోయిది. అతని నవయవ్వనానికి నూరేళ్లూ నిండిపోయినయి. అయినా ఒక్క కన్నీటి బొట్టయినా జారే అవకాశం ఎక్కడిది?
బాధను దిగమింగుకుంట, కర్తవ్యాన్ని గుర్తు తెచ్చుకుంట ‘ప్రభాకర్ అమరుడయిడు. మనం ముగ్గురమే మిగిలినం. మనం గూడ దీంట్ల నుంచి బయట పడుడు కష్టమే కావొచ్చు. ఏదైన ఎవ్వరం డీలాపడొద్దు. ఆఖరిదాక పోరాడాలె. మీరిద్దరు ఆ దర్వాజను కవర్ చేయున్రి. నేనీ దర్వాజను కవర్ జేస్త లోపలికి అడుగు బెట్టిన పోలీసోడ్ని బతకనీయద్దు. ఈ కిటికీల నుంచి బాగా ఫైరింగొస్తాంది. నేనా వలకు పోత. మీరు గూడ జాగ్రత్తగా కవర్లల్లనే ఉండున్రి’ చెప్పుకుంటనే తూటాల మధ్యనే జాగ్రత్తగా క్రాలింగ్ చేస్తూ ప్రభాకర్ మృతదేహాన్ని దాటుకుంటూ ఆ మూలకు పోయిండు స్వామి.
ఈ మూల, కిటికీకి పక్కన వుంటది కాబట్టి కిటికీలనుంచి ఆ మూలకు ఫైర్ చేయలేరు. క్రాంతి మరొక మూలకు వున్నడు. గోపి ఇద్దరి నడుమన వడ్ల బస్తాల చాటున గోడకు ఒదిగి వున్నడు. అతనికి ముందు గూడ కవర్గ ఉంటది కాబట్టి అక్కడ వుండగలిగిండు.
కొద్దిసేపటి తర్వాత స్వామి మల్ల మాట్లాడిండు. ‘వాడు పిచ్చిగ ఫైర్ చేస్తాండు. వాడు చేస్తుండని మనం కూడ చేస్తే, ఇప్పటికే మన దగ్గర తూటాలు దగ్గరపడ్డయి కాబట్టి మన నుంచి ఫైరింగ్ ఆపేద్దం. వాడు దర్వాజల నుంచి లోపలికి ఒస్తుంటనే ఫైర్ జేద్దం. అంతవరకు మనం చేయవద్దు’ అన్నడు.
ఆ తర్వాత దాదాపు అర్దరాత్రి పన్నెండున్నర నుంచి రెండు మూడు గంటల దాక ఈ ముగ్గురి నుంచి ఎటువంటి ఫైరింగ్ లేదు. దాంతోటి పోలీసులు లోపలున్నోళ్లు బతికున్నారా, సచ్చిపోయిడ్రా అనే సందిగ్ధం పడ్డట్టుండ్రు.
రాత్రి పన్నెండున్నరకు ఎస్.పి కూడ వచ్చిండు. అతడే స్వయంగ ఆదేశాలిచ్చుడు మొదలుపెట్టిండు. లోపల్నుంచి ఫైరింగ్ ఒస్తలేదు కాబట్టి రూం ముంగటి భాగంల ఉన్న పోలీసులను, రూంలకు అడ్వాన్స్ కమ్మని చెప్తుండు. కానీ లోపలికి అడుగు బెడ్తందుకు ఎవ్వరు సిద్దపడ్తున్నట్టు లేదు.
రెండు గంటల ప్రాంతంల విజయ, లలితల ఏడుపులు, మూల్గులు కింద మెట్ల దగ్గర వినబడ్డయి..
‘అన్నా! అక్కలను తీసుకొని లోపలికి వస్తున్నట్టుండ్రే’ అన్నడు క్రాంతి.
‘పోండ్రే… పోయి సూడుండ్రే’ బండ బూతులు తిడుతున్నరు పోలీసోళ్లు.
‘వాడొస్తలేనట్టుండు, అక్కలనే తోలుతున్నట్టుండు’ అన్నడు గోపి.
‘సార్ కండ్లు తిరుగుతున్నయ్ సార్. కండ్లకు సీకట్లొస్తున్నయి సార్. మెట్లెక్కొస్తలేదు సర్’ లలిత, విజయల ఏడుపుగొంతులు దయనీయంగా వినబడుతున్నయి. ముగ్గురికీ.
‘అన్నా బాగ గొట్టినట్టున్రే అక్కలను, చిత్రహింసలు పెట్టినట్టుండ్రు.’ బాధగ ఉంది క్రాంతి గొంతు.
‘వాని సేతులకు పోతె యముని సేతులకు పోయినట్టే గద. సిత్రహింసలు పెట్టకుండుంటరా?’ గోపి గొంతులోనూ అదే బాధ.
స్వామి తన బాధను మాటలల్ల వ్యక్తం చెయ్యలేక మౌనంగ ఉండిపోయిండు.
విజయ, లలితలకు నడిచే పరిస్థితి లేక పోవడంతోటి మల్ల వెనుకకు తీస్కపోయినట్టున్రు.
ఇంతల స్వామి పక్కనున్న కింద పక్కన తవ్వుడు మొదలు పెట్టిన్రు. అక్కడ కన్నం బడితే, ఆ కన్నంల నుంచి స్వామి ఉన్న మూలకు ఫైర్ చెయ్యగల్గుతరు.
పోలీసుల ప్రయత్నాన్ని ఆపడం కోసం మల్లా అటువైపు ఫైర్ చేసిన్రు. దాంతోటి పోలీసులు తవ్వుడు బందు బెట్టిన్రు.
ఇంతల ‘అన్నా నా తుపాకి బోల్ట్ పనిజేస్తలేదే లోడ్ అయితలేదు’ అన్నడు క్రాంతి. అతని దగ్గరున్నది, 303 రైఫిల్.
‘ఇగో ప్రభాకర్ తుపాకీ తీసుకో’ అంటూ ప్రభాకర్ 303 రైఫిల్ను వాళ్ల వైపుకు తోసిండు స్వామి.
కొద్ది సేపటికి ఫైరింగ్ వల్ల రెండు రూంలల్ల కరెంటు బల్పులు పగిలిపోయి మొత్తం చీకటైపోయింది.
మరోసారి గోడను తవ్వే ప్రయత్నం చేసిండ్రు పోలీసోళ్లు. గెరిల్లాలు మళ్లా అటుదిక్కు ఫైర్ చేసిన్రు. దాంతోటి పోలీసులు తమ ప్రయత్నాన్ని విరమించుకున్రు.
అయితే ఈ సారి స్వామి ఎస్.ఎల్.ఆర్ కరాబయిది. ఒక్కసారి దిక్కుతోచని స్థితిలపడ్డడతను.
తుపాకి లేకుంట ఎట్ల కొట్లాడుడు? క్రాంతి దగ్గర, గోపి దగ్గర రెండు తుపాకులున్నయ్. పోనీ వాళ్లను అడిగి ఒక తుపాకి తీసుకుందునా? కానీ ఈ హోరా హోరా పోరుల చేతిల ఒక తుపాకీ ఉండుడు అనేది ఆత్మస్థయిర్యాన్ని ఇచ్చే విషయం కదా. ఇటువంటి స్థితిల వాళ్ల దగ్గర్నుంచి తుపాకీ ఎట్ల తీస్కునుడు? వాళ్లు కూడా పోరాడే సామర్థ్యం ఉన్నోళ్లే కదా… ఇట్ల రకరకాలుగ ఆలోచించబట్టిండు.
ఒక్కసారిగ కాళ్లూ చేతులు కోల్పోయిన నిస్సహాయతల పడ్డడు.
అప్పుడు గుర్తొచ్చినయతనికి విజయ, లలితల తుపాకులు. వాళ్లు తుపాకులు కిందికి తీస్కపోయిన్రా లేదా అన్నది తెల్వదతనికి.
‘విజయక్క లలితక్క తుపాకులు తీస్కపోయిన్రా ఇక్కడ్నే పెట్టిపో••న్రా’ క్రాంతి, గోపిలనిద్దర్ని ఉద్దేశించి ఆడిగిండు.
‘ఏమో అన్నా నేను చూల్లేదు అంటే, నేను చూల్లేదు’ అని ఇద్దరూ అన్నరు.
‘ఎందుకన్న మంచిది ఒకసారి చూద్దం’ అనుకుంట మెల్లగ ముంగటి రూంలకు క్రాలింగ్ చేసుకుంటపో•• చీకట్ల అటూ ఇటూ తడిమితే గోడకు నిలబెట్టిన రెండు తుపాకులు దొరికినయి. . ఒకటి 410 మస్కట్, మరొకటి డబుల్ బ్యారెల్ గన్. అయితే రెండు తుపాకుల పోచ్లూ దొరుకలేదు.
పోచులు ఎప్పుడూ నడుంకే ఉంటయి. కాబట్టి, అవి వాళ్లతోనే వుండి ఉంటయనుకుండు. రెండు తుపాకులను తీసుకొని మల్ల తన జాగలకు వచ్చిండు. వాటిల్లో 410 మాత్రం లోడ్ చేసి వుంది. దాన్ని తీసుకొని పొజిషన్లకు పోయిడు. కానీ దాంట్లున్న ఒకే వొక తూటా ఎంత ఆత్మస్థయిర్యాన్ని ఇయ్యగల్గుతుంది?
మళ్లొకసారి గోడ తవ్వినట్టయి ఫైర్ చేయవల్సి వచ్చింది. ఉన్న ఒక్క తూటా ఖర్చయిపోయింది.
మల్లా నిరాయుధుడై పోయిడు. ఏం చెయ్యాలె? మనసంతా అసహనం ఆవహిస్తాంది.
‘క్రాంతీ నీ కరాబయిన తుపాకీ ఇట్యి ఏమయిదో జూద్దాం’ అంటూ ఆ తుపాకీని తీసుకుండు. దాని బోల్ట్ను కదిలించే ప్రయత్నం ఎంత చేసినా కదుల్తలేదు. చివరకు బోల్టును బలంగ గుద్దిండు. దాని తోటి బోల్ట్ రోగం కుదిరినట్టుంది. తూపాకీ లోడ్ చేయగల్గిండు.
తర్వాత మల్లా గంట సేపు లోపలి నుంచి ఫైరింగ్ లేదు. మల్లోసారి పోలీసులను లోపలికి పొమ్మని ఎస్.పి ఆదేశించాడు. అయినా పోలీసులెవ్వరు ఆ ఆదేశాన్ని పాటించే ధైర్యం చేయలేదు.
దాంతోటి విజయ, లలితలను మల్ల తీస్కొచ్చినట్టుండ్రు. ‘పోండ్రే, పైకి పోయి సూడుండ్రే… బండబూతులు వినబడుతున్నయి లోపలికి.
‘కండ్లకు సీకట్లొస్తున్నయి సార్… అడుగులు పడ్తలేవు సార్’ ఏడ్చి ఏడ్చి బొంగురుబోతున్న వాల్ల గొంతులు ముగ్గుర్నీ మల్లా బాధపెట్టినయి.
పోలీసులు వాల్లను వెనుకకు తీస్కపోయినట్టున్రు.
తెల్లారు జామున నాలుగు గంటలు కావొస్తొంది. ఎస్.పి మల్లా పోలీసులను లోపలికి పొమ్మని బండబూతులు తిట్టిండు. ఇగ తప్పని సరై పోలీసులు పెద్ద పెద్ద లైట్లను లోపలికి ఫోకస్ చేస్తూ రాసాగిన్రు. పోలీసుల ఆకారాలు లీలగా స్పష్టంగా కనబడుతున్నయి. నలుగురైదుగురు లోపలికి వచ్చిన్రు. ముందు రూం మధ్యలకు రాంగనే ముంగటొస్తున్న వాడ్ని గురి చూసి కొట్టిండు స్వామి.
అంతే ఒక్క దెబ్బకు ‘ఆ’ అని కేకేసి ఆ పోలీసు కింద పడ్డడు. వెంటనే పోలీ సోళ్లు లైట్లాపేసిన్రు. ‘మొహినుద్దీన్, మొహినుద్దీన్, అని పడిపోయినవాడ్ని కావచ్చు రెండుసార్లు పిలిచిండ్రు. కానీ జవాబుగా ఉలుకూ పలుకూలేదు.
ఈలోపు క్రాంతి, గోపిలు కూడా తమ ఎదురుగున్న దర్వాజగుండా ఫైర్ చేసిండ్రు.
ఇంకక్కడ నిలబడలేక పోలీసులందరు శవాన్ని తీస్కొని బయటకురికిన్రు. ‘స్వామన్నా ఒకడు సచ్చినట్టుండు గదనే’ గోపి గొంతుల ప్రభాకర్ మరణానికి బదులు తీర్చుకున్నమన్న ఒక చిరు సంతృప్తి.
‘ఆ సచ్చిండు’ స్వామి బదులిచ్చిండు.
‘శవాన్ని తీస్కపోయిన్రానే’ క్రాంతి.
‘ఏమో ఒక్కసారిగ సీకటైపోయిది గద, సరిగ అర్థం కాలె. తీస్కపోయినట్టె వున్నరు’ అన్నడు స్వామి.
ఇంతల కింది నుంచి ఫైరింగ్ శబ్దయి విజయ, లలితల ఆర్తనాదాలూ వినబడ్డయి.
‘అన్నా అక్కలే…’ గోపి, మాటల్ని పూర్తి చేయలేక పోయిండు.
కింద ఏం జరిగిందో అర్థమై ముగ్గురి హృదయాలూ బదువెక్కినయి. ఇద్దరి స్మృతులు వాళ్లను కమ్మేసినయ్ కాసేపు.
లలిత పుట్టి పెరిగింది పడ్కల్లనే. పేద దళిత కుటుంబంల పుట్టింది. పెళ్లయి ఒక కొడుకు పుట్టినంక సహచరుడితోపాటు ఉద్యమంలకు వచ్చింది. జిల్లా కమిటీ సభ్యునిగ పని చేస్తుండిన ఆమె సహచరుడు సలీం (ప్రసాద్) బిచ్కుంట దళంపై శత్రువు చేసిన దాడిలో వీరోచితంగా పోరాడుతూ సంవత్సరం క్రితం అమరుడయిండు. గుండె దిటవు జేసుకొని, ఆ దుఃఖాన్ని దిగమింగి ఉద్యమంల మరింత దృఢంగా నిలబడ్డదామె.
విజయ నాలుగవ తరగతి వరకూ చదువుకుంది. దళంల గూడ ఎంతో శ్రద్దగ చదువుకునేది. చదివిన విషయాలు చర్చించడంల ముందుండేది. కష్టపడి పని చేసేది. అన్ని విషయాల్ల ఆదర్శంగ ఉండేది.
నల్లటి కోల మొకంతోటి పొట్టి పొడుగ్గాకుంట, దొడ్డుగ బక్కగ్గాకుంట మోతాదుగ ఉండే లలిత రూపం, తెల్లటి ముద్ద మొకంతోటి ఎత్తుగుండే విజయ రూపము ముగ్గురి కండ్లల్ల మెదులబట్టినయి.
అట్లా రక్తసిక్తమైన, బీభత్సమైన, భయంకరమైన ఆ రాత్రి వెళ్లిపోయితెల్లారింది. కానీ పోలీసుల కాల్పులు ఆగుతలేవు. గెరిల్లాలు మాత్రం తుపాకులు గురిపెట్టుకొని అలర్ట్గా వున్నరు అవసరమైనప్పుడు కాలుస్తందుకు సిద్దంగా.
ఏడున్నర, ఎనమిది గంటల ప్రాంతంల కాల్పులు, పేలుళ్లకు కొంచెం తెరిపిచ్చిండ్రు. బయట ఏం జరుగుతుందో లోపలున్నోళ్లకు అర్థమైతలేదు. ఇంతల కింద ఇంటి గోడల్ని తవ్వుతున్న సప్పుడైంది.
‘అరె కింద తవ్వుతున్నట్టుండ్రు బాంబులు పెట్టి ఇంటిని పేలుస్తట్టుండ్రు’ మనసుల్నే అనుకుండు స్వామి.
ఏం జరుగుతుందో చూద్దామన్నట్టుగ కవర్ల నుంచి జాగ్రత్తగ బయటికొచ్చిండు క్రాంతి. రెండు దర్వాజల మధ్య గోడకు ఒక షెల్ఫ్ వుంది. షెల్ఫ్ ఉన్నచోట ఇటికె ఒక్క వరుసనే ఉండుడు వల్ల రాత్రి గ్రెనేడ్లు ఏసినప్పుడు అక్కడ అరచెయ్యంత కన్నం పడ్డది. షెల్ఫ్ దాకా క్రాలింగ్లు పోయి. లేచి కూసోని ఆ కన్నంల్నుంచి బయటకు చూసిండు. దాంట్ల నుంచి నలభై అయిదు డిగ్రీల కోణంల చూస్తే ముంగటి రూం దర్వాజా కనబడుతాంది. ఆ దర్వాజాల్నుంచి చూస్తే దర్వాజ ముందున్న కొద్ది భాగం డాబాతో పాటు బజారువైపుకు వేసిన సజ్జ కూడా కనబడుతాంది. ఆ సజ్జ మీద ఎల్.ఎం.జి పట్టుకొని ఒక పోలీసు కూర్చొని ఉండుడు గూడ కనబడుతాంది. ఆ పోలీసు తలను మాత్రం వెనకకు తిప్పి బజారువైపుకు చూస్తుండు.
క్రాంతి వెంటనే మెల్లగా ‘స్వామన్నా ఒక పోలీసోడు కనబడ్తుండే’ అన్నడు.
వెంటనే స్వామి ప్రభాకర్ మృతదేహం పక్కనుంచి పాక్కుంట షెల్ఫ్ దగ్గరికొచ్చిండు. మెల్లగా పైకి లేచి కన్నంల నుంచి బయటకు చూసిండు. అతనికి కూడా స్పష్టంగా కనబడ్డడు పోలీసు.
వెంటనే నీలింగ్ పొజిషన్లకు పోయి లోడ్ చేసి వున్న తన రైఫిల్ను ఆ పోలీసువాడి ఛాతికి ఎయిమ్ చేసిండు. మరుక్షణం అతని తుపాకీ నుంచి వెలువడ్డ తూటా పోలీసు ఛాతిని చీల్చుకుంట దూసుకపోవడము,, ఆ పోలీసు గావు కేక పెట్టుకుంట ఎల్.ఎం.జితో సహా వెనుకకు బజార్లకు పడిపోవడము, అతడి టోపి మాత్రం ముందుకు డాబా మీదికి పడిపోవడం స్వామి, క్రాంతిలిద్దరూ స్పష్టంగా చూసిండ్రు.
ఆ తర్వాత పోలీసుల నుంచి మల్లా విచ్చలవిడిగ కాల్పులు, పేలుల్లు మొదలైనయి. . జవాబుగా లోపలి నుండి మాత్రం ఒక్క తూటా కూడ పేలలేదు.
ఓ ఆరగంట సేపు అట్ల కాల్పులు జరిగినంక మల్లా కాల్పులు ఆగిపోయినయి.
గట్టిగ మాటలు వినబడ్డంతోటి ముగ్గురూ చెవులు రిక్కించిండ్రు.
‘నేను డి.ఐ.జిని మాట్లాడుతున్నాను, మీరందరూ సరెండర్ కావాలి. ఇంటి చుట్టూ బాంబులు పెట్టాం అనవసరంగ చనిపోతారు. అలా ప్రాణాలు పోగొట్టుకోవద్దు,’
‘డి.ఐ.జి గూడ వొచ్చిండే’ అన్నడు గోపి, స్వామి వైపు చూస్కుంట.
అవునన్నట్టు తలాడించిండు స్వామి.
‘మీరు అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవద్దు. మిమ్మల్ని చంపం. మీ మీద కేసులు పెట్టం. ఏమీ అనం మీరు సరెండర్ కండి. మీ దగ్గరున్న తుపాకులను లోపలే పెట్టేసి చేతులు పైకెత్తి బయటకు రండి’ అని పదే పదే మొత్తుకోబట్టిండు.
అతని మొత్తుకునుడు వృధా కాలేదు. ముసలి పులి పన్నిన బంగారు కడియం పన్నాగంల బాటసారి పడ్డట్టే డి.ఐ.జి పన్నాగంల క్రాంతి పడ్డడు.
‘స్వామన్నా, నేను పోతనే ఇండ్లున్నా ఎట్లయిన సచ్చిపోవుడే. బయటకు పోయి తిరిగి మళ్ల పార్టీలకు రావొచ్చు. కనీ ఇండ్లుంటే అనవసరంగ సచ్చిపోతమే’ బలవంతంగ గొంతు పెగుల్చుకుంట అన్నడు క్రాంతి. అతని చూపులు మాత్రం నేలకేసే ఉన్నయి.
స్వామి వూహించని మాటలవి.
ఆశ్చర్యం నుండి పూర్తిగ తేరుకోకుంటనే ‘వాని మాటల్ని ఎట్ల నవ్మతున్నవ్ నువ్వు?అన్నం పెట్టిన ప్రజలను గూడ ఇడిసిబెట్టకుంట సంపుతున్రు. అసువంటిది ఈ టైంల నిన్ను సంపకుంట ఉంటరని ఎట్ల నవ్మతున్నవ్? చేజేతుల వాడి సేతులల్లకు పోయి సిత్రహింసల సావును ఎందుకు కొని తెచ్చుకుంటవు? ఇండ్లనే వుండి చాతన••నంత మేరకు కొట్లాడి సచ్చిపోదాం. అంతేగని శత్రువుకు లొంగిపోవద్దు. మన, పార్టీలకు వచ్చినప్పుడే చావుకు తెగించి వచ్చినం గద. ఇప్పుడు చావుకు భయపడితే ఎట్ల?’ నచ్చజెప్పిండు అతను.
అతని మాటలు క్రాంతిని కాసేపు నిలబెట్టినయి.
డి.ఐ.జి పదే పదే గొంతు చించుకుంటనే వున్నడు. ‘మిమ్మల్నేం అనం. కేసులు పెట్టం. జైల్లో పెట్టం. లొంగిపోండి, లేకుంటే కొద్దిసేపట్లో ఇంటిని పేల్చేస్తాం. అనవసరంగ ప్రాణాలు కోల్పోవద్దు.’
‘స్వామన్నా వాడు చెప్తుండు గదనే ఏం అనరు గావొచ్చు. నేను బోతనే’
‘వాడట్లనే జెప్తడు. మాటలు జెప్పేందుకేవ•ంది? ఎన్నయినా జెప్పొచ్చు. వాని మాటల్ని నువ్వు నమ్మకు క్రాంతీ’
‘ఏమోనే ఇగ నేను ఉండలేను పోతనే’ చిన్నగా వున్నా మాటల్ల స్థిరనిశ్చయం ధ్వనిస్తొంది.
మళ్లోసారి నచ్చజెప్పిండు స్వామి.
కానీ పులి స్వభావాన్ని బంగారు కడియం మరిపింపజేసింది. ముందుకు సాగే బాటసారిని తప్పుదోవ బట్టించింది.
తన తుపాకీని కింద బెట్టిండు క్రాంతి. తూటాల పోచ్ను విప్పిండు. పక్కనున్న గోపి మొకంలకు జూడలేదు. కొంచెం దూరంలనున్న స్వామి మొకంలకు జూడలేదు. వీరోచితంగ మృత్యువును ముద్దాడిన ప్రభాకర్ మృతదేహం దిక్కు చూడలేదు. కండ్లల్ల నుంచి నీళ్లు తిరుగుతుంటే తలొంచుకొని ముందు రూంలకు పోయిడు.
అక్కడి నుంచి ‘సార్ నేను వస్తున్న సార్, నన్ను సంపకన్రి సార్’ ఏడుసుకుంట గట్టిగ అంటుండు క్రాంతి.
కొద్ది క్షణాల నిశ్శబ్దం తర్వాత ‘కింది నుంచి వస్తున్నావా? పై నుంచి వస్తున్నావా?’ అనే మాటలు వినబడ్డయి.
‘మనం కిందా, మీద రెండు చోట్ల వున్నమని అనుకుంటున్నట్టుండే వాడు’ అన్నడు గోపి.
క్రాంతి గురించే ఆలోచిస్తున్న స్వామి, ఆలోచన్ల నుంచి పూర్తిగ బయటపడకుండానే ‘వూ’ అన్నడు.
‘మీదికెళ్లి వస్తున్న సార్, సంపొద్దు సార్’ మళ్లీ ఏడుపు గొంతే.
‘తుపాకులున్నా, బాంబులున్నా ఏమన్నా లోపలే పెట్టి చేతులు పైకెత్తుకొని రావాలి.
‘అట్లనే వస్తున్న సార్’ అనుకుంట చేతులు పైకెత్తి దర్వాజాలకు పోయిడు. అక్కడనుండి అడుగు ముందుకు వేయబోతుండగ ఆటోల పెట్టిన తుపాకులు ఒక్కసారిగ అతని దిక్కు తూటాలు గుప్పించినయి.
అతను మరొక్క అడుగు వేసినంక ఆ ఫైరింగ్ జరిపుంటే అక్కడే కుప్పకూలి పోయేటోడు. కానీ పోలీసుల క్షణకాలపు తొందరపాటు మూలంగ, అడుగు దూరంగ క్రాంతి మృత్యువును తప్పించుకుండు. ఒక్క అంగల మల్లా వెనుక రూంలకు వచ్చి పడ్డడు.
‘సామన్నా నువ్వన్నట్టుగనే… కొడుకులు సంపబోయిన్రే’ అన్నడు షాక్ తిన్నట్టుగ.
‘నువ్వు నమ్ముడు లోనే పొరపాటుంది. క్రాంతీ, అసలెట్ల నమ్మినవ్? ఇప్పటికన్న అర్థమైంది కద. వాని సేతిల ఉత్త పుణ్యానికి సచ్చిపోతుంటివి. మనకు సావైనా, బతుకైనా రావల్సింది కొట్లాడుడు ద్వారానే! రా, తుపాకీ తీసుకో, చాతనైనంత వరకు వాన్ని సంపే మనం సద్దాం దా’ ఎట్లనన్న సరే క్రాంతి కండ్లు తెరుచుకున్నయని సంతోషపడ్డడు స్వామి.
క్రాంతి మళ్లా కవర్లకు పోయిండు.
‘పొరపాటున కాల్పులు జరిపాం. ఈ సారి కాల్పులు జరుపం, మమ్మల్ని నమ్మండి. మళ్లీ రండి దయచేసి’ డి.ఐ.జి చిలక పలుకుల మల్లా మొదలైనయి.
ఓ అరగంట తర్వాత క్రాంతిల మల్లా బలహీనత మొదలైంది. ‘అన్నా పొరపాట్న కాల్సిండ్రంటున్నడు గదనే. ఈ సారి కాల్వడు గావొచ్చు పోతనే నేను’
‘అరె ఇప్పుడే ప్రత్యక్షంగ చూసినవ్ గద. వాడు ఒదిలిపెట్టడు. సంపుతడు. వాన్ని నమ్మకు’ కచ్చితంగ అన్నడు స్వామి.
‘ఇండ్లున్న గూడ సచ్చిపోవుడే గదనే. బయటకు పోతే సంపరు గావొచ్చునే’ ‘అరె ఎట్ల నవ్మతున్నవన్నా, ఇప్పుడే జూసినవ్ గదా’ విస్మయంగ అన్నడు గోపి.
‘ఏమో పొరపాటయిదంటుండు గద’
నచ్చజెప్పీ విసిగిపోయిన స్వామి చివరికి ‘నీ ఇష్టం క్రాంతీ, ఇంతకంటే మేమేం చెప్తం?’ అన్నడు.
‘సార్ నేనొస్తనని జెప్పేసి, చేతులు పైకెత్తి వస్తుంటె గూడ కాల్పులు జరిప్తిరి గద. సంపమని జెప్తున్రు గని, సంపుతున్రు సార్’ లోపలి నుంచే గట్టిగా అన్నడు క్రాంతి.
‘అరేయ్ ఎవరూ ఫైరింగ్ చేయొద్దు. ఎవరూ చేయొద్దు. ఇప్పుడు వచ్చేసేయ్. ఎవరూ ఫైరింగ్ చేయరు. నేను ఆదేశాలు ఇచ్చాను కదా, ఎవరూ చేయరు’ డి.ఐ.జి.
మల్లా తుపాకీ కిందబెట్టి లేచిండు క్రాంతి. తలవంచుకొని చేతులు పైకెత్తి బయటకడుగులు వేసిండు. ఈ సారి పోలీసులు నిజంగానే ఫైరింగ్ చేయలేదు.
క్రాంతి, వాళ్ల చేతులల్లకు పోయినంక లోపలి పరిస్థితి పోలీసులకు పూర్తిగ అర్థమైనట్టుంది.
‘స్వామీ! గోపి! మీరిద్దరే ఎంత సేపు కొట్లాడుతారు? సరెండర్ కండి. లేకుంటే బాంబులు పెట్టాం. ఇంక పేల్చేస్తాం’ ఒక్క డి.ఐ.జి గొంతే కాకుంట రక రకాల పోలీసు గొంతులు వినబడుతున్నయి.
పోలీసుల మాటలకు ఇద్దరిలోను ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
‘… కొడుకుల్లారా, బాంబులు పెట్టినమని బెదిరిస్తే ఎవడ్రా భయపడేది? మేం సావడానికి సిద్దంగనే వున్నం. బాంబులు పెట్టుడు గాదురా గొప్పదనం. దమ్ముంటే లోపలికి రాండ్రిరా’ గొంతు చించుకొన్నడు స్వామి.
‘… కొడుకుల్లారా దమ్ముంటే మీరు బయటకు రండిరా’ అంతవరకు పోలీసులు నటిస్తున్న ఓపిక, మర్యాద ఎగిరిపోయి వాళ్ల అసలు స్వభావం బయటకు రాసాగింది.
‘భూస్వాములకు కాపలాకాసే కుక్కలురా మీరు. మీరు జెప్తే ఎవర్రా వినేది’ గోపి కూడ అరుస్తుండు.
కొద్ది నిమిషాలు తిట్లూ, ప్రతి తిట్లతోటి గడిచిపోయినంక బహుశా పోలీసులకు అర్థమయినట్టుంది. వీళిద్దరూ మొండిఘటాలని. క్రాంతితో చెప్పిస్తే ప్రయోజనమేమన్నా వుంటుందనుకున్నరేమో!
‘స్వామన్నా ఇంటి సుట్టు బాంబులు పెట్టిండ్రే. పేల్చేస్తరే. అట్ల అనవసరంగ సచ్చిపోవద్దే, నన్నేమంటలేరే, మీరు గూడ రాండ్రే బయటకు’ అరుసుడు మొదలు పెట్టిండు క్రాంతి.
‘నీలెక్క పిరికి పందలం కాదు. చస్తే ఇక్కడ్నే సస్తం గానీ, నీలెక్క లొంగిపోయే ప్రసక్తే లేదు’ రెండు గొంతులూ గట్టిగ జవాబు జెప్పినయ్.
ఇంక ప్రయోజనం లేదనుకున్నరేమో పిలుపులు ఆగిపోయినయ్.
ఆ తర్వాత కొద్దిసేపటికి తనకు దగ్గర్లో వున్న పై కప్పు కన్నం దగ్గర ఏదో అలికిడయినట్టనిపిచ్చి స్వామి పైకి చూసిండు.
ఆ కన్నం ఎంత వెడల్పుగుందో అంత వెడల్పుతోటి జిలిటిన్ స్టిక్స్ ను బంతి పువ్వు ఆకారంల తయారు చేసి ఆ కన్నంల అమర్చిపెట్టి వున్నరు.
‘దీన్ని పేల్చేటట్టున్నరు పేలిస్తే కన్నం చాలా పెద్దదైపోయి పైన కవర్ లేకంట పోతది ఏంచెయ్యలె’ అని ఆలోచించిండు స్వామి.
‘వాడు పేల్చకముందే నేనే ఫైర్ చేస్త, చేస్తే అవన్నీ రాలిపోతయి’ ఎందుకో తప్పుడు అంచనా వేసిండతను.
ఆలోచన రావడంతోటి కవర్ల నుంచి బయటకొచ్చి తుపాకీని పైకిత్తి పట్టి ఆ ‘బంతిపువ్వు’కు దగ్గరి నుండి గురిపెట్టి ఫైర్ చేసిండు.
అంతే, పెద్ద శబ్దంతోటి అది పేలింది.
ఏదో బలమైన వస్తువు అతన్ని గుద్దినట్లయిది. చేతిలోని తుపాకీ అదుపు తప్పి కింద పడిపోయింది. భరించరానంత వేడిని అతని మీద గుమ్మరిచ్చినట్టయిది. కండ్లు బైర్లు గమ్మినయ్. మొకం నిండా, చేతుల నిండా ఇసుకవంటిది గుచ్చుకపోయిది. ఒక అయిదు నిమిషాల పాటు కదలలేనట్టు అక్కడ్నే నిలబడిపోయిడతను.
తర్వాత కొంచెం తేరుకొని పైకి చూస్తే పైన ఒక గజం వైశాల్యంతోటి కప్పులేచిపోయింది. వెంటనే అక్కడి నుంచి పక్కకు తప్పుకుండు. ఆ సమయంలో పైకప్పు మీదున్న పోలీసులు కూడా, పేలుడు దెబ్బకు దూరంగ వురికి చాలాసేపు తేరుకొని ఉండరు. లేకుంటే, ఆ కన్నంల నుంచి చూసుంటే స్వామి పని అయిపోయేదే.
ఆ తర్వాత కింద పడ్డ తన తుపాకీ కోసం చూసుకుంటే ఇందాకటి పేలుడు దెబ్బకు దాని బ్యారెల్ వెనుకకు వంగి, గుండ్రంగ తిరిగిపోయి వుంది.
ఆ తర్వాత క్రాంతి విడ్సిపెట్టి పోయిన తుపాకీని చేతుల్లకు తీసుకుండు స్వామి.
ఇక ఆ తర్వాత పోలీసుల దాడి అనేక రెట్లు పెరిగింది. అన్ని వైపుల నుంచి ఆటో ఫైరింగ్ పిచ్చిగ వస్తాంది. పై కప్పు కన్నాల నుంచి బాంబులు విపరీతంగ విసురుతున్నరు. పెద్ద కన్నంలోంచి బాంబులను పెద్ద పెద్ద మంటలు కట్టి లోపలికి వదిలి పేలుస్తున్రు.
అయినప్పటికీ ఆ రూంల వున్న గడ్డ బస్తాలే ఇద్దరినీ రక్షిస్తున్నయ్. బస్తాలకు కూడా తూటాలు, బాంబులు తగిలి చినిగిపోయి, కుండలు పగిలిపోయి, ధాన్యమంతా చెల్లా చెదురయింది.
ఊపిరాడక ఇద్దరూ ఉక్కిరి బిక్కిరి కాసాగిన్రు. దూపతోటి గొంతులెండిపోతున్నయి. గత్యంతరం లేక మూత్రం పట్టుకొని తాగిన్రు. అట్లా అయిదారుగంటలు గడిచిపోయనయి.
మధ్యాహ్నం మూడు గంటలవుతుండగా గోపి కుడి చేయి మోచేతుల తూటా తగిలి బొక్క విరిగిపోయింది. విపరీతమైన రక్తస్రావం మొదలైంది. నొప్పితోటి అవస్థ మొదలైంది. అన్నింటికంటె ముఖ్యంగ ఇంకతనికి ఫైర్ చేయలేని పరిస్థితి. దానితోటి అతను నిస్పృహకు లోనయిండు.
‘స్వామన్నా ఇంగెట్లయిన సచ్చిపోతం. లేకుంటే ప్రాణాల్తోటి వాని చేతుల్ల పడ్తం. వాని సేతిల పడ్తే చిత్రహింసలు పెడ్తడు. ఎందుకే ఇగ వాని సేతుల్ల పడుడు. ఫైర్ జేస్కొని సచ్చిపోవాలనిపిస్తోందే’
ఊహించని మాటలు విన్నట్లు గోపి వైపుకు మొకం తిప్పి చూసిండు స్వామి. గోపి మొకంలో నొప్పితాలూకు విల విల స్పష్టంగా కనబడతాంది. పంటి బిగువున నొప్పిని భరించడానికి శతవిధాలా అతను చేస్తున్న ప్రయత్నము అర్థమయితాంది.
స్వామి సానుభూతిగా చూసుకుంట ‘వద్దు గోపీ, అట్ల ఆలోచించకు ఆఖరి క్షణం దాన్క మనం శత్రువుతోటి పోరాడాలె. చూసినవా ఇంత మంది చుట్టుముట్టిన గూడ ఇంత పెద్ద ఎత్తున ఫైరింగ్ చేస్తున్న గూడ మనం ఇద్దర్ని సంపగలిగినం, ఏమో అట్ల సంపే అవకాశాలు మనకింకా ఉన్నయి గావచ్చు. కాబట్టి మనం బత్కడానికి ప్రయత్నం జేయాల’ అన్నాడు.
‘ఇంకేం అవకాశాలున్నయే. ఇప్పుడింక ఫైరింగ్ కూడ జెయ్యలేను. ఈ నొప్పి భరించుడు గూడ నాకు వశపడుతలేదు. ఇగ వాని చేతులల్లకు పోతే చిత్రహింసలు పెట్టి సంపుతడు. వాని చిత్రహింసలకు తాళలేక అక్కలు ఎంత మొత్తుకుండ్రో విన్నం గదనే. ఎట్లయిన సచ్చుడే. అదేదో నా అంతట నేనే సచ్చిపోతే సరిపోద్ది గదా’ ఎడంచేత్తోటి తుపాకీని తన ఛాతికి ఆనించుకునే ప్రయత్నం చేసుకుంట అన్నడు గోపి. అతని మొకంలో ఒక కఠిన నిర్ణయం తాలూకు తెగింపు కనుబడుతాంది.
అతని దగ్గరకు జరిగి తుపాకీని పక్కకు గుంజేసి ‘వాడి సేతులల్ల పడ్డంక చిత్రహింసలు పెడ్తడు గోపీ, వాటిని గూడ ఎదుర్కోవాలె. మనల్ని ముక్కలు చేసినా, నినాదాలు జేస్కుంట సచ్చిపోవాలె. అటువంటి సావు ప్రజల్ని గూడ ఉత్తేజితుల్ని జేస్తది. అంతేగని మనంతట మనం కాల్చుకుని చచ్చిపోవుడు ప్రజలను ఉత్తేజపర్చదు. దయచేసి అటువంటి పని చేయకు’ చెవులు చిల్లులు పడే శబ్దాల నడుమ, వళ్లంతా మంటలతోటి, నాలుక పిడుచగట్టి పోతుంటే అతనికి మాట్లాడ్డం గూడ కష్టంగనే వుంది.
అయినప్పటికీ దాదాపు ఇరువై గంటలు వీరోచితంగా, హోరాహోరీగా, ధైర్యంగ పోరాడిన తన సహచరుడు అత్మహత్య చేస్కోవడం అనే ఊహ భరించలేక అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుండు స్వామి.
చావుకూ బతుక్కూ నడుమ వుండే సన్నటి గీతను దాటుకొని తాము బతికిపోతమేమో అనే ఆశ స్వామికి కూడా లేదు. అందుకనే బతికే అవకాశం వస్తదేమో అనే మాట అనలేకపోయిడు. ఆత్మహత్య చేసుకొని శత్రువును నష్టపరిచే ఆఖరి అవకాశాన్ని కోల్పోవద్దు అనేదే అతని తాపత్రయం.
కానీ గోపి ఆలోచనలు ఆత్మహత్య వైపే పోతున్నట్టున్నయి. మరోసారి ప్రయత్నం చెయ్యబోతె మల్లా తుపాకీని గుంజేసిండు స్వామి.
ఒకదిక్కు గోపికి నచ్చ జెప్పుకుంటనే, ఇంకోదిక్కు శత్రువుపట్ల అత్యంత అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి స్వామిది. ఎందుకంటే ఇప్పుడు ఫైర్ చేయగలిగింది అతనొక్కడే. విచ్చల విడిగా పేలుతున్న తూటాల, బాంబుల నడుమ ప్రతి క్షణం గోపిని గమనించలేని పరిస్థితి. కొద్దిసేపటి తర్వాత, తన మాటల వల్ల గోపి ఆత్మహత్య ఆలోచనను విరమించుకుండని అనిపించిందతనికి.
ఇంతల పక్కనే తూటా పేలిన చప్పుడు వినిపించి దర్వాజా దిక్కు తన చూపుల్ని కేంద్రీకరించి వున్న స్వామి తల తిప్పి చూసిండు.
గోపి ఆత్మహత్య చేసుకుండు. గోడకు ఒరిగి కూర్చుని ఉన్న అతను తన డబుల్ బ్యారెల్ తుపాకీని ఛాతికి ఆనిచ్చుకొని కాలి బొటనవేలుతోటి ట్రిగ్గర్ ఒత్తుకున్నట్టున్నడు. అతని నోటి నుంచి చిన్న శబ్దం కూడా రాలేదు. చాతిలోంచి రక్తం ఎగజిమ్మి ముఖమంతా రక్తంల ముంచి తీసినట్లుంది. క్షణాల్లనే అతని ప్రాణాలు పోయాయి.
నిర్జీవమైన అతని శరీరం గోడకొరిగి కూర్చున్నట్టుగనే వుంది.
స్వామి అతని వైపు చూడలేనట్టు యి కండ్లు మూసుకుండు.
‘అయ్యో ఎంత పని జేస్తివి కామ్రేడ్’ గుండె పిండేస్తుంటే బాధగా అనుకున్నడు.
గోపి దళిత బిడ్డ. ఇంటర్ చదువుకున్నడు. అతని బల్లపరుపు మొకంల నవ్వు నిరంతరం వెలుగుతోంది. అందరితోటి కలిసిమెలిసి పోయేటోడు.
భీకరమైన బీభత్సమైన శత్రు దాడిన చిక్కుకున్నప్పుడు, గింత గూడ బేజారుకాలేదు. సాహసంగ ప్రతిఘటించిండు. తనకంటే సీనియర్ అయిన క్రాంతి, యుద్దం మధ్యల చేతులెత్తేసిన గూడ గోపి అంతరంగంల కొంచెం గూడ ఊగిసలాట పొడసూపలేదు. తుపాకీ పట్టుకోగల్గినంత సేపూ యుద్దం చేస్తనే వున్నడు. ప్రాణం కంటే స్వేచ్చ గొప్పది. ప్రాణం పోయినా ఫర్వాలేదు గానీ శత్రువుకు బందీనై స్వేచ్చను కోల్పోను అన్న చంద్రశేఖర్ ఆజాద్ వలె గోపి గూడ అమరుడైండు.
ఇగ స్వామి ఒక్కడే మిగిలిండు. ఇద్దరు సహచరులు నిరాయుధులుగా పట్టుబడి చిత్రహింసల పాలయి, శత్రువు చేతిల చనిపోతే, ఒక సహచరుడు వీరోచితంగా పోరాడుతూ ఆఖరి నెత్తుటి బొట్టుదాక విప్లవాన్ని శ్వాసిస్తూ నేలకొరిగిండు.ఇంకో సహచరుడు యుద్ద బీభత్సానికి కలత చెంది వాస్తవాన్ని విస్మరించి భ్రమలల్ల పడిపోతే, మరో సహచరుడు ఓపికున్నంత వరకూ శత్రువుతో హోరాహోరీగా కొట్లాడి ఓపిక పోయినంక, శత్రువుతోటి కొట్లాడలేని ఈ ప్రాణం ఎందుకని విరక్తి చెందిండు.
ఒక్కరోజు పూర్తి కాకుండనే కొన్ని గంటల తేడాల్నే తన సహచరులందరి వియోగాలను, అందులోనూ వైవిధ్యభరితమైన వియోగాలను పంటి బిగువున నొక్కి పట్టవల్సి వచ్చింది స్వామికి.
తనలోని జీవశక్తినంతా పీల్చివేసి తనువును కట్టెగ మార్చే పరిణామాలివన్నీ. కానీ శత్రువుకు అంత సులభంగ విజయాన్ని చేజిక్కనియ్యొద్దనే దృఢమైన సంకల్పమే అతనిలోని జీవశక్తిని నిలబెడ్తున్నది. తిండిలేకపోయినా, నీళ్లులేకపోయినా, నిద్రలేకపోయినా, చివరికి పొగతప్ప గాలి లేకపోయినా ఈ సంకల్పమే అతనికి శక్తినిస్తాంది.
సాయంత్రం నాలుగు గంటలు కావస్తుంది. గెరిల్లాలు వెనుక రూంల ఉన్నరని అర్థమైంది గాబట్టి ఆ రూం అడుగును, అంటే అడుగున వున్న చెక్కలను, వాసాలను, దూలాలను కాలబెట్టుడు మొదలు పెట్టిన్రు పోలీసోళ్లు. స్వామికి కింది నుంచి వేడి సెగ తలుగుడు మొదలైంది.ముందు రూంలకు పోదమంటే ఆ రూంలకు బాగ ఫైరింగొస్తాంది. ఏం చెయ్యడమా అని ఆలోచించుకుంట గోపి, క్రాంతిలు కవర్ తీసుకున్న దర్వాజా దగ్గరికి వచ్చిండు. ఆన్నుంచి మెల్లగ ముంగటి రూంలకు తొంగి చూసిండు. రాత్రి తన ఫైరింగ్ల చచ్చిపోయిన పోలీసు శవం అక్కడలేదు. శవాన్ని తీస్కపోయిండ్రని అప్పుడు రూడీ అయిదతనికి.
ఇంతల అక్కడ పడి వున్న ఎ.కె 47 తుపాకీ అతని దృష్టిని ఆకర్షించింది. దాని బెల్ట్ స్పష్టంగ కనబడుతాంది. కానీ తుపాకీ సగమే కనబడుతాంది. బాంబులేసుడుతోని రాలిపడ్డ పెచ్చులు, రేగిన దువ్మ సగం తుపాకీని కప్పేసినయ్.
‘దాన్ని ఎట్ల తీస్కోవలె?’ అని అటిటు చూసిండు. తానున్న రూంల ఎల్లిగడ్డలు వేలాడగడ్తందుకు కట్టిన వెదురుబొంగు మీద అతని చూపు నిలబడింది. వెంటనే ఆ బొంగును చేతులల్లకు తీసుకుండు. మెల్లగ దర్వాజాలోంచి జాగ్రత్తగ కొంచెం వంగి ఎ.కె బెల్ట్ లోకి ఆ బొంగును పోనిచ్చి వెనక్కు గుంజిండు. అంతే మరు నిమిషంల అతని చేతులల్లకు ఎ.కె వచ్చింది. చూస్తే మాగ్జిన్ నిండా తూటాలున్నయ్.
ఇక వెనుక రూంల ఉండ వశం అయితలేదు. వేడి భరించలేక పోతుండు. ఇంకా అట్టనే వుంటే మలమల మాడి పోతననుకున్నడు. మెల్లగ ముందు రూంలకు వచ్చి కిటికీ పక్కన గోడనే కవర్గా చేసుకొని పొజిషన్ తీసుకుండు.
చేతిలున్న ఎ.కె అతని ఆలోచనలను వేగవంతం చేయసాగింది. వంటరిగ ఇంకెంత సేపో ప్రతిఘటించలేను. ఇల్లు కాలబెడ్తరు, కూలగొడ్తరు. సజీవంగా కాలిపోత గావచ్చు. లేకుంటే వానికి దొర్కిపోత గావొచ్చు. లేకుంటే గోపికి పడ్డట్టు ఏ చేతిలో తూట పడ్తే కనీసం ప్రతీఘటించ లేకపోత. అందుకని డాబా మీదికి వురికి సుట్టూ ఉన్న పోలీసులమీదికి మాగ్జిన్ వొడిసేదాంక ఫైర్ చేస్త, కొందరన్న పోలీసులు చస్తరు. ఇగ ఆ తర్వాత, వాని సేతుల సస్తేసస్త, అట్ల సాగినయ్ కాసేపు అతని ఆలోచనలు.
కొద్ది సేపటికి ‘తప్పిచ్చుకునే అవకాశం కొంచెం గూడ లేదా’ అనే ఆలోచన వచ్చింది.
డాబా మీదికి గాకుంట ఎట్లనన్న చేసి బజారు దర్వాజ దాంక బోతే, బజార్లున్న పోలీసులను ఫైర్ చేస్కుంట బజార్ల పడి ఉరుకొచ్చు. అట్ల కొందరు పోలీసులను నష్టపరుచొచ్చు వీలయితే తను గూడ తప్పించుకోవచ్చు.
ఏదైనా బయటపడుడు ద్వారానే బత్కడానికైనా పోలీసులను చంపడానికైనా అవకాశం వుంటది గనీ, లోపలుండుడు వల్ల ఏ అవకాశం ఉండదు.
అట్ల రకరకాల ఆలోచన్లతోటి సతమతమైపోయి ఆఖర్కి తప్పించుకునుడు దిక్కే మొగ్గు జూపిండు. అతని బుర్ర అందుకు మార్గాలను అన్వేషించసాగింది.
చీకటి పడుతుండగ, తప్పిచుకునే మార్గం కోసం అటూ, ఇటూ చూస్తున్న అతని దృష్టి, అతనికి దగ్గర్లోనే చిలక్కొయ్యకు వేలాడుతున్న పాత నవ్వారు చుట్ట మీద పడ్డది.
దాన్ని చూడంగనే అతని ఆలోచన్లకు ఒక రూపం వొచ్చుడు మొదలైంది. మెల్లగా దాన్ని తీసుకొని మల్లా వెనక రూంలకు పోయిండు. గ్రెనేడ్లు ఏసుడు మూలంగా రూం అడుగున పడ్డ ఒక కన్నం దగ్గరికి పోయిండు.
అప్పటికి ఇందాక అంటుపెట్టిన మంటలు చల్లారినయ్ గాబట్టి భరించలేనంత వేడి ఏమీ లేదు. ఆ కన్నంల నుంచి కనబడుతున్న దూలానికి ఆ నవారును కట్టిండు. అమరులైన తన ఇద్దరు సహచరులను చివరిసారిగా చూసి ఆ నవారును పట్టుకొని కన్నంల్నుంచి కింది రూంలకు జారిండు. జారిన వెంటనే గోడకు నక్కి పరిసరాలను గమనించిండు. అప్పటికి చీకటి పడిపోయింది. అంటే పోలీసుల దాడి మొదలై ఇరువై నాలుగు గంటలు దాటింది.
పరిసరాలు గమనిస్తున్న అతనికి, ఆ రూంకు బజారువైపు వున్న గోడను, బాంబులు పెట్టి పేల్చేసిన్రని అర్థమైంది. పేల్చేసిన కాడ రెండు గజాల గోడకు అటూఇటూ ఇటుకలు కుప్పగా, చెల్లా చెదురుగ పడివున్నయి. . ఆ కూలిన చోట పోలీసులు లేరు. అక్కడి నుంచి మెల్లగా బజార్లకు తొంగి చూస్తే ఎడమ దిక్కుకున్న బజారు దర్వాజ ముందు పోలీసోళ్ల గుంపు కనబడ్డది. ఎదురుంగ డాబా మీద గూడ పోలీసోళ్లు గుంపులు గుంపులుగ వున్నరు. కుడి దిక్కుకు మాత్రం పోలీసులు కనబడలేదు.
ఇగ బజారు దర్వాజ గుండ బయటకు పోవాల్ననే ఆలోచనను విరమించుకొని, ఆ కూలిన గోడ మీది నుంచే బజార్లకు దుంకాల్నని నిర్ణయించుకున్నడతను.
ఆకలీ, దూపా, వంటినిండా మంటలు, నొప్పులు అన్నింటిని మర్చిపోయిండు. లేని సత్తువను కూడదీసుకుండు. తుపాకీని వెనుకకు తిప్పి భుజం మీద పెట్టుకొని ఒక కాలును కూలిన గోడమీద మోపి, ఒక్క ఉదుటున ఎగిరి బజార్ల దుంకిండు. దుంకుతున్నప్పుడే కుడివైపుకు మొకం పెట్టి దుంకిండు. బజారు దర్వాజ ముందున్న పోలీసు గుంపు పైకి భుజం మీద వెనుకకు తిప్పి పెట్టుకున్న తుపాకీతోటి, అట్లనే వెనుక దిక్కుకు ఫైర్ చేస్కుంట మెరుపు వేగంతోటి ముందుకు ఉరకసాగిండు.
మెర్క్యురీ లైట్లు పెట్టుకొని ఎక్కడికక్కడ బజార్లల్ల, డాబాల మీద గుంపులు గుంపులుగ వున్న పోలీసోళ్లు ఆ హఠాత్పరిణామానికి అవాక్కయి వెంటనే తేరుకొని ఉరుకుతున్న అతని వెనుకాల ఫైర్ చేయసాగిన్రు.
అతను బజార్లల్ల ఉన్న పోలీసుల మీదికీ, అప్పుడప్పుడు డాబాల మీద ఉన్న పోలీసుల మీదికీ, ఫైర్ చేస్కుంట సందులు, గొందులల్ల పడి ఉరుక్కుంట దాదాపు ఊరికి ఒక కొసకు చేరుకున్నడు. ఇగ కొద్ది క్షణాలల్ల ఊరు దాటి బయట పడేటోడే.
కానీ ఊరు సుట్టూ గూడ పోలీసులు మోహరించి ఉన్నరు. ప్రస్తుతం అతను ఉరుకుతున్న బజారుకు ఎదురుంగ ఊరి బయట ఒక పోలీసు గుంపు వుంది. తమ వైపుకు ఉరుక్కుంట వస్తున్న అతన్ని చూసి పోలీసులందరు మూకుమ్మడిగ అతని మీదికి ఫైర్ చేసుడు మొదలు పెట్టిన్రు.
సరిగ్గ ఎదురుంగ నుంచి ఫైరింగు వచ్చుడుతోటి ఇగ ముంగటికి పోలేక పోయిండతను. చటుక్కున వెనుకకు తిరిగి సందులు గొందుల్ల పడి ఉరుక్కుంట దాదాపు వూరి మధ్యకు చేరుకుండు.
అప్పటికి పది, పదిహేను నిమిషాల నుండి అతను ఉరుకుతనే వున్నడు ఎక్కడికక్కడ లైట్లు పెట్టుకొని గుంపులు గుంపులుగ ఉన్న పోలీసుల మధ్య నుంచి ఎక్కువసేపు ఉరుకుడు ఇగ మంచిది కాదనుకున్నడు. దానితోని కనబడ్డ ఒక పశువుల కొట్టంలకు దూరిండు. కొద్దిసేపు మొస తీర్చుకుంట నిలబడ్డడు. ఇంతల ఆ కొట్టంల ఒక గడ్డివాము కనబడ్డది. వెంటనే దాన్ని ఎక్కి కొంచెం గడ్డిని పక్కకు తీసి దాంట్లకు దిగి మల్లా గడ్డిని కప్పుకున్నడు.
అట్లా దాదాపు ఆర్ధరాత్రి పన్నెండున్నర దనుక ఉండిపోయిడు. వరిగడ్డి విపరీతమైన వేడి వస్తాంది. గొంతెండిపోతాంది. నోట్లే తడి అరిపోయి మింగుదామంటే ఉవ్మగూడ వస్తలేదు. ‘ఇక వెంటనే నీళ్లు తాగకపోతే వాడు సంపకపోయిన చచ్చే పరిస్థితే’ అనుకున్నడు.
అర్దరాత్రి అందరు తలుపులు బిగుంచుకొని ఉంటరు. గాబట్టి ఎవరింటి బాత్రూంలనన్న, బయట గోళాలల్లనన్న నీళ్లు దొరికిచ్చుకుని తాగాలనుకున్నడు. వెంటనే గడ్డాముల నుంచి లేచి, కొట్టంల నుంచి బయటికొచ్చిండు. దగ్గర్ల వున్న ఒక ఇంటి ముందుకు పోతే బాత్రూం ఉందేమో దోవులాడబట్టిండు. ఇంతల ఇంటి ముంగటున్న కుక్కలు బ్యొమని లేచినయి. . ఆ యిల్లు గొల్లోల్లది. పెద్ద కుటుంబమది. కుక్కల మొరుగుడుకు దాదాపు అందరు లేసిండ్రు.
‘ఎవలు, ఎవలు’ అనుకుంట తలుపు తీసి బయటకు వచ్చిన్రు.
స్వామి వెంటనే వాళ్లింట్లకు బొయ్యి లొల్లి బెట్టకున్రి, నేను స్వామన్నను పోలీసుల ఫైరింగుల నుంచి తప్పిచ్చుకొనొచ్చిన. బాగ దూపయితాంది. కొంచెం నీళ్ల్యిండ్రి’ అన్నడు.
దీపం వెలుగుల అందరు బీరిపోయి చూస్తున్రు అతన్ని. స్వామికి వాళ్లు తెల్వదు గానీ, స్వామిని అంతకు ముందు మీటింగులల్ల గిన వాల్లు చాలసార్లే జూసిన్రు.
వెంటనే ఆ యింటి అమ్మ, రాజవ్వ నీళ్లు తెచ్చిచ్చింది.
గుట, గుటా ఆ నీళ్లను కడుపునిండ తాగిండు.
ఖాళీ చెంబు అమ్మ చేతికిచ్చుకుంట ‘నేను బయట పడుదమంటే ఊరుసుట్టూ పోలీసులున్నరు. ఇప్పుడు పోవుడు వీలుగాదు. కాబట్టి నేను ఈ డ్రెస్సు, తుపాకీ తీసేసి మీ లెక్క మామూలు బట్టలేసుకొనే ఈ యిట్ల ఉంట. ఎట్లనన్న చేసి మీరు ఉంచుకోవాలె మరి’ అన్నడతను.
అతని మాటలకు ఇంటి వాళ్లంత ఆందోళన పడ్డరు.
‘నిన్నిట్ల సూస్తుంటె బాధనిపిస్తాంది గని, రేపు ఇల్లిల్లు దోవులాడుతరు గావొచ్చన్నా’ అన్నడు రాజవ్వ పెద్ద కొడుకు.
‘అమ్మో బిడ్డ, ఒకరు గాదు, ఇద్దరు గాదు వేయిలమంది పోలీసోల్లున్రు. నువ్వు మా యిట్లున్నట్టు తెల్సిందనుకో నిన్నుంచరు. మమ్మల్నుంచరు, మాయిల్లునుంచరు, మా బిడ్డలనుంచరు’ ఆందోళన పడుకుంట అన్నది రాజవ్వ.
ఊరునిండా పోలీసోల్లుండి, నిన్నరాత్రి నుంచి ఒక యుద్ధ వాతావరణాన్ని అనుభవిస్తున్న పరిస్థితిల, తనను ఎవరైనా యింట్ల వుంచుకోవడం సామాన్యమైన సాహసం కాదని అతనికి కూడా అన్పించింది.
‘సరె, నేనుబోతగని మరినేను ఇటువైపు వచ్చినట్టు ఎవ్వరికి చెప్పొద్దు’ అనుకుంట బయటకు నడిచిండు. ఇంకో బజారుగుండ పోవస్తదేమోనని కొంచెం దూరం పోయిండు.
అక్కడ గూడా లైట్లు ఎలిగిపోతున్నయి, పోలీసులున్నరు.
వాళ్లకండ్లల్ల బడకుంట వెనకకు తిరిగి, ఇగ ఇప్పుడు బయటపడుడు సాధ్యం కాదని నిర్ణయించుకొని. మళ్ల అదే కొట్టంలకు పోయి గడ్డి వాముల కూసుండు. ‘ఈ గడ్డాంల ఎంతసేపు దాగుంట. నేను ఊళ్లెనే ఉన్ననని వానికి కచ్చితంగ అర్థమయ్యే వుంటది. రేపు ఇండ్లు, కొట్టాలు, గడ్డాములు అన్ని గాలిస్తడు గావొచ్చు…’ ఆలోచన్ల పడ్డడతను.
ఇంతల అతనికి మురళన్న (కొయ్యూరు అమరుడు) చెప్పిన వొక సంఘటన గుర్తొచ్చింది. ఏదో వూళ్లె సంగ నాయకున్ని పట్టుకుంటందుకు, పోలీసులు వూరంతా దోవులాడుతాంటే జనం అతన్ని పెంటల దాసిపెట్టి, కాపాడిన్రట.
అది గుర్తుకొచ్చిన వెంటనే ఇందాక ఆ గొల్లోల్ల ఇంటి ముంగట చూసిన పెంట గుర్తుకొచ్చిందతనికి. రాజవ్వ కోడండ్లు బీడీలు చేస్తరు. కత్తిరించి పారేసిన ఆకూ, చెత్తా చెదారం కల్పియిటి ముంగట పెద్ద కుప్ప పోగయ్యింది.
తెల్లారుజామున నాలుగు గంటలకు, గడ్డాముల నుంచి మెల్లగ లేచి ఆ పెంట కాడికి పోయిండు. ఆ పెంటల ఒక పక్కకు మనిషి పండుకునేంత పొడుగ్గా చెత్తను తొలగించి, కాలువ లెక్క జేసిండు. ఆ తర్వాత ఆ జాగల కాళ్లు జాపుకొని కూసోని పక్కనే తుపాకీ బెట్టుకొని ముందుగ కాళ్ల మీదంత చెత్తకప్పుకుండు. ఆ తర్వాత ఒక చేయి మీద వెనుకకు ఒరిగి, కడుపుమీద, ఛాతి మీద కప్పుకుండు. ఆఖరికి మొత్తం పండుకొని, మొకం మీద చెత్త పడేటట్టు చేసుకొని చేయిని పక్కకు పెట్టుకున్నడు.
అట్ల దాదాపు ఉదయం ఏడు గంటల దాకా ఉన్నడు. ఇంతల ఆ పెంట పక్కనే ఎవరో బాసండ్లు తోముతున్నట్టు అర్థమైందతనికి తోముకుంట అంట్లు కడిగిన నీళ్లను పెంట మీదికి సల్లుతున్నరు. ఆ నీళ్లు వచ్చి ఎల్లెలికల పండుకున్న స్వామి ముకం మీద పడుతున్నయి. . ఇంచుమించు మూడు గంటల నుంచి కదలకుండ పండుకునుడు వల్ల వీపు ఒత్తుకపోబట్టింది. కాల్లూ జేతులు తిమ్మిర్లెక్కినయి ఇక కదులకుంట ఉండుడు అతనికి వశమయిత లేదు.
‘కొంచెం కదిలిన గూడ పెంట కదుల్తది. పెంట కదుల్తె అక్కడ గిన్నెలు తోముతున్నోల్ల దృష్టిల పడ్తది. వీళ్ల దృష్టిల పడితే పరిణామాలెట్లుంటయో. రాత్రే బాగా బయపడ్డరు గద. ఇప్పుడు యిక్కన్నుంచి పొమ్మంటే ఎటూ పోలేని పరిస్థితి. తెల్లారింది గాబట్టి బజార్లకు బోతే పోలీసుల దృష్టిల అల్కగ పడుత…’ రకరకాలుగా ఆలోచిస్తుండతను.
అయినా కదలకుండ ఉండుడు అతని వల్ల కాలేదు. కొంచెం పక్కకు తిరిగినట్టు కదిలిండు.
అంతే ‘వామ్మో పెంటల ఏందో ఉన్నదిరో’ అని గట్టిగ వె•త్తుకున్న రాజవ్వ గొంతుతో పాటు, ఏదో గిన్నె కిందపడ్డచప్పుడు గూడ వినబడ్డది అతనికి. ఆమె కొంచెం దూరం వురికినట్టు కూడా సప్పుడయింది.
ఇంతల ఇంట్ల నుంచి ‘ఏంటిది, ఏంటిది’ అనే మాటలు వినబడ్డయి. ఇంట్ల నుంచి అందరు బయటకు వస్తున్నట్టు అనిపించిందతనికి.
ఇంక అట్లనే పండుకుంటే లొల్లి ఎక్కువై, బజార్ల అందరి దృష్టిల పడిద్దని భయపడి, మొకం మీద నుంచి చెత్తను తీసేసుకుంట ‘అమ్మా మీరు లొల్లి జేయకుండ్రి నేనే. రాత్రి వచ్చిన గద. పోదమంటే వూరి సుట్టూ పోలీసులుండ్రు. ఇగేడికి పోలేక ఇక్కడ దాసుకున్న’ అన్నడు.
అక్కడ గుమికూడిన ఇంటి వాళ్లందరూ నోట మాట రానట్టు చూడసాగిన్రు అతని వైపు. చిన్న పిల్లలు గూడ మూగిండ్రక్కడ.
వాళ్లింక తేరుకోక ముందే ‘పోలీసోల్లు వూరి నిండ, వూరుసుట్టూ ఉన్నరు. ఇప్పుడు నేను ఎక్కడికి పోయే పరిస్థితి లేదు. ఈ పూటకు మీ యిట్ల దాస్కుంట. రాత్రికి ఎట్లనన్న జేసి ఎల్లిపోత. ఈ ఒక్కపూటకు నన్ను కాపాడుండ్రి. మేం ఎవరికోసమో బతుకుతలేం. మీరే కాపాడాలె మమ్ముల’ అన్నడు స్వామి.
రాజవ్వ కొడుకులల్ల ఒకాయన వెంటనే ‘సరే లేసి లోపలికి రా అన్నా’ అన్నడు.
రాజవ్వ మాత్రం ‘వామ్మో ఆ… కొడుకులకు తెల్సిందంటే అన్నను జంపుతరు, మనల్ని జంపుతరు వొద్దు బిడ్డో, యిట్లొద్దు’ అన్నది.
‘ఇప్పుడేడికి పోతడవ్వా అన్న. ఏమయితే గదే అయితది తియ్’ అన్నడు ఇంకొక కొడుకు.
‘ఒద్దురో కొడుకో… ఇంట్ల సిన్న సిన్న పిల్లలున్రు. పసి గూనలుండ్రు అందర్ని జంప్తర్రో…’
తన బిడ్డలకేం ముప్పు వస్తదోనన్న తల్లి హృదయపు ఆందోళన ఆమె మాటలల్ల స్పష్టంగ తెలుస్తాంది.
తల్లీ కొడుకుల మధ్య కొంచెం సేపు వాదన జరిగింది.
అయినా గూడ తల్లిని కొడుకులు వొప్పించలేక పోయింన్రు.
ఇగ తల్లి ఒప్పుకోదని అర్థమైన ఒక కొడుకు స్వామి దగ్గరికి వచ్చి ‘నువ్వయితే ఇక్కన్నుంచి లేన్నా. మేం నిన్ను ఇంకో ఇంట్ల పెడ్తం’ అన్నడు.
ఇంకొంచెం సేపు మాటలు, వాదనలు కొనసాగితే పక్కింటోళ్లు వింటరనే భయంతోటి స్వామి వెంటనే లేచిండు పెంటల్నుంచి. మళ్లొకసారి యింట్లోకి పోయి నీళ్లు అడుక్కొని తాగిండు.
‘ఇగ ఇప్పుడు వేరే ఇంటికి పోవుడు గూడ కష్టం గని, నేనుగా కొట్టంల దాసుకుంట, మీరయితే ఎవ్వరికి చెప్పొద్దు.
పిల్లలందరు జూసిన్రు మరి. పిల్లలు గూడ ఎక్కడ అనకుంట సూడండ్రి’ అన్నడు తను రాత్రి వున్న కొట్టం వైపు చేయి చాపి చూపించుకుంట.
రక్తసిక్తమయిన అతని బట్టల దిక్కూ, మొకం నిండా, చేతుల నిండా కనబడుతున్న అతని గాయాల దిక్కు, అందురూ సానుభూతిగ చూస్తుండ్రు.
‘అండ్లొద్దన్నా గీ ఇంటోల్లు వూరికి బోయింన్రు. ఇంటికి తాళం బెట్టుంది. ఈ గోడెక్కి లోపలికి బోతే ఇంటి పక్కనే కొట్టముంటది. దాంట్ల దాసుకున్నవంటే ఇంటికి తాళమేసుంది గాబట్టి ఎవ్వరికి అనుమానం రాదు’ అన్నడు రాజవ్వ కొడుకు తమ ఎదురింటి దిక్కుకు చేయి జూపి సూపించుకుంట.
రాజవ్వతో పాటు అందరు గూడ అక్కడుంటే బాగుంటదని అన్నరు. స్వామికి కూడా అది బాగనే వుంటదనిపిచ్చింది. తను సరేననుడుతోటి రెండు సన్నటి మొద్దులను ఎదురింటి గోడకు ఏటవాలుగా ఏసిండ్రు రాజవ్వ కొడుకులు.
ఆ మొద్దుల మీద నుంచి గోడెక్కి లోపలికి కొట్టంలకు దిగిండు స్వామి.
ఇదంతా ఇంకెవ్వరూ చూడకుండ జాగ్రత్తలు తీసుకున్నరు.
కొట్టంల ఒక మూలకు ఉన్న గడ్డి మోపులను కూసునేటందుకు వీలుగ చేసుకోని తాను కూసోని పైనుంచి గడ్డిని కప్పుకున్నడు స్వామి.
నాలుగైదు గంటలు అతి భారంగ గడిచినయి.
మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంల ‘బిడ్డా బిడ్డా’ అని గోడ దగ్గర్నుంచి రాజవ్వ పిలుసుడు వినబడ్డది అతనికి. ‘ఆ’ అనుకుంట గడ్డిల నుంచి లేచి గోడ దగ్గరికి వచ్చిండు. కానీ గోడ ఎత్తుగ ఉండుడుతోటి అటుదిక్కున్న రాజవ్వ కన్పడ్తలేదు. అటీటు సూస్తే బండి గిర్ర కనబడ్డది. దాన్నిజరుపుకుంట గోడ దగ్గరికి తెచ్చి గోడకు ఆనిచ్చిండు. దానిమీద ఎక్కి, గోడమీద తలకాయబెట్టి రాజవ్వ దిక్కుకిందికి చూసుకుంట ‘ఏంటిదమ్మ’ అని అన్నడు మెల్లగ.
‘ఏంది బిడ్డ ఎన్నిసార్లు పిల్సినా ‘వూ’ అనవు ‘ఆ’ అనవు’
‘అయ్యో! సాలసార్లు పిల్సినవా? సెవులు గడలు బడ్డయమ్మా సరిగ్గ ఇనబడ్తలేవు’
‘అయ్యో బిడ్డా, మీకెందుకొచ్చిన తిప్పలు బిడ్డ, ఎవరి కోసమొచ్చిన తిప్పలు బిడ్డా, వొయిసు బిడ్డలు, కొడుకుల సంపేసిరి గద. ఇప్పుడే సూసొస్తున్న బిడ్డా’ అంది అవేదనగా.
‘నువ్వు సూసొచ్చినవా అమ్మా’ స్వామి గొంతుల అతృత.
‘సూస్తిని బిడ్డా, ఇంటికో కట్టె తెస్తే పీనుగల జూపిస్తమన్నరట పోలీసొల్లు, నేంగూడ సూసొస్తనని జెప్పి రెండు కట్టెలు తీస్కోని పోయిన, అయ్యో బిడ్డా వొయిసు బిడ్డలు ఇద్దరున్నరు. వొయిసు కొడుకులు ముగ్గురున్నరు…’
అమె మాటలకు మధ్యల్నే అడ్డం వచ్చుకుంట ‘ముగ్గురా? అన్నలు ముగ్గురున్నరా!?’ అని అడిగిండు.
‘అవును బిడ్డా ముగ్గురున్నరు. అయ్యో, జనం జనం అని తిప్పలు పడుతుంటిరి కొడుకా. ఇప్పుడే జనం అడ్డుబడ్డరు కొడుకా, అముగ్గుర్ని సంపుతుంటే’ ఆమె గొంతు జీరబోయిది.
వెంటనే తమాయిచుకొని ‘నువ్వయితే సీకటి బడేదాన్కు బయటికి రాకు బిడ్డా. ఊర్నిండ వేయిల మంది పోలీసోల్లుండ్రు. ఇందాన్కనే నేను సేనుకాడికి పోయి వచ్చిన. వూరు సుట్టూ గూడ వుండ్రు. ఇయ్యాల పొయేటట్టే లేరు. ఆండ్లింట్ల పీనుగెల్ల మంచిగ టెంట్లేసుకొని వొండుకొని తింటాన్రు. నేను గడీగ్గడికొచ్చి వూర్లేం జర్గేది సెప్తగని నువ్వయితే పయిలంగుండు బిడ్డ. ఇగో ఎప్పుడు తిన్నవో ఏందో గీ దోసకాయ తిను బిడ్డా దూపగాకుంటుంటది’
అనుకుంట దోసకాయ అతని చేతిలబెట్టి అటిటు జూసుకుంట వెనుకకు తిరిగి ఇంట్లకు పోయిందామె.
బండి గిర్ర నుంచి కిందికి దిగి మల్ల గడ్డి మోపులల్లకు పోయిండతను ‘అయితే క్రాంతిని గూడ సంపిన్రన్న మాట… అయినా వాడు సంపకుంట ఎట్లుంటడు? క్రాంతి ఎట్ల నమ్మిండు వాన్ని? ఎట్ల భ్రమల పడ్డడు? ఎంత ఆదర్శంగ ఉండేటోడు? ఎంత కష్టాన్నయిన ఎట్ల భరించేటోడు!
నల్లటి కోల మొకంతోటి ఎత్తుగ వుండే అతని రూపం ఎదురుంగ నిలబడ్డట్టే అన్పియ్యబట్టింది స్వామికి
ప్రభాకర్, క్రాంతి, గోపి ముగ్గురూ ఒక్క ఈడోళ్లే. ముగ్గురూ పది, ఇంటర్ సదువుకున్నోళ్లే. ముగ్గురూ ఆదర్శంగా ఉండేటోళ్లే. విజయక్క లలితక్క కూడా అంతే ఆదర్శంగ ఉండేటోళ్లు. ఎంత మంచి టీం? ఒక్క రోజుల ఎట్ల మాయమైంది.
అసలెట్ల జరిగుంటది? నిన్నటి భయానక బీభత్సకాండలో సహితం ఎన్నోసార్లు మనసును తొలిచిన ప్రశ్న మల్లా తొలచసాగింది.
దళం మొన్న తెల్లారు జామున వూళ్లెకు వస్తుంటే పెంటల గంగిరెడ్డి అనేటాయన బయటికి మూత్రానికి లేచివచ్చినట్టుండు. అతను చూసిండు.
అతను పార్టీకి కొంచెం వ్యతిరేకం. అయితే కొంచెం దూరం నుంచి చూసిండు గాబట్టి దళమేనని స్పష్టంగ అర్థం కాదనుకున్నరు వీళ్లు. పోలీసుల్లెక్క నటిద్దమని చెప్పి ప్రభాకర్, గోపి పోయి అతనితోటి హిందీల మాట్లాడి వచ్చిన్రు.
‘కానీ వాడికి దళమేనని అనుమానం వచ్చుంటదా? ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటడా?’ స్వామి ఇలా అనుకోవడం ఎన్నోసారో, అంతేగాదు షెల్టర్ వాళ్లు కూడా మంచి నిద్రల వుండుడువల్ల చాలాసార్లు పిలువాల్సి వచ్చింది.
‘అప్పుడెవరన్నా వినుంటరా’ ఇట్ల అనుకోవడం కూడా ఎన్నోసారో.
ఎక్కడ్నో జరిగిన చిన్న తప్పుకు పెద్ద దెబ్బ పడ్డది. తన సహచరులంతా బలైపోయిన్రు.
తనొక్కడే మిగిలిండు. తనైనా బతుకుతడా? వేల పోలీసులు ఉన్నరంటుంది అమ్మ. తప్పించుకునుడు సాధ్యమయితదా? ఈ కామ్రేడ్స్ ఆశయాలను కొనసాగించేటి అవకాశం, వీళ్ల నెత్తుటి బాకీని తీర్చుకునే అవకాశం తనకుందా? దోసకాయను చేతిల పట్టుకుని ఆలోచన్ల పడ్డడతను.
ఇంతలనే ఆలోచన్ల నుంచి ఉలిక్కిపడి బయట పడుకుంట ‘అరె అలెర్ట్గ ఉండాలె ఏ క్షణంలనన్న పోలీసులు రావొచ్చు’ అనుకుండు.
ఎందుకో గుర్తొచ్చి తుపాకీ మాగ్జిన్ తీసి తూటాలెన్ని వున్నయో చూసుకుండు. ఒక్కటే వుంది. మాగ్జిన్లో, మరోతూటా లోడయి వుంది.
ఒక్కసారిగ నీరసం ఆవహించింది అతన్ని.
ఇంతల ‘బిడ్డా బిడ్డా’ అని అమ్మగొంతు మల్లా వినబడ్డది.
బండి గిర్రెక్కి తొంగి చూసిండతను. ‘ఇగో బిడ్డా గీ బువ్వ దిను’ అన్నం మూటను అతని చేతులకు అందించింది.
ఒక లోటతోటి మంచి నీళ్లు గూడ ఇచ్చింది.
వాటిని అనాసక్తిగ అందుకుంట ‘పోలీసులు ఉన్నరామ్మా’ అనడిగిండు.
‘ఉన్నరు బిడ్డా పీనుగెల్ని కాలబెడ్తుండ్రు’ అని ఒక్క క్షణమాగి ‘బిడ్డా నువ్వయితే రాత్రి ఇక్కడ వుండొద్దు. నువ్వు వూర్లేనే వున్నవని వాళ్ల కర్థం అయిందట. ఇల్లిల్లు దోవులాడుతమంటున్రు. నువ్వీడ దొర్కినవంటే నిన్ను జంపుతరు, మవ్మల జంపుతరు, సీకటైనంక బయటబడు బిడ్డా’ అంది.
నువ్వే అంటున్నవ్ గదమ్మ వూరినిండ పోలీసులుండ్రని, ఎట్ల పోతనమ్మ నేను?’
‘వో, నువ్వు గంత మంది సుట్టుమడితే గూడ గండ్లకెళ్లి తప్పిచ్చుకుని ఒచ్చినవ్, గిండ్లకెళ్లి పోవుడు కష్టమా నీకు. నువ్వెట్లనన్న మంచిగనే పోతవు బిడ్డా ఈడుంటనే దొర్కిపోతవు…’
ఆ సమయంలోనూ స్వామికి నవ్వొచ్చింది.‘విప్లవకారుల వీరత్వం మీద ప్రజలకెంత విశ్వాసం’ అనుకుండు.
సరేనంటూ అన్నం మూటా, నీళ్లూ తీసుకొని, మల్లా గడ్డిమోపుల దగ్గరికి పోయిండు.
ఆ అమ్మతో వాదనెందుకని సరేనన్నడు గని, ఈ రాత్రికి తప్పిచ్చుకునుడు సాధ్యం కాదని అతనికి అన్పిస్తాంది. ఫైర్ చేసి తప్పిచ్చుకుందమంటే తుపాకీల రెండే తూటలున్నయ్.
ఇంకెన్ని రోజులుంటరు పోలీసులు? బహుశా రేపు ఎల్లిపోతరు గావొచ్చు. కాబట్టి ఈ రాత్రికి ఇక్కడ్నే తలదాచుకుంటే సరిపోతది. ఇదేం చిన్నా చితకా వూరుకాదు. అయిదు వందల గడపకు మించే వుంటది. ఎన్ని ఇండ్లు ఎన్ని కొట్టాలని దోవులాడుతరు?… ఇట్ల వున్నయి అతని ఆలోచనలు.
అన్నం మూట విప్పాలనే ఆలోచన కూడా రాలేదతనికి. అప్పుడప్పుడూ లోటలున్న నీళ్లతోటి గొంతు తడుపుకుంటుండు.
రాత్రి లోపు అమ్మ మరో రెండుసార్లు వచ్చి పోలీసుల సమాచారం చెప్పి పోయింది. రాత్రంది. రాత్రంతా అతను అలర్ట్ గా కూర్చునే ఉన్నడు.
తెల్లారింది.
దాదాపు ఏడు గంటలయింది. అమ్మ వాళ్ల ఇంటి ముగట బాసాండ్లు తోముతున్న చప్పుడైతాంది. ‘అమ్మనే తోముతుంది గావొచ్చు. ఇంక యిప్పుడే ఆమెతోటి మాట్లాడే అవకాశం’ అనుకుంట గడ్డిమోపుల నుంచి లేచి బండి గిర్రెక్కిండు. బాసాండ్లు తోముతున్నది అమ్మనే!
‘అమ్మా’అని పిలిచిండు అమెకు వినబడేంత గట్టిగా.
ఆమె ఆశ్చర్యంగ తిరిగి చూసింది. ‘వో బిడ్డా నువ్వు రాత్రి పోలేదా? నిన్న రాత్రి అటు దిక్కు పోలీసోల్లు ఇల్లిల్లు గాలిచ్చిన్రట. ఇగ ఇయ్యాల ఇటొస్తరట, ఇగ నిన్ను జంపుతరు. మమ్ముల జంపుతురు’ అనుకుంట గూడ దగ్గరికొచ్చిందామె.
‘అది గాదమ్మా, నువ్వే చెప్తున్నవ్ గద సుట్టూ పోలీసులున్నరని ఎట్ల పోవాలె జెప్పు?’
‘ఒక పని చేద్దం. నువ్వు నాకొక అంగి, దోతి, గొంగడి తెచ్చియ్యి. నేను వాటిని కట్టుకుని పోత. ఇట్ల డ్రెస్సులనైతే పోలేను’ రాత్రి నుంచి వస్తోన్న ఈ ఆలోచనను ఆమె ముందుపెట్టిండతను.
అతని ఆలోచనను ఆమె గూడ ఆమోదిస్తున్నట్టు ఇంట్లకు పోయి అవన్నీ తెచ్చిచ్చింది.
అతను అంగీ దోతి కట్టుకొని, డ్రెస్సు, తుపాకీని గడ్డిల దాచిపెట్టి, గోడమీద నుంచి దూకి అమ్మ యింట్లకు పోయిండు.
‘ఉట్టిగనే గొంగడి కప్పుకొని పోవుడుకంటే, ఏదన్న మందు బస్త ఇయ్యమ్మ సేన్లకు పోతున్నట్టుంటది’ అన్నడు.
‘మందు బస్త లేదు బిడ్డ ఇంట్ల’
‘పోనీ గిన్నన్ని ఇత్తనాలన్న మూటగట్టియ్యమ్మా’
సరేననుకుంట కొన్ని ఒడ్లు మూట కట్టిచ్చింది. అది తీసుకుండు, అట్లనే అక్కడ్నే కూసోని బీడీలు చేస్తున్న రాజవ్వ కోడండ్ల దగ్గరకు పోయి, కొన్ని బీడీలు అడుక్కుండు. ఒక అగ్గిపెట్టెను కూడా అడుక్కుండు.
ఆయనకు బీడీలు తాగుడు అలవాటు లేకున్న బీడీ కాల్చుకుంట పొగ వదులుతుంటే మొకం స్పష్టంగ అర్థం కాదని అతని ఉద్దేశం.
‘గొంగడి కప్పుకొని, మూటనెత్తిల బెట్టుకొని, బీడీ అంటబెట్టుకొని ‘ఇగ బోతునమ్మ’ అనుకుంట వాకిట్లకొచ్చి నాలుగైదు అడుగులు వేసిండో లేదో ‘బిడ్డా, బిడ్డా’ అనుకుంట పిలిచిందామె. వెనుకకు తిరిగి చూసిన అతన్ని లోపలికి రమ్మని పిలిచింది.
లోపలికి పోంగనే- బిడ్డా మాకొక తిప్పలొచ్చింది బిడ్డా. నువ్వే ఆదుకోవాలె. మా అల్లుడు పైసలు అక్కరున్నయని ఎక్కనన్న బాకి జేసన్న ఇప్పియ్యమని, మళ్ల తీరుస్తనని, అంటే ఒకయ్యకాడ బాకీ ఇప్పిచ్చిన బిడ్డా. ఇప్పుడా బాకీ తీరుస్తలేడు. ఇచ్చినోళ్లేమోయిటి సుట్టు తిరగవట్టిన్రు. ఇప్పుడు మళ్ల పైసలు కావాలని అడుగుతుండు.
ఇయ్యకుంటే నా బిడ్డను ఇడ్సిపెడ్తనంటుండు. ఎట్లనన్న చేసి ఆనికి మీరు బుద్ది జెప్పాలె బిడ్డా’.
నిన్ననే ‘ఎందుకొచ్చిన తిప్పలు బిడ్డా మీకు’ అన్న ఆమె ఈ రోజు తమ తిప్పల్ని తీర్చమని అడుగుతున్నది.
స్వామి కాసేపు తన పరిస్థితి మర్చిపోయి ఆమె సమస్యలో లీనమైపోయిండు.
‘సరేనమ్మ మల్లసారి వచ్చినప్పుడు నీ అల్లుడ్ని పిలిపించి మాట్లాడుదం. నువ్వేం ఫికర్ చెయ్యకు’ ఎవరి సమస్య పట్లనైనా ఎప్పుడూ ఎట్ల స్పందిస్తాడో అప్పుడు గూడ అట్లనే స్పందించిండు.
మరుక్షణం అతనికి తన పరిస్థితి స్పృహలోకి వచ్చింది. ‘ఎంత ధైర్యంగ హామీనిస్తున్న? ఇంతకూ నేను బతికి బయట పడ్తననీ, తన సమస్యను పరిష్కరిస్తనని విశ్వాసం ఎక్కడి నుండి వచ్చింది? ప్రజల ఈ విశ్వాసమే కదా విప్లవోద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నది’ అనుకుంటూ లేచి ‘పోయొస్తనమ్మ’ అని మల్ల వాకిట్లకు వచ్చి నాలుగైదు అడుగులేసిండు.
‘బిడ్డా’ అంటూ మళ్లీ పిలుపు.
రెండు మూడు అడుగులు వెనక్కి వేసిండతను.
‘బిడ్డా ఇట్లబోతే శాన దూరం దాకా వరిపొలాలే ఉండయి. ఆ పొలాలకెళ్లి తప్పించుకొని పోవుడు కష్టమైతది. ఇట్లబోతే మక్కజొన్న సేన్లొస్తయి. ఆ సేన్లల్ల పడ్డవంటే నువ్వు మంచిగ తప్పిచ్చుకోవచ్చు’ చేతుల్తోటి దిక్కులు చూపించుకుంట చెప్పిందామె.
తన క్షేమం గురించి ఆమె పడుతున్న ఆరాటానికి అతను కొంచెం కదిలిపోయి ‘అట్లనేనమ్మా’ అనుకుంట కదిలిండు.
మల్ల నాలుగైదు అడుగులేసినంక ‘బిడ్డా, బిడ్డా’ అని మల్లా పిలిచింది. వెనుకకు తిరిగి చూసిండతను.
‘కాదు బిడ్డా, నీకు తొవ్వలు తెల్వకపాయె, ఏం తెల్వకపాయె, ఎట్లబోతవో ఏమో, నేను దొడ్డికి బొయినట్టు లోటల నీళ్లు బట్టుకొని ముంగట నడుస్త. నువ్వు నా ఎన్కనేరా. నిన్ను తీస్కపోయి ఆ మక్క సేండ్లండ్ల పడేస్త. అక్కడ్నుంచి ఇగ నువ్వు ఎల్లి పోవచ్చు’ అనుకుంట దబ దబ లోటతోని నీళ్లు ముంచుకుంటున్న ఆమె వైపు విస్మయంగ జూసిండతను.
అన్ని బజార్లల్ల గుంపులు గుంపులుగ పోలీసులున్నరు. వూరు సుట్టూ పోలీసులున్నరు. ఆ పోలీసుల నడుమ నుంచి తనను తప్పించే పథకం వేస్తున్నదామె. ఆ పథకాన్ని స్వయంగ తనే అమలు చేస్తందుకు సిద్దపడుతాంది.
ఆ పథకం ఏ మాత్రం విఫలమైనా ఫలితం ఎట్లుంటదో ఆమెకు బాగనే తెల్సు. విప్లవకారులకు అన్నం పెట్టినందుకు, ఆదరించినందుకు చిత్రహింసలననుభవించిన, జైళ్లల్లపడ్డ, చివరకు ప్రాణాల్నే పోగొట్టుకున్న ఎందరెందరి గాథల్నో తెలంగాణా గడ్డ మీద పుట్టి పెరిగిన ఆమె వినే వుంది.
అంతెందుకు రెండు రోజుల క్రితం విప్లవకారులకు షెల్టర్ ఇచ్చిన ఇంటివాళ్లు ఇంకా పోలీసుల చేతులల్ల చిత్రహింసలను అనుభవిస్తనే ఉన్నరు. వాళ్లను ప్రత్యక్షంగా నిన్న సూడనే చూసింది గూడ.
అయినా ఆమె సాహసానికి తెగిస్తాంది. విప్లవకారులను కాపాడే బాధ్యతను తన భుజానికెత్తుకుంది. అతనికి పైలట్గా మారదల్చుకుంది.
ఇందుకే కదా ప్రజలే ఉక్కుకోటన్నది అనుకున్నడతను.
‘ఇక నాకు ఏ డోకాలేదు. ఈ ఉక్కుకోట నన్ను రక్షించి తీరుతది’ అనుకుంటూ ఆమెను అనుసరించిండు స్వామి.
(1993లో జరిగిన పడ్కల్ ఎన్కౌంటర్ గురించి కామ్రేడ్ స్వామి స్వయంగా చెప్పిన కథనానికి అక్షర రూపమిది.
అంకితం: ప్రజాయుద్ధాన్ని తమ ఒడిలో దాచుకొని కాపాడుకుంటున్న ఎందరో అమ్మలకు, ప్రత్యేకించి ఈ అమ్మ రాజవ్వకు…
Tags encounter kamareddy maoist nizamabad peopleswar prabhakr swamy
Written By
anadmin
You might also like
నక్సల్స్ ఓడిపోయారు సరే, మరి గెలిచినదెవరు? – హిమాంశు కుమార్
నక్సల్స్ ఓడిపోయారు సరే, మరి గెలిచినదెవరు? – హిమాంశు కుమార్
Editor Picks / ఉద్యమ వార్తలు / జాతీయం / తెలంగాణ / ప్రపంచం 4 months ago 358
వర్తమాన సంక్షోభం – చారిత్రక ఆశావాదం
వర్తమాన సంక్షోభం – చారిత్రక ఆశావాదం
Editor Picks / ఉద్యమ వార్తలు / ఏపి / జాతీయం / ప్రపంచం 4 months ago 548
5 రాష్ట్రాల బంద్ – మావోయిస్టు పార్టీ పిలుపు
5 రాష్ట్రాల బంద్ – మావోయిస్టు పార్టీ పిలుపు
ఉద్యమ వార్తలు / ఏపి / జాతీయం / తెలంగాణ / ప్రకటనలు 4 months ago 456
సోను (వేణుగోపాల్) విప్లవ ద్రోహి – ప్రజా యుద్ధమే మన మార్గం : మావోయిస్టు పార్టీ
సోను (వేణుగోపాల్) విప్లవ ద్రోహి – ప్రజా యుద్ధమే మన మార్గం : మావోయిస్టు పార్టీ
Editor Picks / ఉద్యమ వార్తలు / ఏపి / జాతీయం / తెలంగాణ 5 months ago 2.2 K
భారతదేశంలో జరుగుతున్న ప్రజా యుద్ధానికి మద్దతుగా యూరప్ లో కార్యక్రమాలు
భారతదేశంలో జరుగుతున్న ప్రజా యుద్ధానికి మద్దతుగా యూరప్ లో కార్యక్రమాలు
Editor Picks / ప్రపంచం 6 months ago 152
మావోయిస్టు నాయకుడు రూపేష్ కు జీవిత ఖైదు విధించిన తమిళనాడు కోర్టు
మావోయిస్టు నాయకుడు రూపేష్ కు జీవిత ఖైదు విధించిన తమిళనాడు కోర్టు
Editor Picks / ఉద్యమ వార్తలు / జాతీయం 7 months ago 378
Leave a Reply
Search
Search
Recent Posts
ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర
తన క్లయింట్ల కంటే ఎక్కువకాలం జైలులో ఉన్న న్యాయవాది
సమ్మక్క, సారలమ్మలను ఎందుకు తలచుకోవాలి?
ఈ నెల 24, 25వ తేదీల్లో విరసం 30వ మహాసభలు
‘అప్రతిహత’ విప్లవ గాథ – ముసాఫిర్
Recent Comments
మాంచాళ అచ్యుత త్యనారాయణ రావు on అన్నంలో విషం కలిపి, చిత్రహింసలు పెట్టి ఆ ఏడుగురిని చంపేశారా ?
– Advertisement –
BuzzMag Ad
© 2026 Avani News. Designed & Developed by FlatLayers








