ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము
జంపన్న
జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినారు. వీరికి విప్లవ జోహార్లు.సుమారు 40 ఏళ్ల పాటు అజ్ఞాతంలో, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో విప్లవ బాటలో నడిచిన ప్రభాకర్ జీవితం తెలంగాణ సాయుధ పోరాటం నుండి దండకారణ్యం వరకు సాగిన ఒక సుదీర్ఘ విప్లవ ప్రస్థానం.
తొలి జీవితం మరియు సామాజిక నేపథ్యం
లోకేటి చందర్ 1969 ప్రాంతంలో నిజామాబాద్ జిల్లా (ప్రస్తుత కామారెడ్డి) సదాశివనగర్ మండలం ఇస్రోజివాడి గ్రామంలో జన్మించారు. ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన, తల్లిదండ్రులు కిష్టాబాయి, వీరన్నలకు నాలుగవ సంతానం. ఆయనకు ఒక అక్క, ఇద్దరు అన్నలు ఉన్నారు.
కేవలం ఆరవ తరగతి వరకే చదువుకున్నా, సమాజంలోని అసమానతలను పసిగట్టడంలో ఆయన చురుగ్గా ఉండేవారు. 1984లో 16 ఏళ్ల వయసులోనే సులోచనతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు కలిగారు. విప్లవ బాట పట్టిన తర్వాత ఆయన తన కుటుంబాన్ని, పిల్లలను వదిలి పూర్తిగా పార్టీకే అంకితమయ్యారు.
విప్లవ అంకురార్పణ – రాడికల్ యూత్ లీగ్ (RYL) ప్రస్థానం.
గడీల పునాదులు కదిలించిన పిడుగు.
చందర్ రాజకీయ ప్రస్థానం 1986లో రాడికల్ యూత్ లీగ్ (RYL) తో ప్రారంభమైంది. గ్రామాధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించి, తన గ్రామంలో ఉన్న ముగ్గురు భూస్వాముల (మాలీ పటేల్, పోలీస్ పటేల్) ఆగడాలకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేశారు.
భూ పోరాటాలు: భూస్వాములు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను పేదలకు పంచడం.
ప్రజా దారులు: భూస్వాములు పేద రైతులకు దారి ఇవ్వకపోతే, వారి మెడలు వంచి దారులు వేయించడం.
కూలీ పోరాటాలు: వ్యవసాయ కూలీల జీతాల పెంపు, 24 గంటల విద్యుత్ కోసం ఉద్యమాలు.
ప్రజా పంచాయతీలు: పక్షపాతంతో కూడిన భూస్వామ్య పంచాయతీలను రద్దు చేసి, విప్లవ పద్ధతుల్లో న్యాయం చేయడం.
ఒక సందర్భంలో పోలీసులు తనను సరెండర్ చేయమని గ్రామాన్ని చుట్టుముట్టి వందలాది మందిని అరెస్ట్ చేసినప్పుడు, చందర్ భయపడకుండా ప్రజలనే చైతన్య పరిచి, తిరిగి భూస్వాములతోనే అరెస్ట్ అయిన వారిని విడిపించేలా ఒత్తిడి తీసుకురావడం ఆయన నాయకత్వ పటిమకు నిదర్శనం.
గ్రామస్తులు తన ఇంటి ముందు ధర్నా చేసి, “నువ్వు లొంగిపోతేనే మమ్మల్ని వదులుతారు” అని ఏడ్చినప్పుడు ఆయన కోప్పడలేదు. వారి ఆవేదనకు కారణం భూస్వాములే అని గుర్తించి, ఆ భూస్వాములనే ఎదుర్కొని ప్రజలను విడిపించడం ఆయనలోని సామాజిక బాధ్యతకు, నాయకత్వ లక్షణానికి నిదర్శనం.
1991 ఏప్రిల్‌లో ఆయన పూర్తికాల విప్లవకారునిగా (Profession Revolutionary) మారారు. తొలుత నిజామాబాద్‌లోని కామారెడ్డి, సిర్నపల్లి దళాల్లో పనిచేశారు. ఆ తర్వాత క్రమంగా డివిజన్ కమిటీ మెంబర్ (DVCM) స్థాయికి ఎదిగారు.
2003లో పార్టీ నిర్ణయం మేరకు తెలంగాణ నుండి చందర్ దండకారణ్యం (DK) కు బదిలీ అయ్యారు. అక్కడ ఆయనకు ‘ప్రభాకర్’ అనే పేరు స్థిరపడింది.
నిర్వహించిన పదవులు: 2005లో కంపెనీ-2 కమాండర్, 2006లో Dandakaranya Special Zonal Committee (SZC) సభ్యునిగా నియమితులయ్యారు.
సబ్ జోన్ బాధ్యతలు: 2011లో వెస్ట్ సబ్ జోన్‌కు బదిలీ అయ్యారు. పశ్చిమ గడ్చిరోలిలో పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.
శిక్షణ: సైనిక వ్యూహాల్లో నిష్ణాతుడైన ఆయన, వందలాది మంది PLGA బలగాలకు మిలిటరీ ఇన్‌స్ట్రక్టర్‌గా శిక్షణ ఇచ్చారు. అనేక పార్టీ మహాసభలు, ప్లీనాలకు హాజరై సిద్ధాంతపరమైన అవగాహనను కూడా పెంపొందించుకున్నారు.
సాయుధ పోరాటంలోకి ప్రవేశం – సైనిక చర్యలు.గెరిల్లా యుద్ధ నీతిలో నిష్ణాతుడు.
ప్రధాన దాడులు (Raids):
1991లో పూర్తికాల విప్లవకారిగా మారిన చందర్, అనతి కాలంలోనే గెరిల్లా యుద్ధ తంత్రాల్లో మేటిగా నిలిచారు. ఆయన జీవితంలో కొన్ని ప్రధాన సైనిక చర్యలు విప్లవ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిపోయాయి:
సిర్నపల్లి అవుట్ పోస్ట్ (1993): 20 మంది పోలీసులపై దాడి చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
పాపన్నపేట పోలీస్ స్టేషన్ (1999): మెదక్ జిల్లాలో వాహనంలో వెళ్లి మెరుపు దాడి చేసిన అస్సాల్ట్ టీమ్‌కు ఈయనే నాయకత్వం వహించారు.
రాణి బోదిల్ (2007): ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇది ఒకటి. ఇందులో 57 మంది పోలీసులు మరణించారు, ఈ దాడికి చందర్ టోటల్ కమాండర్‌గా వ్యవహరించారు.
హెలికాప్టర్ పై దాడి (2006): దంతేవాడ అడవుల్లో వాయుసేన హెలికాప్టర్ పై దాడి చేసి పైలట్లను హతమార్చిన టీమ్‌కు కూడా నాయకత్వం వహించారు.
మృత్యువును వెక్కిరించిన ‘మృత్యుంజయుడు’
తన 35 ఏళ్ల అజ్ఞాత జీవితంలో ప్రభాకర్ సుమారు 30కి పైగా ఎన్‌కౌంటర్లను ఎదుర్కొన్నారు.
పడ్కల్ ఎన్‌కౌంటర్ (1993): పోలీసులు 26 గంటల పాటు చుట్టుముట్టినా, ప్రజల రక్షణలో ఉండి 36 గంటల తర్వాత వారి కళ్లు కప్పి సురక్షితంగా బయటపడ్డారు.
రామడుగు దాడి (1999): పోలీసులు ఒక ఇంటిలో బంధించి తాళం వేస్తే, లోపలి నుండి గొడ్డళ్లతో తలుపులు బద్దలు కొట్టుకుని కాల్పులు జరుపుతూ బయటపడిన సాహసం ఆయనకే చెల్లింది.
ఇటీవలి కాలం: 2021 గడ్చిరోలి, 2024 కాంకేర్ ఎన్‌కౌంటర్ల నుండి కూడా చాకచక్యంగా తప్పించుకుని శత్రువుకు సవాలుగా నిలిచారు.
యుద్ధ తంత్రాలు (Military Tactics)
ప్రభాకర్ కేవలం క్షేత్రస్థాయి పోరాట యోధుడే కాదు, ఒక గొప్ప యుద్ధ వ్యూహకర్త (Military Strategist). ఆయన అనుసరించిన తంత్రాలు గెరిల్లా యుద్ధ నీతిలో కీలకమైనవి:
గెరిల్లా నిఘా మరియు ముందస్తు సమాచారం: శత్రువు (పోలీసులు) సివిల్ డ్రస్సులో వచ్చినా లేదా మారువేషంలో వచ్చినా పసిగట్టేలా తన దళ సభ్యులకు శిక్షణ ఇచ్చేవారు. సిర్నపల్లి ఘటనలో లేదా రామడుగు ఘటనలో ఆయన చాకచక్యంగా తప్పించుకోవడానికి కారణం ఆయన ‘సెంట్రీ’ (కాపలా) వ్యవస్థపై పెట్టిన నమ్మకం.
అస్సాల్ట్ వ్యూహాలు (Assault Tactics): పాపన్నపేట పోలీస్ స్టేషన్ దాడిలో ఆయన అనుసరించిన ‘సడన్ అటాక్’ వ్యూహం అద్భుతమైనది. శత్రువు తేరుకునే లోపే వాహనంలో నేరుగా స్టేషన్ గేటులోకి దూసుకెళ్లి దాడి చేయడం ఆయన తెగింపునకు నిదర్శనం.
మైన్ల వినియోగం: రామారెడ్డి అవుట్ పోస్ట్ దాడిలో ఆయన డైరెక్షనల్ మైన్లను ట్రక్కులలో అమర్చి, టైమ్ బాంబులు మరియు రిమోట్ కంట్రోల్ ద్వారా పేల్చాలని చూశారు. సాంకేతిక లోపాలు వచ్చినా, ప్లాన్ “B” (రిమోట్) కూడా సిద్ధం చేసుకోవడం ఆయన ముందుచూపుకు సాక్ష్యం.
హెలికాప్టర్ వ్యూహం: అడవుల్లో హెలికాప్టర్లు దిగే సమయంలో వాటి గమన వేగాన్ని, దిశను అంచనా వేసి గురితప్పకుండా కాల్చడం ద్వారా వాయుసేన పైలట్లను హతమార్చడం విప్లవ యుద్ధ చరిత్రలో ఒక ప్రత్యేకమైన ఎత్తుగడ.
వలయాలను చేధించడం (Breaking the Ambush): శత్రువు చుట్టుముట్టినప్పుడు (Encirclement) భయపడకుండా, బలగాలను ‘బ్రేకింగ్ ఫోర్స్’గా విభజించి, అత్యంత బలహీనంగా ఉన్న వైపు నుండి మెరుపు దాడి చేసి వలయాన్ని ఛేదించి బయటపడటం ఆయన ప్రత్యేకత.
కుటుంబ వియోగం – త్యాగం:
16 ఏళ్లకే పెళ్లయినా, ఉద్యమమే లోకమని భావించి భార్యాపిల్లలకు దూరమయ్యారు. తన కూతురు రజిత పుట్టుకతోనే వికలాంగురాలైనా, ఆమె అనారోగ్యంతో చనిపోయినప్పుడు చివరి చూపుకు కూడా వెళ్లలేని నిస్సహాయత ఆయనను మానసికంగా కలచివేసింది.
పార్టీలోకి వచ్చిన తర్వాత కేవలం ఒక్కసారి (1995లో) మాత్రమే తన ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను కలిశారు. అదే వారిని చూడటం చివరిసారి. “వర్గ పోరాటంలో రగులుతున్న రక్తపు నిర్బంధం నా తల్లిదండ్రుల చివరి చూపును కూడా దక్కనివ్వలేదు” అని ఆయన రాసుకోవడం ఆయనలోని పుత్రుడి ఆవేదనను తెలియజేస్తుంది. పత్రికల్లో వచ్చిన వారి మృతదేహాల ఫోటోలను చూసి ఆయన ఓదార్పు పొందే స్థితికి చేరుకున్నారంటే, ఆ త్యాగం ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు.
పోరాట క్షేత్రంగా మార్చుతన కళ్ల ముందే చనిపోయిన సహచరుల పేర్లను, వారి కులాలను, వారి నేపథ్యాలను ఆయన గుర్తుపెట్టుకుని ఆత్మకథలో రాశారు. ముఖ్యంగా తన గార్డుగా ఉండి ప్రాణాలు కోల్పోయిన మానస (మాజీ సభ్యుడి కుమార్తె) గురించి రాసిన తీరు ఆయన సహచర ప్రేమను చాటుతుంది.ఒక కరుడుగట్టిన విప్లవకారుడి లోపల కూడా ఒక సున్నితమైన మనిషి ఉంటాడనేది చందర్ జీవితంలో కనిపిస్తుంది:
చరిత్ర కొన్నిసార్లు రక్తాక్షరాలతో లిఖించబడుతుంది. మరికొన్నిసార్లు ఒక మనిషి త్యాగంతో పునర్నిర్మించబడుతుంది. తెలంగాణ మట్టిలో పుట్టి, దండకారణ్య అడవులను తనకున్న లోకేటి చందర్ అలియాస్ ప్రభాకర్ జీవితం ఒక సాహస గాథ. కేవలం ఆరో తరగతి చదివిన ఒక సామాన్య రైతు బిడ్డ, వేలాది మంది గెరిల్లా సైనికులకు పాఠాలు చెప్పే స్థాయికి ఎలా ఎదిగారు? మృత్యువు ముప్పై సార్లు ఎదురుపడినా ఎలా జయించారు?
ఫిబ్రవరి 5, 2026న గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌లో ఆయన నేలకొరిగిన వేళ.. ఆయన రాసుకున్న ఆత్మకథలోని అరుదైన కోణాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.ప్రభాకర్ కరుడుగట్టిన విప్లవకారుడు మాత్రమే కాదు, అత్యంత సున్నితమైన మనసున్న మనిషి. ఆయన ఆత్మకథలో రాసుకున్న వ్యక్తిగత వియోగాలు చదివితే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు.
“నేను నమ్మిన వర్గపోరాటం నా తల్లిదండ్రుల చివరి చూపును దక్కనివ్వలేదు. నా కూతురు రజిత వికలాంగురాలిగా పుట్టి, చివరకు మరణించినప్పుడు కూడా నేను పక్కన లేను. పత్రికల్లో వచ్చిన మా అమ్మనాన్నల ఫోటోలను చూసి కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయాను.”
తన తల్లిదండ్రుల మరణ వార్తను కూడా విలేకరులు పంపిన ఫోటోల ద్వారానే తెలుసుకోవాల్సి రావడం ఆయన ఉద్యమ జీవితంలోని కఠినత్వాన్ని తెలియజేస్తుంది.
ఒక విప్లవకారుడు సమాజ విముక్తి కోసం తన రక్తాన్ని మాత్రమే కాదు, తన కుటుంబ అనుబంధాలను కూడా ఎలా బలిదానం చేస్తాడో ప్రభాకర్ జీవితం నిరూపించింది.
ఒకే కుటుంబం.. ఒకే ఆశయం..
లోకేటి చందర్ నుంచి రమేష్ వరకు: ముప్పై ఏళ్ల దండకారణ్య పోరాటంలో ఒక కుటుంబం చేసిన అద్వితీయ త్యాగాల చరిత్ర.
విప్లవం అంటే కేవలం సిద్ధాంతం కాదు, అదొక జీవన శైలి అని నిరూపించింది లోకేటి చందర్ కుటుంబం. తండ్రి తుపాకీ పడితే, తల్లి జనతన సర్కారులో ప్రజల కోసం పనిచేసింది.. కూతురు అడవి బిడ్డలకు అక్షరాలు నేర్పితే, కొడుకు తన పాటతో విప్లవ చైతన్యాన్ని రగిలించాడు. తెలంగాణ మట్టిలో పుట్టి, ఛత్తీస్‌గఢ్ అడవుల్లో విప్లవ కేతనాన్ని ఎగురవేసిన ఈ కుటుంబ ప్రస్థానం, భారత విప్లవ చరిత్రలోనే అత్యంత అరుదైనది.
లోకేటి చందర్ అలియాస్ ప్రభాకర్ 1991లో పూర్తికాల విప్లవకారునిగా మారిన తర్వాత, 2004లో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తనతో పాటు తన భార్య సులోచనను, కూతురు లావణ్యను, కుమారుడు రమేష్‌ను సైతం దండకారణ్య పోరాట క్షేత్రంలోకి తీసుకెళ్లారు. ఒక సామాన్య కుటుంబం అడవి బాట పట్టి, సాయుధ పోరాటంలో భాగస్వామ్యం కావడం విప్లవోద్యమంలో ఒక పెను సంచలనం.
ప్రభాకర్ భార్య సులోచన, అడవిలో కేవలం భార్యగా మాత్రమే కాకుండా, ‘జనతన సర్కారు’ (ప్రజల ప్రభుత్వం)లో క్రియాశీలక బాధ్యతలు నిర్వహించారు. ఆదివాసీల విద్యా, వైద్య, ఆర్థిక అభివృద్ధి కోసం అలుపెరుగని కృషి చేశారు. అత్యంత కఠినమైన అడవి పరిస్థితుల్లో పనిచేస్తూ, అనారోగ్యం పాలైన సులోచన 2018లో విప్లవ బాటలోనే అమరురాలయ్యారు. భార్య మరణించినా ప్రభాకర్ తన పోరాట పటిమను వీడలేదు.
ప్రభాకర్ కుమార్తె లావణ్య, అడవిలో తుపాకీ కంటే అక్షరాన్నే నమ్ముకుంది. పార్టీలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ, అక్షరం ముక్క రాని వందలాది ఆదివాసీ బిడ్డలకు విద్యాబుద్ధులు నేర్పారు. అయితే, తీవ్ర అనారోగ్యం కారణంగా ఆసుపత్రికి వెళ్లిన సమయంలో ఛత్తీస్‌గఢ్ పోలీసులకు చిక్కి, ప్రస్తుతం జైలు జీవితాన్ని గడుపుతున్నారు.
కుమారుడు రమేష్, ‘చేతన నాట్య మంచ్’ (CNM)లో అద్భుతమైన కళాకారునిగా పేరు తెచ్చుకున్నారు. తన ఆటపాటలతో అడవిని ఉర్రూతలూగించడమే కాకుండా, ఆర్గనైజర్‌గా ఎదిగి జిల్లా కమిటీ మెంబర్ (DCM) స్థాయికి చేరుకున్నారు. దండకారణ్యంలో దశాబ్దాల పాటు పోరాడిన రమేష్, మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2025 డిసెంబర్‌లో తెలంగాణ ప్రభుత్వం ముందు లొంగిపోయారు.
ప్రభాకర్ జీవితం కేవలం యుద్ధ తంత్రాల సమాహారం కాదు, తన కుటుంబాన్నే దేశం కోసం, ఆశయం కోసం అంకితం చేసిన ఒక మహోన్నత త్యాగశీలి గాథ.
ఒక కుటుంబం మొత్తం విప్లవమే ఊపిరిగా బతికిన ఈ గాథ, తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో ఎప్పటికీ ఒక ధ్రువతారలా నిలిచిపోతుంది. ప్రభాకర్ వెలిగించిన విప్లవ జ్యోతి, ఆయన కుటుంబం చేసిన త్యాగాలు భావి తరాలకు ఒక నిరంతర ప్రేరణ.
35 ఏళ్ల పాటు కఠినమైన అడవిలో, ఆకలిని భరిస్తూ, ఇనుప గుళ్ల వర్షంలో బతికిన ప్రభాకర్, ఫిబ్రవరి 5న తుది శ్వాస విడిచారు. ఆయన మరణం ఒక వ్యక్తి ముగింపు కావచ్చు, కానీ ఆయన లిఖించిన చరిత్ర ఒక విప్లవ పాఠం. వేలాది మందికి సైనిక శిక్షణ ఇచ్చి, సిద్ధాంతపరమైన అవగాహన కల్పించిన ప్రభాకర్, భారత విప్లవ పోరాట చరిత్రలో ఒక చెరగని సంతకం.
శత్రువు దృష్టిలో ఆయన ఒక కరుడుగట్టిన మావోయిస్ట్ కావచ్చు, కానీ ఆయన ఆత్మకథను చదివితే ఆయన సమాజంలోని అట్టడుగు వర్గాల విముక్తి కోసం తన వ్యక్తిగత జీవితాన్ని బలి ఇచ్చిన ఒక నిబద్ధత గల యోధుడిగా కనిపిస్తారు.
అడవిలో పూసిన ఈ తెలంగాణ పువ్వు వాడిపోవచ్చు.. కానీ ఆ పూవు వెదజల్లిన ఆశయ పరిమళం మరో ప్రభాతానికి నాంది పలుకుతూనే ఉంటుంది.
జోహార్ కామ్రేడ్ ప్రభాకర్! జోహార్ అమరవీరులకు!
ఫిబ్రవరి 8 ,2026
జంపన్న (డెమొక్రటిక్ సోషలిస్ట్)








